నిమిషానికి రూ.49 లక్షల ఆదాయం!

Walmart

 

ప్రపంచ సంపన్నుల సంపాదన ఇది

న్యూయార్క్: మన దేశంలో వార్షిక వేతనం రూ.25 లక్షలు ఉంటే అద్భుతమైన వేతనంగా భావిస్తారు. అదే వ్యాపారవేత్త అయితే ఏడాదికి రూ.10 కోట్లు ఆర్జిస్తే గొప్ప వ్యాపారంగానే లెక్కగడతారు. అదే ఏడాదికి వంద కోట్లు లాభం కళ్ల జూస్తే అతడిని తిరుగులేని వ్యాపారవేత్త కింద జమకడతారు. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం రోజుకు వీటికన్నా ఎన్నో రెట్లు ఆర్జిస్తోంది. వాల్‌మార్ట్ సంస్థ ప్రధాన వాటాదారులైన వాల్టన్ కుటుంబం ఆదాయం నిమిషానికి 70 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.49,72,947 అన్న మాట. ఇక గంటకు 40లక్షల డాలర్ల(రూ.28 కోట్లకు పైమాటే). రోజుకు 100 మిలియన్ డాలర్లు( రూ.710 కోట్లు) వీరి సంపాదనకు అదనంగా వచ్చి చేరుతోంది. దీంతో వీరు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం జాబితాలో అగ్రస్థానంలో దూసుకు వెళ్తున్నారు.

అదే సమయంలో వాల్‌మార్ట్‌లో కొత్త ఉద్యోగి రోజుకు 11 డాలర్లు మాత్రమే సంపాదిస్తాడు. బ్లూమ్‌బెర్గ్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత సంసన్నుల జాబితాలో అమెరికన్ల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది.1929నుంచి కూడా వీరి ఆధిపత్యం ఇలాగే కొనసాగుతోంది. ఇక ఈ జాబితా ప్రకారం డస్సాల్ట్, డంకల్, లీ, హెరెస్ట్ కుటుంబాల ఆస్తులు కరిగిపోతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 మంది సంపన్నులకు 1.4 ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంపద 24 శాతం వృద్ధి చెందింది. యూరప్, ఆసియా దేశస్థుల సంపద వేగంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోని సంపన్న కుటుంబాలు, వారి ఆదాయాలు ఎలా పెరిగాయో ఓ సారి చూద్దాం.

1. 2018 జూన్‌నుంచి వాల్టన్ కుటుంబం ఆదాయం 39 బిలియన్ డాలర్లు పెరిగి 191 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఇది.
2. అమెరికా చాక్లెట్ సామ్రాజ్యాన్ని ఏలే మార్స్ కుటుంబం సంపద 37 బిలియన్ డాలర్లు పెరిగి 127 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
3. అమెరికా పెట్రోలియం దిగ్గజం కోచ్ కుటుంబం సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగి 125 బిలియన్ డాలర్లకు చేరింది.
4. సౌదీ రాజకుటుంబానికి చెందిన సౌద్‌ల సంపద 100 బిలియన్ డాలర్లకు చెందింది. రాయల్ దివాన్‌ల చెల్లింపు ఆధారంగా దీన్ని లెక్కగట్టారు. ఈ కుటుంబం చెప్పుచేతల్లోనే సౌదీ దిగ్గజ పెట్రోలియం కంపెనీ ఆరామ్‌కో ఉంది. దీని విలువ 2 ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా.
5. ఇక ఈ జాబితాలోని మన దేశానికి చెందిన అంబానీల కుటుంబం సంపద 7 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లూమ్‌బెర్గ్ సంపన్నుల జాబితాలోని తొలి 25 మంది సంపను కుటుంబాల ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 250 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి.

World Ambassadors income Rs 49 lakh per minute

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిమిషానికి రూ.49 లక్షల ఆదాయం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.