తమిళనాడు మహిళా ముఠా అరెస్ట్

Woman gangster arrested by tamil nadu district police

వరంగల్: బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించే మహిళలే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళా ముఠాను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్ట్ చేసిన మహిళా ముఠా సభ్యుల నుంచి సుమారు రూ.3 లక్షల 60 వేల విలువగల 120 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళా నిందితురాళ్లు తమిళనాడు రాష్ట్రం, తూతుకూడి జిల్లా, అన్ననగర్ ఓడతెరువు ప్రాంతానికి చెందిన నటరాజన్ భగవతి, రాజు లీలాదేవి, నటరాజన్ సుమతిగా గుర్తించినట్టు ఈ అరెస్ట్‌కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డిసిపి అశోక్‌కుమార్ వివరాలను వెల్లడించారు.

చోరీలకు పాల్పడిన ఈ ముగ్గురు నిందితురాళ్లు ఎల్లాపూర్ రైల్వేస్టేషన్‌కు వచ్చినట్లుగా క్రైం అదనపు డిసిపి అశోక్‌కుమార్‌కు సమాచారం రావడంతో వీరి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు, హసన్‌పర్తి ఎన్స్‌పెక్టర్ పి.కిషన్, ఎస్సై టి.సుధాకర్, సిబ్బందితో ఎల్లాపూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ముగ్గురు నిందితురాళ్లను అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో తనిఖీ చేయగా వీరి వద్ద బంగారు ఆభరణాలను గుర్తించి వీరిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  నిందితురాళ్లను సకాలంలో పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు డిసిపి అశోక్‌కుమార్, క్రైం ఎసిపి బాబురావు, సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అభినందించారు.

Comments

comments