కరోనా కోరల్లో ఆహారం

sampadakiyam telugu కరోనా సంక్షోభాన్ని సరైన పద్ధతిలో తొందరగా తుద ముట్టించలేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆర్యోగ సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) ఏక కాలంలో హెచ్చరించడం గమనించవలసిన విషయం. చాలా దేశాల్లో ప్రభుత్వాలు తమ జనాభాను లాక్‌డౌన్‌లో ఉంచడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య ఆహార సరఫరా వ్యవస్థలు తీవ్రంగా కుంటువడతాయని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజలు భవిష్యత్తుపై భయంతో తక్షణావసరానికి మించి విపరీతంగా కొనుగోళ్లు చేయడంతో పలు దేశాల్లో సూపర్ మార్కెట్లు ఖాళీ అయిపోయాయని అందువల్ల సరఫరా వ్యవస్థలు ఈసరికే వట్టిపోయాయని భవిష్యత్తులో ఆహార లభ్యతలో అస్థిర పరిస్థితులు ఏర్పడితే ఉత్పత్తి చేసే దేశాలు ఎగుమతులు తగ్గించి వేస్తాయని దాని వల్ల ప్రపంచ మార్కెట్‌లో కొరత తప్పదని పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ ప్రపంచీకరణ రోజుల్లో ఆహారం కోసం దేశాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడక తప్పని స్థితి పెరిగిపోయింది.

ఒక దేశం కాకి ఇంకో దేశంపై వాలడం సాధ్యంకాని ఒకప్పటి రోజుల్లో అన్ని దేశాలు తమకున్న అవకాశాలు, పరిమితుల్లో స్థానికంగా లభ్యమయ్యే ఆహారం మీదనే ఆధారపడి బతుకుతూ స్వయం సమృద్ధంగా ఉండేవి. ఇప్పుడు అన్ని రకాల రుచులు అందుబాటులోకి రావడంతో ఆహారపుటలవాట్లు మారిపోయాయి. ఆ మేరకు ఇతర దేశాల్లో పండుతున్న రకరకాల పంటలు, పదార్థాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లో ఉండడం ప్రపంచ ఆహార వాణిజ్య రంగాల్లో అపూర్వ స్థితిని కలిగిస్తున్నది. ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒక్కరు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నారు.

అలాగే అఫ్ఘానిస్థాన్, బర్కినోఫాసో, బురిండి, కామెరాన్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, చాద్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జిబౌటి, ఎరిట్రియా, ఇథియోపియా, స్విట్జర్లాండ్, సిరియా, ఉగాండా, యెమెన్, జింబాబ్వే వంటి 34 దేశాలు సొంత ఆహారోత్పత్తి చాలక ప్రజల తిండి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. ఆహార ఎగుమతుల్లో అమెరికాదే పైచేయి. అది ఏటా 72,682,349 డాలర్ల విలువైన ఆహారాన్ని ఎగుమతి చేస్తుంది. అందులో ఎక్కువగా మొక్కజొన్న, సోయాబీన్స్, పాలు ఉన్నాయి. ఇంకా గోధుమ, సుగర్ బీట్, చెరకు, బంగాళాదుంపలు, చికెన్ కూడా ఎగుమతి చేస్తుంది. అమెరికా తర్వాత జర్మనీ 34,628,800 డాలర్లు, బ్రిటన్ 29,546,218 డాలర్లు, చైనా 25,152,286 డాలర్ల విలువైన ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తాయి. ఇప్పటి పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సగానికై పైగా ప్రపంచ జనాభా దిగుమతి చేసుకునే ఆహారం మీదనే ఆధారపడి బతకవలసి ఉంటుందని వాతావరణ మార్పుల ప్రభావంపై జరిగిన ఒక సమగ్ర పరిశోధన అభిప్రాయపడింది.

ఆహారోత్పత్తులను భారీగా ఎగుమతి చేసే సంపన్న దేశాలు కూడా పెద్ద ఎత్తున ఆహార దిగుమతులు చేసుకోడం గమనార్హం. అమెరికా 133 బిలియన్ డాలర్లు, చైనా 10-5 బిలియన్ డాలర్లు, జర్మనీ 98 బిలియన్ డాలర్ల మేరకు ఆహారోత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి. ఇంకా ఇతర సంపన్న దేశాలు ఇదే మాదిరిగా ఆహారాన్ని ఇతర దేశాల నుంచి రప్పించుకుంటాయి. ఇవి తమ ప్రజల ఆకలి తీర్చడం కోసం కాకుండా పలు రకాల అనుబంధ ఆహారోత్పత్తుల కోసం వాటిపై భారీ వాణిజ్యం జరుపుకొని లాభాలు గడించడం కోసం ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి. కాని ఆఫ్రికా దేశాల మాదిరిగా పొట్ట పోషణ కోసం కాదు. ఈ నేపథ్యంలో ప్రపంచ సంస్థలు మూడూ హెచ్చరించినట్టు ఇప్పటి విశ్వవ్యాప్త కరోనా లాక్‌డౌన్ వల్ల ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిని ఆహార కొరత ఏర్పడితే నష్టపోయేవి పేద దేశాలే. సంపన్న దేశాలు తమ వ్యాపార అవసరాల కోసం ఆహార దిగుమతులను ఎప్పటి లాగే కొనసాగించి ఎగుమతులను మాత్రం భారీగా తగ్గించుకుంటాయి.

అవి తమ ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తాయి. మిగతా ప్రపంచం ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడి బతుకుతున్న పేద దేశాల గతి అప్పుడు ఏమి కావాలి? వాటి పరాధీనత మరింత పెరిగిపోతుంది. సంపన్న దేశాల దయాదాక్షిణ్యాల కోసం అర్రులు చాచవలసి వస్తుంది. ఆ మేరకు పెద్ద దేశాలు వాటి ఆత్మాభిమానాన్ని, స్వయం నిర్ణయ శక్తిని ఇప్పటి కంటే ఎక్కువగా కొల్లగొడుతాయి. ఆహార రంగంలో పైచేయిగా ఉన్న సంపన్న దేశాల అదుపాజ్ఞలలోకి వెళ్లిపోక తప్పని స్థితి వారికి ఎదురవుతుంది. అందుచేత పేద దేశాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇచ్చి స్వయం సమృద్ధిని సాధించుకోవాలి. అదే సమయంలో తమ ప్రజల ఆహారపుటలవాట్లు మార్చి స్థానికంగా పండే పంటలపైనే ఆధారపడి బతకడం వారికి అలవాటు చేయాలి. కరోనా సంక్షోభం ప్రపంచంలోని పేదల కడుపులు కొట్టే వరకు విషమించరాదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జనం పోషకాహార లేమితో బాధపడుతున్నా రు. వారిలో బాలలే ఎక్కువ. వారి సంఖ్య మరింతగా పెరగకుండా చూసుకోవాలి. కరోనా నుంచి వీలైనంత తొందరగా ప్రపంచానికి విముక్తి కలిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలి.

World Risks Food Crisis in Wake of Coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా కోరల్లో ఆహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.