పులి ఎక్కడ?

గాయపడిన పులి ఆచూకీ కోసం గాలింపు    మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: గాయపడిన పులి కోసం అటవీ అధికారులు హైరానా పడుతున్నారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురియడంతో అటవీ ప్రాంతంలో సిసి కెమెరాలు కూడా పని చేయడం లేదు. దీంతో గాయపడిన పులి ఆచూకీ లభించక అధికారులు ఆందోళన చెందుతున్నారు. వేటగాళ్ల ఉచ్చులో గాయపడిన పులి సురక్షితంగా ఉందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలకు గాయం ఎక్కువయ్యే అవకాశం ఉండడం వల్ల ట్రాకర్లు సైతం […]

గాయపడిన పులి ఆచూకీ కోసం గాలింపు 

 

మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: గాయపడిన పులి కోసం అటవీ అధికారులు హైరానా పడుతున్నారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురియడంతో అటవీ ప్రాంతంలో సిసి కెమెరాలు కూడా పని చేయడం లేదు. దీంతో గాయపడిన పులి ఆచూకీ లభించక అధికారులు ఆందోళన చెందుతున్నారు. వేటగాళ్ల ఉచ్చులో గాయపడిన పులి సురక్షితంగా ఉందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలకు గాయం ఎక్కువయ్యే అవకాశం ఉండడం వల్ల ట్రాకర్లు సైతం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కానరావడం లేదు.

మరోవైపు అటవీ శాఖ ఉన్నతాధికారులు స్థానిక అధికారులకు పులి ఆచూకీ కనుగొనాలని సీరియస్‌గా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అదనపు పిసిసిఎఫ్ మునేంద్రతో పాటు ఉన్నతాధికారులు పులి జాడ తెలుసుకోవాలని స్థానిక అధికారులను హెచ్చరిస్తుండగా పులి ఆచూకీ లభించక అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చెన్నూర్ డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో గాయపడిన పులి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత వన్యప్రాణుల సంరక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోగా పులి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్ నుండి ప్రత్యేక ట్రాకర్లను చెన్నూర్ రేంజ్‌కు పంపించగా రంగంలోకి దిగారు. వేటగాళ్ల ఉచ్చులో గాయపడిన కె4 అనే ఆడపులి సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి ఈ ప్రాంతానికి వచ్చిందని, దీనికి తగిలిన గాయం బెజ్జూర్ అడవుల్లోనే ఉచ్చు తగిలినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు.

గాయపడిన పులి సురక్షితమేనా….?

బెజ్జూర్ అటవీ ప్రాంతంలో ఉచ్చులో చిక్కుకున్న పులి సురక్షితంగానే ఉందానే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. గత నవంబర్ నెలలో తీవ్రంగా గాయపడి జన్నారం టైగర్ జోన్‌కు చేరుకున్న పులిని సిసి కెమెరాల చిత్రాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు పులి జాడ తెలియకపోవడంతో అయోమయానికి ఆస్కారం కలిగిస్తున్నది. బెజ్జూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు గురైన పులికి ఇనుప తీగలు చుట్టుకొని ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే పులికి చుట్టుకున్న ఇనుప తీగల వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి మృతి చెంది ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గాయపడిన పులిని గుర్తించి దానికి చుట్టుకున్న ఇనుప తీగలను తొలగించేందుకు గత ఎనిమిది నెలలుగా జన్నారం జంతు సంరక్షణ సిబ్బంది చేస్తున్న కృషి ఫలించలేదు. ఉచ్చుతో ఉన్నపులి ఇప్పటి వరకు దాదాపు 60 పశువులను, అడవి పందులు, జింకలు, దుప్పులను వేటాడినట్లుగా అటవీ అధికారులు సిసి కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించారు. పులి ఇటీవలి కాలంలో శారీరకంగా ఎదిగి ఉండవచ్చునని, దీని కారణంగా ఇనుప తీగ తెగిపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నప్పటికీ పులిజాడ కనిపించడం లేదు.

కాగా ఉచ్చులో చిక్కుకున్న పులికి ఉన్న ఇనుప తీగలు విషపూరితంగా మారే ప్రమాదాలు ఉన్నాయి. అటవీ అధికారులు ఎలాగైనా పులిని సంరక్షించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. బెజ్జూర్ అడవుల నుంచి నేరుగా వేమనపల్లి అటవీలోకి పులి ప్రవేశించగా అక్కడి నుండి ఆవాసం కోసం కోటపల్లి మండలం కొండంపేట, బొప్పారం అడవుల్లో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. నీల్వాయి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి, అనంతరం కోటపల్లి మండలం పంగిడిసోమారం అడవులకు చేరుకుంది.

ప్రస్తుతం పంగిడిసోమారంతో పాటు బుద్దారం అడవుల్లో సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో గాయపడిన పులికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు దానిపైనే దృష్టిని కేంద్రీకరించి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. వర్షాల వల్ల గాయం మరింత పెద్దగా మారి పులి ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

comments

Related Stories: