స్నేహాన్ని కొనసాగించడం తప్పుకాదు!

  నా పేరు శ్రీరేఖ. నాకు పెళ్లయి ఏడు సంవత్సరాలయ్యింది. నా భర్త పేరు మురళి, మాకు 5 సంవత్సరాల పాప అలేఖ్య వుంది. నాన్నగారు మాకు దూరపు బంధువులు, మంచివాళ్ళని మురళితో నాకు డిగ్రీ పూర్తవగానే పెళ్ళి చేశారు. నేను కూడా ఆడపిల్ల అన్నాక ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలి కదా అని పెళ్ళికి ఒప్పుకున్నా. మురళీ మంచివాడే, కానీ తనకి పెళ్ళికి ముందు లవ్ ఎఫైర్ వుంది. తను ఇప్పటికి ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అది […]

 

నా పేరు శ్రీరేఖ. నాకు పెళ్లయి ఏడు సంవత్సరాలయ్యింది. నా భర్త పేరు మురళి, మాకు 5 సంవత్సరాల పాప అలేఖ్య వుంది. నాన్నగారు మాకు దూరపు బంధువులు, మంచివాళ్ళని మురళితో నాకు డిగ్రీ పూర్తవగానే పెళ్ళి చేశారు. నేను కూడా ఆడపిల్ల అన్నాక ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలి కదా అని పెళ్ళికి ఒప్పుకున్నా. మురళీ మంచివాడే, కానీ తనకి పెళ్ళికి ముందు లవ్ ఎఫైర్ వుంది. తను ఇప్పటికి ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అది నాకు తెలిసి నేను తనతో కలిసి వుండలేకపోతున్నాను. మా అత్త, మామలు మాతో వుండరు. ఊరిలో మాకు పొలాలున్నాయి. వాటిని చూసుకుంటూ వాళ్ళు అక్కడే ఉంటారు. మేము పండగలకి అక్కడికి వెళ్ళి వస్తుంటాం.

నాకు ఒక చెల్లి వుంది ఇంకా పెళ్ళి కాలేదు. సంబంధాలు చూస్తున్నాము. ఇలాంటి సమయంలో అమ్మ వాళ్ళకి నేను ఈ విషయం చెబితే వాళ్ళు చాలా బాధ పడతారు. అందుకే నేను వాళ్ళకి చెప్పలేక, మీకు లెటర్ ద్వారా తెలియచేస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. నా భర్తలాగే మా చెల్లికి గవర్నమెంట్ ఉద్యోగినిచ్చి పెళ్ళి చేయాలని మా నాన్న ఆలోచిస్తున్నారు. నేను ప్రస్తుతం ఏం చేయాలి? నాకు మురళితో కలిసి ఉండాలని లేదు. తను పూర్తిగా మారి, కేవలం నన్ను, పాపని మాత్రమే తన జీవితానికి ముఖ్యమనే విధంగా మారాలి. అప్పుడే తనతో కలిసి వుండగలను. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నాకు మార్గం చెప్పండి.

శ్రీరేఖా ఈ లెటర్ చదివాకా, నీ సమస్య అర్థమైంది. నాకు పెళ్ళై 7 సంవత్సరాలయిందని, ఒక పాప (5 సం)” అని రాసావు. నీవు నీ జీవితంతో పాటు పాప గురించి కూడా ఆలోచించాలి. నీవు ఈ విషయంలో తొందరపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ భర్త మురళి మంచివాడేనని నువ్వే రాసావు. చాలా మంది చదువుకునే రోజుల్లో ఉన్న స్నేహితుల్నీ, అప్పట్లో ఏర్పడ్డ బంధాల్ని త్వరగా వదులుకోలేరు. అందుకే ఎక్కడ వున్నా ఫోన్ల ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తుంటారు.. కానీ అది పెద్ద తప్పు కాదు. కేవలం దానిని కారణంగా చూపించడం సరికాదు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యల పరిష్కారం కోసమే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1995 పెట్ట బడింది. ఎవరైనా తమ జీవిత భాగస్వామితో కలిసి వుండలేని పక్షంలో సెక్షన్.13 ప్రకారం విడాకులు కోరవచ్చు.

అలాగే జీవిత భాగస్వామి (భర్త) నుంచి భరణం పొందవచ్చు. భర్త ఉద్యోగి అయితే, భార్యకు, సంతానానికి తన జీతం నుండి కోర్టు నిర్ణయించిన మేరకు వారి పోషణార్థం నెలనెలా యివ్వవలసిందే. ఒక వేళ నీకు విడాకులు తీసుకోవాలని లేనిచో నీవు జ్యుడీషియల్ సపరేషన్ కోరుకోవచ్చు. సెక్షన్ 10 ప్రకారం నీవు నీ భర్త ఇంట్లోనే వుండి , నీకు పాపకు పోషణార్థం పొందవచ్చు. కనుక నీవు నీ గురించి, నీ కుంటుంబం గురించి బాగా ఆలోచించి, నీ తల్లిదండ్రులతో కూడా చెప్పాక, నిర్ణయం తీసుకో. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇవ్వవు. కనుక తొందర పడకుండా నిదానంగా ఆలోచించు.

                                                                                     ఎస్.బి.టి. సుందరి
                                                                     హైకోర్టు న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ మీ సమస్యలను                                                                         features@manatelangana.orgకి పంపగలరు

women write letter for solution to advocate

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: