కదంతొక్కిన హెట్‌మెయిర్

West-Indies
చెన్నైలో టీమిండియాకు షాక్, షాయ్ హోప్ అజేయ శతకం,  శ్రేయస్, పంత్ శ్రమ వృథా, తొలి వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం

చెన్నై: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా ఆడివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో విండీస్ జయభేరి మోగించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 47.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ షాయ్ హోప్ 102 (నాటౌట్), స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయిర్ (139) శతకాలతో చెలరేగడంతో విండీస్ సంచలన విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సునీల్ అంబ్రిస్ రెండు ఫోర్లతో 9 పరుగులు చేసి దీపక్ చాహర్ వేసిన అద్భుత బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో విండీస్ 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

సమన్వయంతో..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను షాయ్ హోప్, హెట్‌మెయిన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఆరంభంలో ఇద్దరు వికెట్లను కాపాడు కోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో స్కోరు వేగం నెమ్మదించింది. అయితే వికెట్లను కాపాడు కోవడంలో ఇద్దరు సఫలమయ్యారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

షిమ్రోన్ జోరు..

ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. హోప్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితం కాగా, హెట్‌మెయిర్ కాస్త దూకుడును ప్రదర్శించాడు. భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. ఇక, 20 ఓవర్ల తర్వాత విండీస్ స్కోరు వేగం పుంజుకుంది. అప్పటి వరకు సమన్వయంతో ఆడిన హెట్‌మెయిర్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. షిమ్రోన్ తన మార్క్ షాట్లతో విజృంభించడంతో భారత బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. హెట్‌మెయిర్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా శివమ్ దూబేను లక్షంగా చేసుకుని షిమ్రోన్ ముందుకు సాగాడు.

భారత బౌలర్లను హడలెత్తించిన హెట్‌మెయిర్ వరుస సిక్సర్లతో అలరించాడు. అతన్ని ఎలా అదుపు చేయాలో భారత బౌలర్లకు అంతుచిక్కకుండా మారింది. ఇదే క్రమంలో షిమ్రోన్ తన ఖాతాలో ఐదో వన్డే సెంచరీని జమ చేసుకున్నాడు. అంతేగాక అతి తక్కువ మ్యాచుల్లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన తొలి విండీస్ బ్యాట్స్‌మన్‌గా హెట్‌మెయిర్ నిలిచాడు. సెంచరీ తర్వాత కూడా జోరును కొనసాగించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయిర్ 106 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 11 బౌండరీలతో 139 పరుగులు సాధించాడు. అంతేగాక హోప్‌తో కలిసి రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 218 పరుగులు జోడించాడు.

హోప్ కూడా..

మరోవైపు షిమ్రోన్ ఔటైనా షాయ్ హోప్ తన పోరాటాన్ని కొనసాగించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి నికోలస్ పూరన్ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు. చిరకాలం గుర్తుండి పోయే సెంచరీతో విండీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన హోప్ 151 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పూరన్ 4 ఫోర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంత విండీస్ మరో 13 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

ఆదుకున్న అయ్యర్, పంత్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు ఆదుకున్నారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (4), కెప్టెన్ విరాట్ కోహ్లి (4) ఆరంభంలోనే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఆరు ఫోర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక దశలో 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు తమపై వేసుకున్నారు. ఇద్దరు విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. పంత్ తన మార్క్ సాట్లతో చెలరేగి పోయాడు.

ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన పంత్ ఏడు ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా 71 పరుగులు చేశాడు. అంతేగాక అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 114 పరుగులు జోడించాడు. మరోవైపు సమన్వయంతో ఆడిన అయ్యర్ ఐదు ఫోర్లు, సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన కేదార్ జాదవ్ 40 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (21) తనవంతు పాత్ర పోషించాడు. దీంతో భారత్ స్కోరు 287 పరుగులకు చేరింది.

West Indies Beat India by 8 wickets

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కదంతొక్కిన హెట్‌మెయిర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.