దళిత ఎంపీకి కారు కోసం చందాలు

Remya Haridas

తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన రమ్య హరిదాస్‌కు రూ.14 లక్షల విలువైన కారును బహుకరించడానికి చందాలు వసూలు చేసి కేరళ యువజన కాంగ్రెస విమర్శల పాలైంది. అళత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దళిత ఎంపీ రమ్య హరిదాస్‌కు కారు కొనేందుకు స్తోమత లేదని భావించిన యువజన కాంగ్రెస్ నాయకత్వం ఆగస్టు 9న యువజన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు తాము చందాలు వసూలు చేసి కొన్న కారును అందచేయాలని నిర్ణయించింది. దీని కోసం వెయ్యి రూపాయల చొప్పున కూపన్లు రూపొందించి వాటిని యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు విక్రయించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అక్కర సమర్థించగా కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ముళ్లప్పళ్లి రామచంద్రన్ వ్యతిరేకించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిపిఎం కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించింది. ఎంపీగా ఆమెకు నెలకు రెండు లక్షల రూపాయల వేతనం లభిస్తుందని, వాయిదాల పద్ధతిలో కారు కొనేందుకు అవసరమైన స్తోమత ఆమెకు ఉందన్నది సిపిఎం వాదన. ఇదిలా ఉండగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో తమ నిర్ణయాన్ని సమీక్షంచుకోవడానికి అళత్తూర్ యువజన కాంగ్రెస్ సోమవారం సమవేశం అవుతోంది. ఎంపీలకు అధికారిక వాహనం ఉండదని, వారికి వేతనం భారీగానే ఉన్నా సిబ్బంది జీతాలకు, ఇంటి అద్దెకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అళత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలయం ప్రదీప్ అంటున్నారు. పేద కుటుంబానికి చెందిన దళిత ఎంపీకి తాము కారును బహుకరిస్తున్న విషయం తెలియదని ఆయన చెబుతున్నాడు.

 
Youth Cong move to buy a car for MP Remya Haridas kicked up row, Youth Cong collected money from party workerys to gift a car to Alathur MP

The post దళిత ఎంపీకి కారు కోసం చందాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.