ఆత్మహత్యలను ఆపేదెలా?

World Suicide Prevention Day

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ ఆత్మహత్యల నిరోధక దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. పెరుగుతున్న ఆత్మహత్యలను అరికట్టడానికి అనేక ఉద్యమాలు, ప్రచార కార్యక్రమాలు, చైతన్య సదస్సులు జరుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రతి సంవత్సరం ఆత్మహత్యలను అరికట్టడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సహాయం అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. 2003 సంవత్సరం తర్వాతి నుంచి ఒక కొత్త ధీమ్‌తో మానసిక ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో ఉన్న అపోహలను దూరం చేయడానికి, ఆత్మహత్యలను నివారించడానికి ప్రయత్నిస్తోంది.

తాజా గణాంకాల ప్రకారం ఏటా పది లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పదివేల మందిలో ఒకరు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి నలభై సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే రోజుకు 3000 మంది. 2020 నాటికి ఏటా పదిహేను లక్షల ఆత్మహత్యలు కావచ్చన్న భయాందోళనలు అలుముకుంటున్నాయి.
డేటాను పరిశీలిస్తే యువత, ముఖ్యంగా టీనేజి యువత ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో యువతీయువకుల్లో ఆత్మహత్యల రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిసింది. 2015లో నేషనల్ క్రయిం రికార్డు బ్యూరో జారీ చేసిన వివరాల ప్రకారం భారతదేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2010 నుంచి 2015 మధ్య కాలంలో 39,775 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యా ప్రయత్నాలను కూడా ఇందులో కలిపితే ఈ సంఖ్య చాలా పెద్దది అయిపోతుంది. లాంసెట్ స్టడీ ప్రకారం 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్కుల్లోను ఆ తర్వాత 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కుల్లోను ఆత్మహత్యలే మరణాలకు ప్రధాన కారణాలని తెలిసింది.

మానసిక ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో అనేక అపోహలున్నాయి. వాటిని తొలగించే అనేక ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సైకాలజిస్టుల ప్రకారం అనేక సాంఘీక కారణాలు కూడా దీనికి దారి తీయవచ్చు. తీవ్రమైన మానసిక సమస్యలకు సాంఘిక కారణాలు కూడా ఉండవచ్చు. ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉందని గణాంకాల వల్ల తెలుస్తున్నప్పటికీ సమాజంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి లభించవలసినంత ప్రాధాన్యత లభించడం లేదు.
ఆత్మహత్యను నివారించడం అంత తేలిక కాదు. అనేక స్థాయిల్లో అనేక ప్రయత్నాలు జరగవలసి ఉంటుంది. చాలా సహనంతో ప్రయత్నించవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతున్న వారికి సహాయంగా ఉండడం, సంక్షోభ సమయంలో మానసిక ధైర్యాన్నివ్వడం, సామాజికంగా ఒంటరివాడు కాకుండా చూడడం అనేది చాలా ముఖ్యం. ఒక ప్రాణాన్ని కాపాడ్డానికి అవసరమైన సమయం కేటాయించవలసి ఉంటుంది. మానసిక ఒత్తిళ్లతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనిపిస్తే వెంటనే ఆ వ్యక్తి పట్ల పూర్తి శ్రద్ధ చూపించాలి. కనీసం ఆ వ్యక్తి చెప్పే మాటలను ఓపిగ్గా వినడం కూడా పెద్ద సహాయం చేయడమే అవుతుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూయిసైడ్ ప్రివెన్షన్ వివిధ భాషల్లో బ్యానర్లను, ప్రచార సామాగ్రిని తయారు చేస్తోంది. రచయితలు, బ్లాగర్లు, మానసికారోగ్య పరిరక్షణకు పనిచేసే కార్యకర్తలు ఒకే వేదికపైకి వచ్చి పనిచేసే సదుపాయాలు కల్పిస్తోంది. ఈ సంవత్సరం ఆత్మహత్యల నివారణ వారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అందరం కలిసి ఆత్మహత్యలను ఆపుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఆత్మహత్యల గురించి దేశంలో చర్చ అనేది జరగదు. జరిగినా రాజకీయాలతో ముడిపడుతుంది. ఉదాహరణకు రైతుల ఆత్మహత్యలపై రాజకీయాలు నడిచాయి. లేదా బ్లూవేల్, మేమో వంటి ఆన్ లైన్ క్రీడల వల్ల ఏవయినా సంఘటనలు జరిగినప్పుడు అది వార్త అవుతుంది. లేదా ఎవరైనా ప్రముఖ వ్యక్తి ఇలా చనిపోతే అప్పుడు వార్త అవుతుంది. లేకపోతే ఆత్మహత్యలను ఎవరు పట్టించుకోవడం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు ఆత్మహత్యల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతుందన్నది గమనిస్తే మనదేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2012లో దేశంలో 2,50,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. కనీసం పాతిక లక్షల మంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.

దేశంలో అనేక సంస్థలు ఆత్మహత్యాల నివారణకు ప్రయత్నిస్తున్నాయి. స్పిరిట్ పేరుతో గుజరాత్ లో నడుస్తున్న కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్కుల్లో వారి సమస్యలను చర్చించడం, వారిలో నూతనోత్తేజాన్ని సృజించడం జరుగుతోంది. అలాగే గృహహింస బాధితుల్లో జీవితేచ్ఛ పెంచడానికి ధిలాసా అనే సంస్థ పనిచేస్తోంది. భారతదేశంలో పురుగుమందులను తీసుకోవడం వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య కనిపిస్తుంది. చెన్నయ్ కు చెందిన ఆత్మహత్య నివారణ నిపుణురాలు డా. లక్ష్మీ విజయకుమార్ ఈ విషయమై మాట్లాడుతూ గ్రామాల్లో పురుగుమందులను ఒకే ప్రాంతంలో నిల్వ చేయడం వల్ల ఆత్మహత్యా ప్రయత్నాలు నివారించవచ్చని తెలిపారు. తమిళనాడులో నాలుగు గ్రామాల్లో ఇలా చేసి ఫలితాలు సాధించారు. విద్యార్థులు సాధారణంగా పరీక్షలు ఫెయిలైన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడడం కనిపిస్తోంది. సప్లిమెంటరీ పరీక్షలను వెంటనే నిర్వహించడం ప్రారంభమైన తర్వాత ఇలాంటి ఆత్మహత్యలు 45 నుంచి 9 శాతానికి తగ్గిపోయాయని తెలిసింది.

ఆత్మహత్యల నివారణ అన్నది కేవలం ఆరోగ్యసేవలందించే వారి పని మాత్రమే కాదు. అందరూ ఈ పనిలో పాల్గొనాలి. సహాయసహకారాలు అందించాలి. ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం వేసే వివిధ రంగాలన్నింటా సహాయసహకారాలు ఉండాలి. ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తిని సానుభూతితో ఆదుకోడానికి అవసరమైన సహాయం చేయడానికి సమాజం ముందుకు రావాలి. వారు చెప్పే మాటలు వినాలి. వారి బాధలను సానుభూతితో అర్ధం చేసుకోవాలి. అవసరమైన ధైర్యం చెప్పాలి. సమాజంలో ఆత్మహత్యల నివారణకు అందరూ కలిసి కృషి చేయాలి.                                                                                                                                                          – వాహెద్