ఇరు జట్లకు కీలకమే

నేడు బంగ్లాతో ఇంగ్లండ్ ఢీ కార్డిఫ్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌కు ఆతిథ్య ఇంగ్లండ్, ఆసియా ఆశాకిరణం బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఒకదాంట్లో గెలిచి మరో దాంట్లో ఓటమి పాలయ్యాయి. దీంతో శనివారం జరిగే మూడో మ్యాచ్‌లో రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయి. పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలుకావడంతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లింది. మరోవైపు బంగ్లాదేశ్ కిందటి మ్యాచ్‌లో […] The post ఇరు జట్లకు కీలకమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నేడు బంగ్లాతో ఇంగ్లండ్ ఢీ
కార్డిఫ్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌కు ఆతిథ్య ఇంగ్లండ్, ఆసియా ఆశాకిరణం బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఒకదాంట్లో గెలిచి మరో దాంట్లో ఓటమి పాలయ్యాయి. దీంతో శనివారం జరిగే మూడో మ్యాచ్‌లో రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయి. పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలుకావడంతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లింది. మరోవైపు బంగ్లాదేశ్ కిందటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా మెరుగైన ఆటను కనబరచాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ సాకిబ్ అల్ హసన్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. దీంతో బంగ్లాదేశ్ సంచలన ఫలితంపై కన్నేసింది.
ఫేవరెట్‌గా..
కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బంగ్లాతో పోల్చితే ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు జాసన్ రాయ్, బైర్‌స్టో, కెప్టెన్ మోర్గాన్, ఆల్‌రౌండర్లు వోక్స్, స్టోక్స్, మోయిన్ అలీ తదితరులు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక జోస్ బట్లర్ రూపంలో పదునైన అస్త్రం జట్టుకు అందుబాటులో ఉంది. కిందటి మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన రూట్, బట్లర్‌లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. పాక్ మ్యాచ్‌లో వీరిద్దరూ అసాధారణ పోరాట పటిమను కనబరిచిన విషయం తెలిసిందే. అయితే కీలక సమయంలో ఇద్దరు ఔట్ కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో ఇటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఇంగ్లండ్ భావిస్తోంది. సమష్టిగా పోరాడి బంగ్లాను ఓడించాలనే పట్టుదలతో ఉంది. జోఫ్రా ఆర్చర్, ప్లంకెట్, వోక్స్, ఆదిల్ రషీద్, మోయిన్ అలీ వంటి అగ్రశ్రేణి బౌలర్లు జట్టులో ఉన్నారు. బ్యాటింగ్‌లో అయితే ఇంగ్లండ్‌కు ఎదురేలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
తక్కువ అంచనా వేయలేం


మరోవైపు బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. తనదైన రోజు ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా బంగ్లాకు ఉంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాను ఓడించిన బంగ్లాదేశ్ బలమైన కివీస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో దాదాపు గెలిచినంత పని చేసింది. దీంతో ఇంగ్లండ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ బాగానే ఉంది. తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా, సాకిబ్, రహీం, హుస్సేన్ తదితరులతో బంగ్లా బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే చెప్పాలి.

World Cup 2019: ENG vs BAN match today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇరు జట్లకు కీలకమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.