గగనానికి పుడమికి మధ్య…

తెలుగులో అక్కడక్కడ కొంతమంది హిజ్రా రచయితలు ఉన్నారు కాని మన తెలుగు సాహిత్యంలో లేరు. వారి మీద పుస్తకాలు కూడా ఎక్కువగా కనపడవు. అలాంటిది ఒక యువకుడు వారి భాదల గురించి, కష్టాల గురించి, వివక్ష గురించి, హక్కుల గురించి, వారి వేదన గురించి క్లుప్తంగా హిజ్రాల అన్ని భావోద్వేగాల గురించి పుస్తకంలో కవిత్వీకరించడం సాహసమే. ‘వై’ ప్రశ్న లేని జీవితం వ్యర్థం. ప్రశ్న మన మెదడులో పుడుతోంది అంటే మనం ఆలోచిస్తున్నామని అర్థం. అలాంటి ప్రశ్నే […]

తెలుగులో అక్కడక్కడ కొంతమంది హిజ్రా రచయితలు ఉన్నారు కాని మన తెలుగు సాహిత్యంలో లేరు. వారి మీద పుస్తకాలు కూడా ఎక్కువగా కనపడవు. అలాంటిది ఒక యువకుడు వారి భాదల గురించి, కష్టాల గురించి, వివక్ష గురించి, హక్కుల గురించి, వారి వేదన గురించి క్లుప్తంగా హిజ్రాల అన్ని భావోద్వేగాల గురించి పుస్తకంలో కవిత్వీకరించడం సాహసమే. ‘వై’ ప్రశ్న లేని జీవితం వ్యర్థం. ప్రశ్న మన మెదడులో పుడుతోంది అంటే మనం ఆలోచిస్తున్నామని అర్థం. అలాంటి ప్రశ్నే ఈ యువ కవి సంధించారు. ఆయన మొదటి ప్రశ్న హిజ్రాలను థర్డ్ జెండర్ అని ఎందుకు ప్రకటించారు. జెండర్ కి సంఖ్యలు ఎందుకు. ఈ యువ కవి ప్రశ్న సమ్మతమైనదే అనిపించింది. ‘వై’ ఒక దీర్ఘకావ్యం , డ్బ్బై పేజిల్లో ఉన్న సుదీర్ఘ కవిత. గగనానికి పుడమికి మధ్యలో వేలాడుతున్నాము. అంటే ఇక్కడ గగనం పురుషుడు, పుడమి భూమి మధ్యలో వేలాడుతున్న వారి జీవితాల పరిస్థితిని వివరించారు.

మా దేహాలను ఊడ్చి ఒక మూలకేసి నొక్కితే/అయినవారు ఎంగిలి శూలాలతో హృది లోయను తవ్వితే/మగతనాన్ని గుమ్మాన వదిలేసి సమాజంలోకి అడుగుపెట్టాము. ఎంగిలి శూలాలు లాంటి పద ప్రయోగం నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కడ చదవలేదు. ఈ కవి పద ప్రయోగాలను, పద బంధాలను ప్రయోగించడంలో అత్యంత సమర్ధుడు. ఇలాంటి కవిత్వం రాయాలంటే సమస్య తనదేనని భావించగలగాలి అప్పుడే కవిత్వం కడిగిన ముత్యంలా సహజంగా ఉంటుంది.
మేము మీకు ఎదురైతే పండు వెన్నెల వలే పలకరించండి. మనం గమనించే ఉంటాము హి్రజ్రాలు ఎదురైనప్పుడు వారిని చీత్కారంతో, అవహేళనతో చూస్తాము. అది వారు భరించలేరని వారి మనసు ముక్కలు అవుతుందని కావున వారు ఎదురైతే చల్లని నవ్వుతో వెన్నెల వలే పలుకరించండి అనడం కవి వారి మనసుల లోతులను పరిశీలించారని తెలుస్తుంది. పగిలిన అద్దంలో మానవత్వపు మనిషి కోసం వెతుకుతున్నాము. ఇక్కడ అద్దం సమాజం మరి సమాజం ఎందుకు పగిలింది మానవత్వం లేకపోవడమే. ఆ పగిలిన అద్దంలో ఎక్కడో ఒక్క చోటైన మానవత్వం ఉన్న మనిషి లేక పోతాడా, వారు మమ్మల్ని గుర్తించక పోతారా అని వారి ఆశ.

ఆకులు రాలిన చెట్టు వసంతానికై ఎదురు చూసినట్లు ఒక మెత్తని స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాము. అనే ఈ వాక్యాలు వారి ఒంటరితనాన్ని సూచిస్తుంది మరియు మోడుబారిపోయిన జీవిత వృక్షం మళ్ళీ చిగురించక పోతుందా అనే కోరికతో జీవితాన్ని ఈడుస్తున్న దయనీయమైన స్థితిని పరిచయం చేశారు కవి. చిటికెడు వెలుగుల్ని, పిడికెడు ఆత్మీయతను అందించండి అనడంలో బంధాలకు దూరమైనా వారి దీనగాధలను మన కళ్ళకు కట్టారు కవి.

గడియారం కాలాన్ని మింగినట్లు మమ్ములను మింగుతున్నారు. గడియారం కాలాన్ని ముందుకు నడుపుతుందని చాలామంది వాడి ఉంటారు కాని ఈ యువకవి గడియారం కాలాన్ని మిగుతోందని తనదైన శైలిలో సందర్భాన్ని, విషయాన్నీ వివరించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇక్కడ గడియారం స్త్రీ పురుషులే అనుకుంటే కాలం హిజ్రాలనే అర్థం వస్తుంది. ఇలా రకరకాల మెటాఫర్స్ ని అవసరమైన మేరకు చక్కగా అందరికి అర్థమయ్యేలా రాయడం వల్ల కవిత్వంలోని ఫీల్ ని, ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడానికి సులభంగా ఉన్నది.

చీకటి బొట్లు కన్నుల స్నేహాన్ని తెంచుకొని రాలిపడ్డాయి. కన్నీళ్లు కూడా చీకటిగా ఉంటాయని చెప్పడం, ఆ కన్నీరు కూడా తమతో ఉండకుండా వెళ్ళిపోయిందని, అది కూడా మమ్మల్ని ఒంటరి చేసి పోయిందని చెప్పడానికి వాడిన వాక్యం. హి్రజ్రాలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని వాటిని నిలువరించాలని చెప్పడానికి రాసిన కవిత్వ పాదాలను చదువుతుంటే మనసు ముక్కలై పోతుంది. చివరిలో మీలో ఎవరైనా అమ్మ ప్రేమను, నాన్న భద్రతను తెచ్చి ఇవ్వగలరా అంటూ సాగిన ఆ కవిత్వ పాదాలు చదువుతున్నప్పుడు మూగ రోదన అనుభవించాను.

ఈ దీర్ఘ కావ్యంలోని కవిత్వం ఎన్నో భావోద్వేగాలను దాటుతూ పోతుంటుంది. కవి చేసిన గొప్ప పని బాధను చెప్తున్నప్పుడు మనం కూడా బాధపడతాము, వారి ఆత్మస్థైర్యాన్ని వివరిస్తున్నప్పుడు వారిపై గౌరవాన్ని పెంచుకుంటాము. వారి ఒంటరితనం గురించి చెప్తున్నప్పుడు మన చుట్టూ దిగులు మేఘాలు కమ్ముకునేలా చేశారు. అంటే కవిత్వంతో రీడర్ అనుసంధానాన్ని చివరి అక్షరం వరకు సాగేలా చేయడంలో కవి సఫలీకృతం అయ్యారు. పుస్తకం చదివిన తర్వాత కచ్చితంగా రెండోసారి చదవాలి అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలను మాత్రమే మనం పదే పదే చదువుకోగలము ఆ కోవకు చెందిన పుస్తకమే వై.

గత రెండు సంవత్సరాల్లో వందల రచనలు చేసి అఖిలాశ అంటే సాహిత్యకారులు గుర్తించేలా ఎదగడం వారి పట్టుదల, కష్టం, శ్రమ, సాహిత్యం పట్ల ప్రేమ కనపడుతాయి. ఏది ఏమైనా ఈ కవి రాసిన వై అనే ఈ దీర్ఘ కావ్యం హిజ్రాల పట్ల నా అభిప్రాయాలను మార్చుకున్నాను. మరెన్నో కొత్త అంశాలను రాయాలని, సాహిత్య దిగ్గజాలు సైతం వదిలేసినా వస్తువులపై కవిత్వం రాయలను కోరుకుంటున్నాను.

Y the Book of all the Emotions of Hijra

-పద్మావతి దేవి

Related Stories: