పరిషత్‌కు ‘ఆన్‌లైన్’ నామినేషన్

Zila Parishad electionsఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలకు తొలిసారి అమలు
హార్డ్ కాపీ కచ్చితంగా ఆర్‌ఒకు సమర్పించాల్సిందే

మన తెలంగాణ/హైదరాబాద్: టెక్నాలజీ పెరిగింది.. అందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడం, వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకుని వెళ్లడం వాటిలో సమాచారాన్ని రాసి, మళ్లీ ఆర్‌ఒకు సమర్పించడం. ఇప్పటి వరకు ఇదంతా ఒక తతంగం. కానీ ఆర్‌ఒ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకోకుండా ఆన్‌లైన్‌లోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ల్యాప్‌టాప్, కంప్యూటర్ అందుబాటులో ఉంటే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లోనే నామినేషన్ వివరాలన్నింటిని నింపవచ్చు. ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థి వాటిని ప్రింట్ తీసుకుని ఆర్‌ఒ కార్యాలయానికి వెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ నామినేషన్ చాలా సులభంగా ఉంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్యాండిడేట్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో పోటీలో ఉండే అభ్యర్థికి సంబంధించి హ్యాండ్‌బుక్, దరఖాస్తులు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, నాలుగో ఆప్షన్‌గా ఆన్‌లైన్ నామినేషన్ ఫర్ రూరల్ బాడీస్ అని ఉంటుంది.

దానిమీద క్లిక్ చేస్తే ఎంపిటిసి స్థానానికి, జడ్‌పిటిసి స్థానానికి ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్స్ చూపెడుతుంది. ఏ అభ్యర్థి ఏ పదవికి పోటీ చేస్తున్నారో దానిని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. ఒక దరఖాస్తులో ఎన్ని వివరాలు రాయాల్సి ఉంటుందో వాటన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో కూడా నమోదు చేసే వెసులుబాటు ఉంది.

ఆస్తులు, ఇతర పత్రాలను పిడిఎఫ్ ఫైల్స్ రూపంలో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్‌మిట్ నామినేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని ఖచ్చితంగా ఆర్‌ఒకు సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్ సబ్‌మిషన్ నామినేషన్ పరిగణనలోకి తీసుకోరాని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు ‘మన తెలంగాణ”కు చెప్పారు. గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ అమలు చేశారు. ఆ తరువాత ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Zila Parishad election Nominations on Online

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పరిషత్‌కు ‘ఆన్‌లైన్’ నామినేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.