అధ్యక్షులు కావలెను

BJP-Congress

 

రాష్ట్ర బిజెపి, కాంగ్రెస్‌లను పీడిస్తున్న ఒకే సమస్య 

బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ను కొనసాగిస్తారా, ఎంపి సంజయ్‌కి ఇస్తారా?
విద్యాసాగర్‌రావు నడ్డాను కలిసిన తర్వాత ఊహాగానాలు ముమ్మరం
ఇంకా చిక్కుముడిగానే టిపిసిసి కొత్త అధ్యక్షుడి వ్యవహారం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారన్న ప్రకటనతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర పిసిసి పదవికి తాను సైతం పోటీలో ఉన్నానని ఎంపి కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఆ పార్టీలో కల్లోలం రేపుతోంది. దీంతో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు రథసారధి కోసం ఆశావహులు ఒక్కరొక్కరుగా హస్తినకు పయనమౌతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్‌విద్యాసాగర్‌రావు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలసిన అంనతరం రాష్ట్రానికి కొత్త అధ్యక్షులు రాబోతున్నారన్న ప్రకటనతో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు అంటే ఎవరన్న దానిపై బిజెపిలో చర్చ మొదలైంది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా? లేదా అధ్యక్ష పదవి ఆశిస్తున్న బండి సంజయ్‌కి ఇస్తారా? అన్న చర్చ జోరందుకుంది.దీనిపై లక్ష్మణ్‌ను వివరణ కోరగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని జాతీయ పార్టీ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పారు.

మరోవైపు పార్టీకి పూర్తి స్థాయి సమయం వెచ్చించే అవకాశం లక్ష్మణ్‌కే ఉన్నందున ఆయనకే ఇస్తారన్న చర్చ సైతం జరుగుతోంది. సంజయ్‌కి ఇస్తే ఎంపిగా నియోజకవర్గంపై దృష్టి సారించడం కష్టమవుతుందని, స్థానికంగా లేకపోతే ఇబ్బందులు వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి జాతీయ పార్టీ కనుక హిందుత్వ ఎజెండాను మాత్రమే ప్రధానంగా తీసుకుంటే సంజయ్‌కే పార్టీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలున్నాయని పార్టీలోని కీలకనేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి డికె అరుణ అధ్యక్ష పదవిని ఆశించడమే కాకుండా తన దైన శైలిలో ప్రయత్నాలు ముమ్మ రంచేశారు. అలాగే గతంలో బిజెపిలో చురుగ్గా పనిచేసిన మాజీ ఎంపి జితేందర్ సైతం తన పాత పరిచయాలతో అధ్యక్ష స్థానం దక్కించుకునే యత్నాలు సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా జితేందర్ రెడ్డి ఇటీవల కాలంలో అధికశాతం హస్తనలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. అర్థబలం, అంగబలం ఉన్న నాయకులకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు బిజెపి జాతీయ నాయకులు భావిస్తున్న నేపథ్యంలో తనకే ఆ పదవి దక్కుతుందని జితేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలావుండగా ఈ నలుగురిలో రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందో పది రోజుల్లోగా తేలనుంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలని బిజెపి జాతీయ నేతలు భావించడంతో పాటు బిజెపి సీనియబర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావును చర్చించేందుకు హస్తినకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా బిజెపి అధ్యక్ష పదవి రేసులో తాను లేనని స్పష్టం చేసిన విద్యాసాగర్ రావు రాష్ట్రానికి కొత్త రథసారథి రాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం హైకమాండ్ చేతిలో ఉంటుందని., తాను మాత్రం పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ అయినప్పటికీ దత్తాత్రేయ, కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేశారని, అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా వారి ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విద్యాసాగర్ రావు వివరించారు.

కాంగ్రెస్‌లోనూ పిసిసి కల్లోలం..
వరుస ఓటములు, ఐక్యతకు ఆమడ దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర పిసిసి మార్పుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అనతికాలంలో పిసిసి అధ్యక్షుడి మార్పు జరగవచ్చని ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొనడంతో పాటు తాను సైతం రేసులో ఉన్నారని తేల్చిచెప్పారు. శివరాత్రి సందర్బంగా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపి కోమటిరెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుని రేస్‌లో తను ఉన్నానని తెలిపారు. పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే తన ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు.

ఇదిలావుండగా పిసిసి పదవి సీనియర్లకే ఇవ్వాలని విహెచ్, పొన్నాల ఇదివరకే తమ డిమాంద్‌ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కాగా యువకులకు పిసిసి అవకాశం ఇవ్వాలని తనకు అవకాశం ఇస్తే పార్టీని అనతికాలంలోనే బలోపేతం చేస్తానని ఎంపి రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి పదవి కోసం మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంఎల్‌ఎలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి లు సైతం తమదైన శైలిలో హస్తినలలో పావులు కదుపుతున్నారు.

Who Will Get PCC Chief Post In Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అధ్యక్షులు కావలెను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.