జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత

Robert Mugabe

 

హరారే: జింబాబ్వేకు సుదీర్ఘకాలం అధ్యక్షుడుగా పనిచేసిన రాబర్ట్ ముగాబే (95) కన్ను మూశారు. ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరుగా ఆయన పేరుగాంచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి. జింబాబ్వే జాతిపిత, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్ను మూశారని తెలియజేయడానికి చింతిస్తున్నానని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మంగాగ్వా శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలియజేశారు. జింబాబ్వేకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత తొలి తరం నాయకుల్లో ముగాబే ఒకరు.

మూడు దశాబ్దాల పాటు జింబాబ్వేను పాలించిన ముగాబేను 2017లో సైనిక తిరుగుబాటు ద్వారా అధ్య క్ష పదవినుంచి దించేశారు. 1924 ఫిబ్రవరి 21న నాటి రొడేషియాలో ముగాబే జన్మించారు.1964లో రొడేషియా ప్రభుత్వాన్ని విమర్శించినందు కు ఎలాంటి విచారణ లేకుండానే దశాబ్దం పాటు జైల్లో పెట్టారు. 1973లో జైల్లో ఉండగానే ఆయనను జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను)కు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జింబాబ్వేకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన 1980 లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

1987లో ప్రభుత్వాన్ని రద్దు చేసి అధ్యక్షుడిగా పీఠమెక్కారు. అధికారం తొలి నాళ్లలో ఆయన ప్రభుత్వం చేపట్టిన విధానాలు ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకున్నప్పటికీ తర్వాతి కాలంలో ఆయన తన ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచి వేసిన తీరు సర్వత్రా తీవ్ర విమర్శలకు కారణమైంది. ఫలితంగా ఆయన పలుకుబడి కూడా శరవేగంగా తగ్గిపోతూ వచ్చింది. చివరికి సైనిక తిరుగుబాటుతో ఆయన గద్ద్దె దిగాల్సి వచ్చింది.

Zimbabwe Former President Robert Mugabe passed away

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.