గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు. అందివచ్చిన ఆ సాంకేతికతను ఉపయోగించుకోవటంలో నేటి యువత ముందుంది. మరీ ముఖ్యంగా మహిళలు దీన్ని సొంతం చేసుకోవడంలో ఇంకా ముందున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం దగ్గర్నుంచి ఇంటి నుంచే ఉద్యోగం చేయటం వరకూ ప్రతీదీ వీళ్ల సొంతం. ఆరోగ్య సూత్రాలు, ఆనంద వినోదాల నుంచి, ఆహార పానీయాల వరకు అన్నింటినీ చూస్తున్నారు, చేసి చూపిస్తున్నారు.

రాత్రి పదకొండు గంటలయింది. అందరి భోజనాలు అయిపోయాయి. పిల్లలు కూడా నిద్రపోయారు.  పాలు, కూరలు వగైరా మిగిలినవన్నీ ఫ్రిజ్‌లో పెట్టి కిచెన్ డోర్ వేసి మందులు వేసుకుని పడుకున్నాను. సడన్‌గా మెలకువ వచ్చింది. ఏదో తేడాగా ఉండింది. నాలుక మొద్దుబారినట్టు అనిపించింది. లేచి కూర్చున్నాను. నీళ్లు తాగాను. టైమ్ చూస్తే రాత్రి ఒకటిన్నర అయింది.. నాలుక చాలా లావుగా వాచిపోయింది. మంటపెడుతోంది.
ఏమయిందో… ఏం చేయాలో తోచలేదు… అసలు ఆ రాత్రి నా సమస్యకు ఏ డాక్టరు దగ్గరకు వెళ్లాలో తెలీదు.
ఫ్యామిలీ డాక్టర్‌కు కాల్ చేయడం అవసరమా? లేదా తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లాలా? అప్పటికప్పుడు హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరముందా?? పొద్దున చూద్దాంలే అని పడుకుందామంటే నాలుక వాపువల్ల ఏది తాగినా గొంతు దిగడం లేదు. ఊపిరాడడం కష్టంగా ఉంది..
లాభం లేదు అనుకుంటూ లేచి వచ్చి హాల్లో ఉన్న కంప్యూటర్ ఆన్ చేసి నాలుక వాపు, మంట ఉంటే సమస్య ఏమిటి అని గూగులమ్మని అడిగాను..
సమాధానం వచ్చింది.
ఇది ఒక అలర్జీ వల్ల వస్తుంది. ఆ అలర్జీ మొదటిసారి కావొచ్చు. మనకు తెలీని కారణం కూడా కావొచ్చు. సెట్రిజిన్ వేసుకుంటే తగ్గుతుంది అని అన్నారు.
హమ్మయ్యా నా సమస్యకు కారణం తెలిసింది అనుకుని పడుకోలేదు. కూర్చునే నిద్రపోయా. పొద్దున్నే ఆరుగంటలకు నా కొడుకును పంపి సిరప్ తెప్పించి వేసుకున్నా. డాక్టర్‌కి కాల్ చేసి అడిగితే అదే వేసుకోమన్నాడు. రెండు గంటల తర్వాత నాలుక వాపు తగ్గుముఖం పట్టింది.

Womens Day

అసలు ఎవరీ గూగులమ్మ..
ఎక్కడుంటుంది… ఎలాగుంటుంది…. ఎలా కలుసుకోవడం????
ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్… ఐపాడ్, లాప్‌టాప్, మొబైల్ ఫోన్, అంతర్జాలం.. అదేనండి ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలో ఏ మూల ఉన్నా క్షణాల్లో మాట్లాడేసుకుంటున్నారు. చూసుకుంటున్నారు.. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ పంపించుకుంటున్నారు. వేలమైళ్ల దూరంలో ఉన్నా కూడా ఇక్కడ జరిగే పెళ్లీ పేరంటాలు ప్రత్యక్షంగా చూసేస్తున్నారు. ఇటీవలే మొబైల్‌ఫోన్ ద్వారా అమెరికాలో అమ్మాయి, అబ్బాయి ఉంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉండి నిశ్చితార్ధం చేసేసారు. ఇద్దరికీ బట్టలు, నగలు, పువ్వులు, పళ్లు, స్వీట్లు పెట్టారు..తర్వాత భోజనాలు ఎవరున్నచోట వాళ్లే చేసారనుకోండి.
వింతగా ఉంది కదా.. కాని ఇది నిజ్జంగా నిజం..

women's day 2019

నమ్మట్లేదా.. నమ్మే ఉంటారు లెండి.. సరే అయితే నేను కొన్ని విషయాలు చెప్తా వినండి..
ఇప్పుడంటే కంప్యూటర్ లేదా ఫోన్‌లో తెలుగు టైప్ చేయడం వగైరా చాలా సులువు అయింది కాని కొన్నేళ్ల క్రితం చాలా కష్టంగా ఉండేది. 2006 ప్రాంతంలో ఇంటర్నెట్, కంప్యూటర్లు ఉన్నత విద్యలు చదివే విద్యార్థులు, పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపారస్తులు, సాంకేతిక నిపుణులు వాడేవారు. క్రమక్రమంగా విద్యార్థుల కోసం ఇంట్లో కంప్యూటర్ వాడడం మొదలుపెట్టారు. కాని అది వారికి మాత్రమే ఉపయోగపడేది. తెలుగు టైప్ చేయడం ఒక కష్టమైన పనిగా ఉండేది. ఇంటర్నెట్ వాడకం కూడా ఖరీదైన వ్యవహారమే. మొబైల్ ఫోన్లు కూడా అంతగా లేవు. ధనవంతులు వాడినా చాలా ఖరీదు.. అప్పుడు కొందరు ఔత్సాహికులైన సాంకేతిక నిపుణులు తెలుగు టైపింగ్ చేసే సులభమైన పద్ధతులు తయారుచేసారు. నేను అప్పుడే అంతర్జాలం పరిచయం చేసుకున్నా. మా పిల్లల చదువులు, ఉద్యోగాల వేటకోసం గూగులమ్మ అదేనండి గూగుల్ సెర్చ్ గురించి తెలుసుకున్నా. మెల్లిమెల్లిగా ఒక్కో విషయం అంటే అంతర్జాలంలో ఎటువంటి సమాచారం ఉంది. దాన్ని ఎలా వెతకవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు అని నిరంతరం అన్వేషించేదాన్ని. నాకు ఇష్టమైన పాటలు, కథలు, వంటలు ఎన్నో దొరికేవి…
అప్పటివరకు ఇంగ్లీషు బ్లాగులు చాలా ఉండేవి. కాని తెలుగులో మాత్రం అప్పుడప్పుడే ప్రారంభమయ్యాయి. నేను కూడా బ్లాగు మొదలెట్టాను. టైపింగ్ తప్ప ఇతర సాంకేతిక విషయాలు ఏవీ తెలీదు. అయినా నెట్‌లో పరిచయమైనవారు చాలామంది సాయం చేసారు. నాకు ఇష్టమైన హాబీస్‌ని బ్లాగుల రూపంలో తయారుచేసుకుని నాకు నచ్చిన అంశాలమీద సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసుకున్నాను.

International Women's Day Celebration
అప్పుడు అంటే 2005, 2006 ప్రాంతంలో ఇంటర్నెట్ వాడే ఆడవాళ్లంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఇంటర్నెట్ వాడే ఆడవాళ్లు మంచివాళ్లు కాదని మగవాళ్లు అనుకుంటే, తమ గురించి ఏమనుకుంటారో, ఎవరిని నమ్మొచ్చో లేదో అని ఆడవారు భయపడేవారు. కాలక్రమేణా బ్లాగుల వ్యాప్తి జరిగింది. అప్పుడది బ్లాగుల స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మగవారైనా, ఆడవారైనా తమ ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మకతను అక్షరాల రూపంలో బ్లాగుల్లో నిక్షిప్తం చేసేవారు. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చదివి వెంటనే వ్యాఖ్యల రూపంలో తమ స్పందన తెలిపేవారు. అలా మరింత ఉత్సాహంతో రాస్తూ ఉండేవారు.. తర్వాత నా ప్రయాణం ప్రింట్ మీడియాకు కూడా సాగింది. పత్రికల్లో రచనలు.. ఆ తర్వాత అంతర్జాల పత్రిక మాలిక ప్రారంభించాను. మెల్లిమెల్లిగా పెరుగుతున్న, వ్యాప్తి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఎంతోమంది మహిళలు అంతర్జాలాన్ని ఉపయోగించసాగారు. ఆ సమయంలోనే ఆర్కుట్ అనే సామాజిక వేదిక మొదలైంది. దేశ విదేశాల్లో ఉన్నవారు మిత్రులైనారు, ఆ తర్వాత అంటే 2009 లో ఫేస్బుక్ ఆవిష్కరించింది. ఈ ఫేస్బుక్ ఒక అద్భుతాన్ని సృష్టించింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత చాలా కాలానికి వచ్చిన వాట్సాప్, పింటరెస్ట్, ఇన్‌స్టాగ్రామ్.. ట్విట్టర్.. ఇలా ఎన్నో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మొదలయ్యాయి. నా ప్రస్థానం కూడా ఒక్కో మెట్టు పైపైకి ఎదగసాగింది. ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెరిగాయి.. సమాచార సేకరణ

విస్తృతమయింది.
అప్పటివరకు తమదైన సొంత ఫాంట్లు వాడుతున్న వివిధ పత్రికల వాళ్లు కూడా యూనీకోడ్ ఉపయోగం ప్రారంభించారు. రచయితల నుండి రచనలు మెయిల్ ద్వారా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక రచనలను పేపర్ మీద టైప్ చేయించి లేదా రాసి పోస్టులో పంపనవసరం లేకుండా మెయిల్ చేసేయొచ్చు. ఇదే అంతర్జాలం ద్వారా ఫోటోలు, వీడియోలు కూడా పంపుకోవచ్చు.
ఈ సులభమైన పద్ధతులవల్ల మహిళలు ఇంటినుండే ఎన్నో ఉపయోగాలు పొందారు. పొందుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన నా పబ్లికేషన్స్ ఇప్పుడు చాలా గొప్ప స్థాయిలో నిలబడడానికి కారణం ఈ ఇంటర్నెట్ అందించిన వరాలే. ఈనాడు ఎంతోమంది మహిళలు అంతర్జాలం ద్వారా ఎంతో సాధించారు. ఇంటినుండే అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో తమను తాము మెరుగుపరచుకుంటూ, కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ, తమకంటూ ఒక వ్యాపకం, ఒక వృత్తి, ఒక ఆదాయం ఏర్పాటు చేసుకుంటున్నారు.
అసలు ఇంటర్నెట్ ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో తెలుసా.. ఆ అద్భుతాలు తమ సొంతం చేసుకున్న కొందరు మహిళలను వారి మాటల్లోనే పరిచయం చేసుకుందాం…

అసలు ఈ అంతర్జాలం మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయానికొస్తే..
నేడు మహిళలు తమ రోజువారీ పనులకు ఇంటర్నెట్ ను విరివిగా ఉపయోగిస్తూ తమ పనులను సులభతరం చేసుకుంటున్నారు.

టీనేజ్ అమ్మాయిలు:
1. తమ చదువులు, బట్టలు, అలంకరణ సామగ్రి, మొదలైనవి తెలుసుకోవడానికి.
2. తమకు వచ్చిన కళలను , టాలెంట్, పెయింటింగులు, డాన్సింగ్, యాక్టింగ్ మొదలైనవి ఫోటోలు, యూట్యూబ్ వీడియో ద్వారా ప్రదర్శిస్తున్నారు.
3. స్నేహితులు, కొలీగ్స్, పై అధికారులతో కమ్యూనికేషన్
4. ఆన్లైన్‌లో తమ చదువుకు సంబంధించిన కాలేజీలు, కోర్సులు, కోచింగులు
5. ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా చేస్తున్నారు.
గృహిణి:
1. నిత్యావసర వస్తువులు, కూరగాయలు మొదలైనవి ఆన్లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు.
2. తమ ఇంటికి సంబంధించిన బిల్లులన్నీ (కరెంట్, నెట్, వాటర్, మెయింటెనెన్స్, పేపర్) ఆన్లైన్‌లో కట్టేసి ఎంతో సమయాన్ని, శ్రమను తగ్గించుకుంటున్నారు.
3. ఇంట్లో ఉండే షాపింగ్ చేస్తున్నారు. లేదంటే విండోషాపింగ్ కూడా చాలా సులభం.
4. తమకు, తమ కుటుంబానికి కావలసిన మందులన్నీ ఇంటినుండే నెట్ లేదా యాప్ ద్వారా తెప్పిస్తున్నారు. అది కూడా రాయితీతో.
5. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు. వంటలు,పెయింటింగ్, క్రాఫ్ట్, ముగ్గులు మొదలైనవి చాలా సులువుగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండే.
6. కాలేజ్ చదివే విద్యార్థులే కాదు వివాహితలు కూడా ఇంటినుండే ఉన్నత విద్యాభ్యాసం చేసే ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
7. వాట్సాప్ గ్రూపుల ద్వారా స్నేహితులు, బంధువులతో మాట్లాడుకోవచ్చు. కలుసుకోవచ్చు. ఆ కలయిక ఫొటోలు తర్వాత షేర్ చేసుకుంటున్నారు.
8. టీవీ ఛానెల్స్‌లోని సీరియల్స్ కూడా మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో యాప్‌ల ద్వారా చూడొచ్చు.
పెద్దవారికి:
1. తమకు ఇష్టమైన భక్తి సమాచారం, పాటలు, సినిమాలు వింటారు, చూస్తారు.
2. ఏదైనా యాత్రలకు వెళ్లాలన్నా, ఆలయాల గురించి తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది.
3. వేరువేరు దేశాలలో ఉన్న పిల్లలు, మనవళ్లతో వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నారు.
4. ఒంటరిగా అనిపిస్తే ఫోన్ కాల్ ద్వారా ఎవరితోనైనా మాట్లాడొచ్చు.
5. తమకు కావలసిన మందులు, ఇతర సామగ్రి మెడికల్ షాపునకు కాల్ చేసి ఇంటికే తెప్పించుకుంటున్నారు.
6. తమ పిల్లలకు, సోదరులకు, సోదరీమణులకు గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఆన్లైన్ చేసేస్తున్నారు.
7. డబ్బులు ఇవ్వాలన్నా, ఏవైనా తెప్పించుకోవాలన్నా, పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పే విరివిగా వాడేస్తున్నారు.

అమ్మలకో వేదిక
ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుండి అని చెప్పలేను కానీ, సోషల్ మీడియాతో నా ప్రయాణం మా అక్క మొదటిసారి రెడీఫ్‌లో మెయిల్ ఐడి ఓపెన్ చేసుకున్నప్పటి నుంచి మొదలైంది. ఇక ఆర్కుట్ వచ్చాక అదొక అద్భుతంలాగా అనిపించింది. స్నేహితుల్ని ఒక చోటికి చేర్చింది. యాహు మెసెంజర్‌లో చాటింగ్ మర్చిపోలేను. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక పక్కన ఉద్యోగం చేస్తూ ఇంటర్నెట్‌లో పుస్తకాలు చదవడం నాకు ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఇంటర్నెట్‌లో బ్లాగ్స్ పరిచయం అవడం నాకెంతో మేలు చేసింది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి అందమైన ప్రపంచానికి తలుపులు తెరిచింది. ఫేస్బుక్ ద్వారా ఎన్నో మంచి పరిచయాలయ్యాయి. నేను ఎంచుకున్న రంగంలో ముందుకెళ్లడానికి అవకాశాలు దక్కించుకోవడంలో చాలా సహాయం అయ్యింది.
ఫేస్బుక్‌లో మొట్టమొదటిసారి తెలుగులో అమ్మల కోసం “Telugu Moms Network” అని సమూహం నెలకొల్పినప్పుడు, 5 నెలల సమయంలో 3,100 కంటే ఎక్కువ అమ్మలు, మహిళలు ఒక చోట చేరి, వారివారి మనోభావాలను, అభిరుచులను, సమస్యలను, బిజినెస్ ప్రకటనలను, విజయాలను, మానసిక, శారీరక ఆరోగ్య సంబంధిత విషయాలు, మరెన్నో విషయాలు పంచుకుంటున్నారు అంటే ఇదంతా సోషల్‌మీడియా మహిమే. ఈ సమూహంలో అమ్మ అయినా, కాబోయే అమ్మ అయినా కావచ్చు, అమ్మమ్మ, నానమ్మ, అత్తమ్మ, ఇలా ఏ పాత్రలో ఉన్నా ఈ గ్రూప్ వారి కోసమే. అలానే ‘అనామిక’ అనే శీర్షిక ద్వారా సమూహంలో ఎవరికైనా సమస్యలు ఉండి.. కానీ వారి పేరుతో చెప్పుకోవాలని లేకపోతే, నాకు వారి సమస్య చెప్తే నేనా సమస్యని గ్రూప్‌లో వారి బదులు పోస్ట్ చేస్తాను. అప్పుడు ఇతర మహిళలు, అమ్మలు సహృదయంతో అర్ధం చేసుకుని వారికి తోచిన సలహాలు, సూచనలు ఇస్తారు. దీని వల్ల ఎందరికో ఉపయోగం.

ప్రదీప్తి విస్సంశెట్టి

అటు ఉద్యోగం.. ఇటు వ్యాపారం

ఉద్యోగం చేస్తున్న నాకు 2009లో తెలుగు బ్లాగుల గురించి తెలిసింది. రాయడం మొదలుపెట్టాను. చాలా మంది స్నేహితులయ్యారు. పరిచయాలు పెరిగాయి. కాని 2012లో ఇంటర్నెట్ నా జీవితంలో ఒక భాగమైంది. అప్పట్లో అమెరికా డల్లాస్లోని పాయింట్ ఆఫ్సెల్ (POS) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదిగాను. ఇల్లుమారితే ఎవరన్నా దేవుడిపటాలు తీసుకుని వెళ్తారు. కానీ నేను ముందు నా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకుంటా. ఉద్యోగంతోపాటుగా మొబైల్లో ఆన్‌లైన్ ద్వారా నగల తయారీదారులతో మాట్లాడి, నాణ్యత, ధర మొదలైనవి అందరికీ అందుబాటులో ఉన్నవీ, నాణ్యతగా ఉన్నాయని అనిపించినవే తీసుకుని అమ్మకానికి పెడతాను. ఆన్లైన్ పేజ్ ద్వారా నా నగల గురించి ప్రచారం చేస్తాను. MattFinish. AntiqueFinish, కెంపు, ముత్యాల ఆభరణాలు అమ్ముతాను. చాలామంది కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేస్తూనే, ఇంటినుండి నా తీరిక సమయాల్లో మరో వ్యాపారం చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాను.

రమణి రాచపూడి

నేను కుటుంబం, పిల్లలతో బిజీగా ఉన్నా కూడా ఎన్‌జిఓలతో కలిసి సేవాకార్యక్రమాలు చేసేదాన్ని. వాళ్ల కోసం వాలంటీర్‌గా పనిచేసాను. ఆ సమయంలో సమాజంలోని ఎన్నో సమస్యల గురించి తెలియవచ్చింది.ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా నన్ను కలిసినవారికి, మిత్రులకు కౌన్సిలింగ్ మొదలుపెట్టాను. మహిళలు తమ అవసరాల కోసం బయటకు వెళ్లడానికి కుటుంబసభ్యుల సహాయం కోసం ఎదురుచూడకుండా తమకు తామే సాయం చేసుకోవడానికి, ఎవరి మీదా ఆధారపడకుండా, తమ వాహనం తీసుకుని ఎక్కడికైనా వెళ్లి తమ పనులు చేసుకోవాలని ఇటీవలే మహిళల కోసం మోటార్ సైకిల్, టూవీలర్ ట్రైనింగ్ మొదలెట్టాను.

మహిళ ఎవరిమీదా ఆధారపడకూడదని…

ట్రైనింగ్‌కి వచ్చిన అమ్మాయిలు, మహిళల ఆత్మవిశ్వాసం చూసి నాకు మరింత స్ఫూర్తి కలిగేది. స్త్రీ రైడ్స్ (Stree Rides) అనే సంస్థను ప్రారంభించి మహిళలకు డ్రైవింగ్ నేర్పించడానికి జంటనగరాలలో వివిధ శాఖలను ఏర్పాటు చేశాను. నా ఆలోచనకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికలుగా మార్చుకున్నాను. డ్రైవింగ్ స్కూలు గురించిన ప్రచారం, నేర్చుకున్న అమ్మాయిల అనుభవాలను పంచుకునేదాన్ని. దీనివల్ల మరింతమంది మహిళలు డ్రైవింగ్ నేర్పించమని వస్తున్నారు. ఐఐటిలతో కలిసి Stree Rides ప్రారంభించాను. ఇక్కడినుంచే కాక బెంగళూరు, చెన్నై నుండి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. అక్కడ కూడా మా డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించమని. డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల అమ్మాయిలు ఉపాధిని కూడా సృష్టించుకోగలుగుతారు. స్విగ్గి, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీలో అమ్మాయిలు కూడా ఎక్కువ సంఖ్యలో చేరాలంటే వారికి ముందుగా టూవీలర్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. మా దగ్గర ట్రైనింగ్‌లో అమ్మాయిలకు కూడా ఈ ఫుడ్ డెలివరీ చేయాలి, తమకు తగిన ఆదాయం ఉండాలని కోరుకోవడం ఆనందంగా ఉంది.

అర్చన చిగుళ్లపల్లి

విజయవంతంగా పత్రిక నడుస్తోంది..

మనం చేసిన పని అవతలివాళ్లకు తెలియకుంటే దాని సార్ధకత ఉండదు. చూసినవాళ్లు దానికి సంబంధించిన మంచి చెడు చెప్తారు. మనలోని కళలు కూడా ప్రదర్శించుకోవడానికి ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది. నేను ప్రారంభించిన అచ్చంగా తెలుగు పత్రిక చాలా విజయవంతంగా నడుస్తోంది. అచ్చంగా తెలుగు వెబ్ సైట్ కూడా నేనే నిర్వహిస్తూ ఉన్నాను. ఇందులో కథలు, వ్యాసాలు, కవితలు, ఇంటర్వ్యూలు ప్రచురించబడతాయి. ఎటువంటి కాంట్రవర్సీ లేని పత్రిక ఇది. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఒక వెబ్ సైట్ కాని, ఒక పత్రిక నడపడం అంత సులువైన పనేమీ కాదు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినా కూడా ధైర్యంగా నిలదొక్కుకున్నాను. ఇప్పుడు అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక పుస్తక ప్రచురణ కూడా చేస్తోంది. బుక్ ఫెయిర్‌లో స్టాల్ నిర్వహించింది.

పద్మిని ప్రియదర్శిని

జ్యోతి వలబోజు
80963 10140

The post గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.