ప్రకృతి ప్రకోపించే ప్రమాదం

  జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాని పర్యావరణానికి హాని కలిగించే జీవన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాం. పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972లో నిర్ణయించింది. క్రమం తప్పకుండా ఏటా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాని పర్యావరణాన్ని కాపాడ్డానికి చేస్తున్నది మాత్రం శూన్యమే. పర్యావరణానికి ప్రధాన శత్రువు ప్లాస్టిక్. ప్లాస్టిక్ పుట్టి మహా అయితే వందేళ్ళయి ఉంటుంది. కాని వేల సంవత్సరాల పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేస్తోంది. […] The post ప్రకృతి ప్రకోపించే ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాని పర్యావరణానికి హాని కలిగించే జీవన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాం. పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972లో నిర్ణయించింది. క్రమం తప్పకుండా ఏటా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాని పర్యావరణాన్ని కాపాడ్డానికి చేస్తున్నది మాత్రం శూన్యమే. పర్యావరణానికి ప్రధాన శత్రువు ప్లాస్టిక్. ప్లాస్టిక్ పుట్టి మహా అయితే వందేళ్ళయి ఉంటుంది. కాని వేల సంవత్సరాల పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేస్తోంది. అయినా ప్లాస్టిక్ వినియోగాన్ని మనం తగ్గించుకోలేకపోతున్నాం.

ప్రభుత్వాలు విఫలమవుతున్న చోట సాధారణ ప్రజలు విజయాలు సాధించి చూపిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి అస్సాంలో ఒక మామూలు స్కూలు గొప్ప ప్రయత్నం చేస్తోంది. అసోంలోని అక్షర్ ఫౌండేషన్ స్కూల్లో చదువుకోవాలంటే విద్యార్థులు ఫీజులు కట్టనవసరం లేదు. ఫీజులకు బదులు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలు సేకరించి ఇవ్వాలి. చిన్నారులు ఉదయాన్నే పుస్తకాలతోపాటు ఇరుగుపొరుగువారి ఇళ్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్‌కి తీసుకువెళతారు. విద్యార్థులు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్లో రీ సైక్లింగ్ చేస్తారు.

పేదల పిల్లలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా చదువు చెబుతోందీ స్కూలు. పర్యావరణ పరిరక్షణకు సాధారణ ప్రజలు అసాధారణ పనులు చేసి చూపిస్తున్నారు. డార్జిలింగ్‌లో సించిల్ అనే మందిరం ఉంది. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. భక్తులు సమర్పించినవన్నీ గుడి వెనుక భాగంలో కుప్పలు కుప్పలుగా ఉండిపోతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కాని ఈ సంవత్సరం ఈ కాలుష్యాన్ని కడిగేయాలని స్థానికులు నడుం కట్టారు. ఘూమ్ జోర్ బంగ్లా డిగ్రీ కాలేజీ, కాంగ్రెస్ ప్రైమరీ స్కూలు, సించల్ మందిర్ కమిటీ, టైగర్ హిల్ సెల్ఫ్ హెల్ప్ అసోసియేషన్, ఒకెసి మోనస్టరీ, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు అందరూ కలిసి మందిర పరిసరాలను పరిశుభ్రం చేయడానికి పూనుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేశారు.

ఒకవైపు పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. మరోవైపు ఈ విధ్వంసాన్ని ఆపడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని కల్యాణ్ చాలా బిజీ రైల్వే స్టేషన్, రోజుకు కనీసం 3 లక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారు. కాని ఈ స్టేషనుకు దగ్గరగా ఉన్న పాయి గ్రామం గురించి చాలా మందికి తెలియదు. కల్యాణ్ పట్టణానికి కేవలం 20 కి.మీ.ల దూరంలో పాయి ఉంది. ఈ గ్రామం ఒక అడవిని దత్తత తీసుకుంది. గ్రామంలోని 180 కుటుంబాల ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఈ అడవి అద్భుతమైన పచ్చదనంతో అలరారుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 నివేదిక ప్రకారం దక్షిణాసియా దేశాల్లో 2012లో కాలుష్యంవల్ల 8 లక్షల మంది మరణించారు. ఇందులో 77 శాతం మంది భారతీయులే. 2015లో భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల 12 లక్షల మంది మరణించారని ఎయిర్ పో కాలిప్స్ అధ్యయనం తెలియజేసింది. దేశంలోని మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలు గ్యాస్ ఛాంబర్లుగా మారుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారణ ప్రకారం 2017లో దేశ వ్యాప్తంగా సంభవించిన ప్రతి 8 మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం కారణంగా చోటు చేసుకున్నదే. 2018లో ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో 14 మన దేశంలోనివే.

అతి సూక్ష్మ ధూళి కణాల సాంద్రత ప్రాతిపదికన ఢిల్లీ, కాన్పూర్, ఫరీదాబాద్, గయ, వారణాసి ముందుండగా వరంగల్, కాన్పూర్ లాంటి చోట్ల గాలిలో నికెల్, సీసం, ఆర్సెనిక్ శాతాలు మరింతగా పెరుగుతున్నాయి.. భారతదేశంలోని అనేక నదులు కాలుష్యకాసారాలైపోయాయి. మురికి కాల్వలు, వ్యవసాయ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లోనే కలుస్తున్నాయి. పొల్యూషన్ బోర్డు ప్రకారం దేశంలో 60 నగరాల్లో ఏటా 4,059 టన్నుల చెత్త నదుల్లో కలుస్తోంది. యమునా నది ఢిల్లోలో ప్రవహిస్తోంది. యమునా నదిలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఢిల్లీ జనాభా కోటీ యాభై లక్షలు. ప్రతి రోజు ఢిల్లీలో 17 వేల టన్నుల వ్యర్థాలు తయారవుతాయి.

ప్రకృతి వనరులను విచక్షణ లేకుండా వాడుకోవడం, ప్లాస్టిక్‌ను విచక్షణ లేకుండా వినియోగించడం వల్ల ప్రపంచంలో వ్యర్థాలు గుట్టలు పడుతున్నాయి. అలాగే అణు వ్యర్థాలు కూడా పెరిగిపోయాయి. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యర్థాలను వదిలించుకోవడం ఇప్పుడు ఒక పెనుసవాలుగా మారింది. రీ సైకిల్ చేయడం ద్వారా వ్యర్థాల సమస్య పరిష్కారం చేయవచ్చు. 2020 నాటికి భారత్‌లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు. విధిగా మొక్కలను నాటడం, ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు ఉపయోగించడం, మోటారు వాహనాలకు బదులు వీలయిన చోట్ల సైకిళ్ళను వాడడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

ప్రపంచంలో ప్రస్తుతం ఏటా దాదాపు 500 బిలియన్ ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల సుమారు 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. దానివల్ల సముద్రంలో ఉన్న ఎన్నో జీవులకు ముప్పు ఏర్పడుతోంది. లండన్‌లోని ఒక స్టార్టప్ సంస్థ సముద్ర పీతల నుంచి పర్యావరణ హితమైన బయో ప్లాస్టిక్ తయారు చేసే ప్రయోగాలు చేస్తోంది. ఈ బయో ప్లాస్టిక్ ఫంగస్‌ను, బ్యాక్టీరియాను కూడా నిరోధిస్తుంది. కాబట్టి ఆహారం నిల్వచేసేందుకు ఈ సంచులు సురక్షితమైనవని అంటున్నారు.

ప్రపంచంలో 1950 తర్వాతి నుంచి సముద్రాల్లో 600 కోట్ల టన్నుల చేపలు, సముద్ర జీవులను వేటాడ్డం జరిగింది. సముద్రాల్లో గుట్టలుగా ప్లాస్టిక్ పేరుకుపోతోంది. మానవ కార్యకలాపాలు లేకుండా భూమిలో మిగిలిన ప్రాంతం కేవలం 25 శాతం మాత్రమే. 2050 నాటికి కేవలం పది శాతం భూమి మాత్రమే మానవ కార్యకలాపాలకు దూరంగా మిగులుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల వాతావరణ మార్పు పెద్ద సమస్యగా మన ముందుకు వస్తోంది. స్వచ్ఛమైన గాలి, నీరు లభించడం గగనమైపోతోంది. అభివృద్ధి కార్యకలాపాల వల్ల భూమికి వాటిల్లుతున్న నష్టాన్ని గుర్తించడం నేటి అవసరం. ప్రకృతి ప్రకోపిస్తే మనిషికి మనుగడ ఉండదు. ప్రకృతిలోని అనేక జీవరాశులు లేకపోతే మనిషికి సహాయపడేవారు ఉండరు.

World Environment Day on 5th June

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రకృతి ప్రకోపించే ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: