వరంగల్‌ను ప్రపంచ పటంలో పెడతాం

మెజారిటీ కోసమే పోరాటం, అభివృద్ధి పథకాలే విజయతీరానికి చేర్చేవి ‘మనతెలంగాణ’తో వరంగల్ టిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్

వరంగల్ లోక్‌సభకు అధికార పార్టీ నుంచి తిరిగి పోటీ చేస్తున్న తన గెలుపు ఎప్పుడో ఖరారు అయ్యిం దని, ఇక పూర్వ మెజారిటీ సాధన కోసమే పోరాటమని సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రేగొం డలో మనతెలం గాణ జిల్లా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో మాట్లాడారు.

సిట్టింగ్ ఎంపీగా ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తామనుకుంటున్నారు ?

2015లో వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో దళితున్ని, సాధారణ కార్యకర్త, ఓ కళాకారుడిని(తెలంగాణతల్లి విగ్రహ సృష్టికర్త) అయిన నన్ను అధినేత పిలిచి టికెట్ ఇచ్చారు. 3లక్షల 40వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించి దీవించి ప్రజలు గల్లీవాన్ని కారెక్కించి ఢిల్లీ పంపించారు. ఈ మెజారిటీ దేశంలోనే ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిగా నాకు అరుదైన ఏడవ స్థానం దక్కింది. అవన్ని ఒక ఎత్తు అయితే ధనవంతులు, కోటీశ్వరులు, పలుకుబడి, పేరున్న సీనియర్ నేతలు ఎందరో ఉండగా, కెసిఆర్ తిరిగి నిరుపేదనైన నన్ను పిలిచి మళ్లీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించడం నా అదృష్టం, ఆయన రుణం తీర్చలేనిది. పార్టీ ఎంఎల్‌ఎలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుభాశీస్సులతో గెలుపు ఎప్పుడో ఖాయమయ్యింది, పూర్వ మెజారిటీ కోసమే ప్రయత్నం, అందుకు అంతా కృషిచేస్తున్నాం.

ఏ నినాదంతో వెళ్లి ఓట్లు అడుగుతున్నారు ?

నాకు దిశానిర్ధేశం చేసేది సిఎం కెసిఆరే, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలవల్లనే పార్టీ నిలిపిన అభ్యర్థులు విజయం సాధించారు, ఆయన చేపట్టిన అభివృద్ధి పథకాలను చూపిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాం.

గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు?

హామీలు ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రం పక్షాన కేంద్రం నుంచి పోరాడి కోట్లది రూపాయల నిధులు తెచ్చి ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాను. అందులో భాగంగా రూ.200కోట్లతో నిడిగొండ నుంచి నీరుకుళ్ల వరకు 96కి.మీ మేర నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, నగరంలో రూ.32కోట్లతో హృదయ్, రూ.300కోట్లతో స్మార్ట్ సిటీ ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. దానితో నగర రూపురేఖలు మారుతాయి. పాస్‌పోస్టు కార్యాలయం, రైల్వే డివిజన్, మామునూర్‌లో ఏయిర్‌పోర్టు వంటి అనేక పెండింగ్ పనులు రేపు ఎన్నికల తరువాత సాధిస్తాం. అవి జరిగితే వరంగల్‌ను ప్రపంచ పటంలో పెట్టడం ఖాయం.

ప్రతిపక్ష ఎంఎల్‌ఎలు ఉన్న చోట ప్రజా స్పందన ఎలా ఉంది?

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో స్టేషన్‌ఘనపురం, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి వంటి శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలలో భూపాలపల్లిని మినహాయిస్తే మిగతా ఆరు స్థానాలలో మా పార్టీ ఎంఎల్‌ఎలు, అగ్రనేతలు ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన భూపాలపల్లిలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాకు 65వేల పైచిలుకు మెజారిటీని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రచారానికి వెళ్లిన చోట ప్రజల అపూర్వమైన ఆదారణ, అంతులేని స్పందన కనిపిస్తుంది, ఓట్ల అడిగేందుకు వెళ్లిన చోట ప్రజలు ఎదురై బ్రహ్మరథం పడుతున్నారు.
సింగరేణి కార్మికుల సమన్యలెలా పరిష్కరిస్తారు?
దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకువెళ్తాను, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం దిశగా కృషిచేస్తాను.

జిల్లా తరలింపు ప్రచారంపై ప్రజలకు ఇచ్చే వివరణ?

ఏర్పాటు చేసిన జిల్లా తరలిపోవడమనేది జరగదు. జిల్లా తరలింపుకు సిఎం సుముఖంగా లేడు, అపోహలు, ఆరోపణలు నమ్మొద్దు, ఎన్నికల తరువాత అన్ని కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తారు?
ఈ నియోజకవర్గం ఆధీనంలో మొత్తం 16,53,474 మంది ఓటర్లు ఉన్నారు, సిఎం కెసిఆర్ కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుభీమా, పింఛన్లు ప్రజాహితం కోరి కోట్లాది రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న 500 పథకాలు ప్రజలకు అందుబాటులో ఆచరణలో ఉన్నాయి. ఈ పథకాలు దేశంలోని యావత్ రాష్ట్రాలకు ఆదర్శం. కెసిఆర్ అమలు చేసిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ చేసింది, ఈ మార్గదర్శక పథకాలు చూసే ప్రజలు 16 సీట్లను గెలిపించి, విజయతీరానికి చేరుస్తారు. అందుకు గత శాసనసభా ఎన్నికలే సాక్షం. ఆ ప్రయోజనంతోనే తిరిగి 88సీట్ల భారీ మెజారిటీతో మళ్లీ మాకు అధికారం కట్టబెట్టడం జరిగింది. సంక్షేమ పథకాల అమలులో ముందున్న తెలంగాణవైపే యావత్ దేశం చూస్తుంది, కెసిఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రెంట్‌దే రేపు భవిత. ఆయనే ప్రధానిని చేయగలడు, అవసరమైతే అయనే ప్రధాని కాగలడని, రేపు ఆయనే కీలకం. సిఎం కెసిఆర్ 20సంవత్సరాల తరువాత రాజకీయాల్లో ఏం జరుగుతుందో అంచనా వేసి ముందే చెప్పగల రాజకీయ చాణక్యుడు. అప్పుడు రెండు ఎంపీ సీట్లతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ దళపతి ఇప్పుడిచ్చే మెజారిటీ సీట్లతో రేపు దేశాన్ని శాసిస్తారు.

గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలపై మీ వివరణ?

అలాంటిదేమీ లేదు. పార్లమెంట్ సభ్యుడు ప్రజల పక్షాన నియోజకవర్గ అభివృద్ధి కోరి లోక్‌సభకు సమయం ఎక్కువగా కేటాయించాల్సి ఉన్నందున ప్రజలకు కొంత దూరంగా ఉన్న మాట వాస్తవమే, నేను ఎన్నికైన స్వల్ప వ్యవధిలో సాంకేతిక కారణాల వల్ల వారికి అందుబాటులో లేకున్నా, సంక్షేమ పథకాల విషయంలో మాత్రం అందరికన్నా ముందున్నా, అందుకు కోట్లాది రూపాయల నిధులను తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. మరోసారి ఎంపీగా గెలిచి సభా సమయం పోను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా., పేదవాడిగా, నిరుపేదల కష్టాలేమిటో తెలుసు. నాపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు, ప్రజలకు కృతజ్ఞతలు.

మీకు ప్రత్యర్థి పార్టీ ఏది?

మాకు ప్రత్యర్థి పార్టీయే లేదు. ఉన్న కాంగ్రెస్, బిజెపిలు నామమాత్రమే. వాటికి ఈ ఎన్నికల తరువాత ఉనికి ఉండదు. అఖండ ప్రజాబలం ఉన్న టిఆర్‌ఎస్‌కే ఎంపీ ఎన్నికల్లో జనం పట్టం గట్టేందుకు నిర్ణయించుకున్నారు.

ప్రచారానికి వ్యవధి సరిపోతుందా?

ఏప్రిల్ 11న ఎన్నికలు, ప్రచార గడువు 9న ముగుస్తుంది, అయితే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో ముందుచూపుతో పథకం ప్రకారం గెలుపే లక్షంగా వ్యూహరచనతో ఉన్న సమయాన్నే అమూల్యంగా భావించి మా శ్రేణులు దూసుకుపోతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి, కార్పోరేషన్ చైర్మన్‌లు, ఎంఎల్‌ఎల సారథ్యంలో కారు ఇప్పటికే విజయపథాన దూసుకుపోతుంది. ఆ వేగాన్ని ఎవరూ అందుకోలేరు. కెసిఆర్ దేశంలోనే నెంబర్‌వన్ సిఎం. ఆయన రాజనీతిజ్ఞతను చూసి కాంగ్రెస్ నుంచే కాక వివిధ పార్టీల నుంచి మాజీ, తాజా ఎంఎల్‌ఎలు రోజురోజుకు వెల్లువలా వచ్చి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయి…వార్ వన్‌సైడే.

మనతెలంగాణ/
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి

The post వరంగల్‌ను ప్రపంచ పటంలో పెడతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.