ప్లాస్టిక్‌ డబ్బా పేలడంతో మహిళకు గాయాలు

Woman

 

*చెత్తకుప్పలో లభ్యమైన ప్లాస్టిక్‌డబ్బా
*స్పీడ్‌బ్రేకర్‌పై కొట్టడంతో పెద్ద శబ్దం చేస్తూ పేలుడు
*మహిళ కాళ్లు, చేతులకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
*సంఘటనాస్ధలాన్ని పరిశీలించిన డిసిపి, ఏసిపిలు
*రసాయనాలు నిల్వఉన్న డబ్బాగా పొలీసులు ప్రాధమిక నిర్ధారణ

హైదరాబాద్ : చెత్తకుప్పలో దొరికిన ప్లాస్టిక్‌డబ్బా ప్రమాదవశాత్తూ పేలడంతో ఓ మహిళ గాయాల పాలైన సంఘటన మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంపాపేట్ పరిధిలోని సింగరేణి గుడిసెలకు చెందిన నిర్మల(28)అనే మహిళ రోడ్లపై గల చిత్తుకాగితాలు, ప్లాస్టిక్, ఇనుము వ్యర్ధాలను సేకరించి ఉపాధి పొందుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సైతం మరో ఇద్దరి మహిళలతో కలిసి జిల్లెలగూడలోని పాష్‌కాలనీ పరిధిలో గల విజయపురికాలనీలో చిత్తుకాగితాలు సేకరిస్తున్న నిర్మలకు రోడ్డుపక్కన గల చెత్తకుప్పలో ఓ ప్లాస్టిక్‌డబ్బా లభ్యం కాగా, దాన్ని తీసుకొని కొద్ది దూరం వచ్చిన నిర్మల డబ్బాను తెరిచే ప్రయత్నంలో భాగంగా రోడ్డుపై గల స్పీడ్‌బ్రేకర్‌పై దాన్ని వేసి బలంగా కొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్లాస్టిక్‌డబ్బా పెద్దశబ్దం చేస్తూ విస్పోటనానికి గురికావడంతో నిర్మల కుడి అరచేతికి, ఎడమ కాలిమడమపై భాగంలో గాయాలయ్యాయి.

ఇదిగమనించిన స్ధానికులు పొలీసులకు సమాచారం అందించడంతో తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనాస్ధలానికి చేరుకున్న మీర్‌పేట్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ చికిత్స నిమిత్తం నిర్మలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, క్లూస్‌టీం, డాగ్, బాంబ్ స్కాడ్‌లను పిలిపించి అసలు ప్లాస్టిక్‌డబ్బాలో ఏం ఉంది, అది ఇక్కడకు ఎలా వచ్చింది అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్ధలాన్ని పరిశీలించిన ఎల్‌బినగర్ జోన్ డిసిపి సన్‌ప్రీత్‌సింగ్, వనస్ధలిపురం సబ్‌డివిజన్ ఏసిపి ఎస్ జయరాంలు దర్యాప్తు నిర్వహించాల్సిన కోణాలపట్ల సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉండగా నిర్మలకు లభ్యమైన డబ్బా రసాయనాలకు సంభంధించిన డబ్బా అయిఉంటుందని, చాలారోజులుగా రసాయనాలు నిల్వుండడంతో డబ్బా విస్పోటనానికి గురిఅయ్యిఉండవచ్చునని పొలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ దర్యాప్తును మాత్రం అన్ని కోణాల్లో సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Woman injured after Plastic container explodes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్లాస్టిక్‌ డబ్బా పేలడంతో మహిళకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.