రైతు బంధుపై రాబందులు

మన తెలంగాణ / కోడేరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులను ఆదుకునేందుకు చేపట్టిన రైతుబంధు పథకం చెక్కులు దళారుల చేతుల్లోకి వెళ్లాయి. అసలే రైతులు పెట్టుబడులు పెరుగుతున్నాయనుకుంటున్న సమయంలో ప్రభు త్వం రైతులకు ఆసరాగా ఉండేందుకు పెట్టుబడి సాయం క్రింద రైతుబంధు చెక్కులను ఎకరాకు రూ.4వేల చొప్పున ఇచ్చింది. ఈ చెక్కులపై కొందరు దళారులు రాబంధువుల్లా మారి చెక్కులు తమవే అని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వ్యవసాయ శాఖ కార్యాలయంలో చెక్కులను తెచ్చుకొన్నారు. వీటిని బ్యాంకుల్లో […]

మన తెలంగాణ / కోడేరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులను ఆదుకునేందుకు చేపట్టిన రైతుబంధు పథకం చెక్కులు దళారుల చేతుల్లోకి వెళ్లాయి. అసలే రైతులు పెట్టుబడులు పెరుగుతున్నాయనుకుంటున్న సమయంలో ప్రభు త్వం రైతులకు ఆసరాగా ఉండేందుకు పెట్టుబడి సాయం క్రింద రైతుబంధు చెక్కులను ఎకరాకు రూ.4వేల చొప్పున ఇచ్చింది. ఈ చెక్కులపై కొందరు దళారులు రాబంధువుల్లా మారి చెక్కులు తమవే అని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వ్యవసాయ శాఖ కార్యాలయంలో చెక్కులను తెచ్చుకొన్నారు. వీటిని బ్యాంకుల్లో డబ్బులను డ్రా చేసుకొని తీసుకున్నారు. ఈ వ్యవహారం అంతా కోడేరు మండలంలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమాలను గుర్తించిన అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోడేరు మండలంలో రైతు బంధు చెక్కులు పట్టాదారు పాసుపుస్తకాల అమ్మకానికి పెట్టారు. మధ్యదళారుల చేతుల్లోకి పట్టాదారు పాసు పుస్తకాలు ఎలా వెళ్లాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు లోపాయికారి ఒప్పందాల తో రైతులను ఇబ్బందులకు గురి చేసి సొమ్ము చేసుకునేందుకు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది హస్తం లేకుండా పాస్‌పుస్తకాలు ఎలా దళారుల చేతుల్లోకి వెళ్లాయని అంటున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో ఇస్తున్న రైతుబంధు చెక్కుల్లో సైతం దళారులు తమ చేతి వాటాన్ని చూ పించారు. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి వాటి ఆధారంగా చెక్కులను తీసుకొని బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకున్నారు. దీంతో అసలైన రైతులు చెక్కులు రాక ఇబ్బందులు పడుతుంటే రైతుల అమాయకత్వాన్ని కొందరు అధికారులు, దళారులు ఆసరాగా తీసుకున్నారు. దీంతో దళారుల చేతుల్లో లక్షలు చేతులు మారాయని గ్రామంలో ప్రజలు అనుకుంటున్నారు.
కోడేరు మండలానికి రైతుబంధు పథకం క్రింద మొదటి విడతలో 13415 పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. వీటిల్లో 1066 పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. అనంతరం రెండవ విడతలో మరో 386 పాసుపుస్తకాలు చెక్కులను రైతులకు అందజేశారు. అయితే కొన్ని పాసుపుస్తకాల్లో తప్పులు ఉండడంతో పంపిణీ చేయలేదు. మొత్తం 13801కిగాను 12294 పాసుపుస్తకాలను రైతులకు అందజేశారు. ఇంకా పుస్తకాలు రాని రైతులు మరో 1065 మంది వరకు ఉన్నారు. వీరిలో చెక్కులు వచ్చి పాసుపుస్తకాలు రానటువంటి వారు, తరువాతి లిస్టులో వచ్చిన పాసు పుస్తకాలు ఉండి తీసుకొనటువంటి వారికి వ్యవసాయ శాఖ కార్యాలయంలో చెక్కులు, తహసీల్దార్ కార్యాలయంలో పాసుపుస్తకాలను ఇస్తున్నారు. వీటిని తీసుకునేందకు రైతులు వెళ్లి తీసుకొనగా మిగిలిన వాటిని వ్యవసాయ కార్యాలయంలో లిస్టు వేసి సదరు రైతులు చెక్కులు తీసుకువెళ్లాలని అధికారులు కోరారు.
ఇక్కడే దళారులు చేతివాటం చూపారు:
మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో చెక్కులు తీసుకుపోని రైతుల లిస్టును వేశారు. సదరు రైతులు ధ్రువీకరణ పత్రాలతో వచ్చి చెక్కులను తీసుకువెళ్లాలని కోరారు. దీంతో దళారులు తమ ఆలోచనలకు పదును పెడుతూ లిస్టుల్లో చెక్కులు తీసుకుపోని వారి పేర్లు, ఆధార్ నంబర్లను తీసుకొని మీ సేవా కేంద్రం నిర్వాహకుని సహాయంతో ఆధార్ కార్డులపై ఉన్న పేరు, ఫొటోలను మార్చివేసి వ్యవసాయశాఖ కార్యాలయంలో చెక్కులను తెచ్చుకొని బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేశారు.

ఇలా బయటపడింది:
మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన మానవపాడు ఈశ్వరమ్మకు కోడేరు శివారులో 1.03 ఎకరాల భూమి ఉంది. పట్టాదారు పాసుపుస్తకం రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగింది. ఇది గమనించిన దళారులు సదరు వ్యక్తి పట్టాదారు పాసుపుస్తకాన్ని తీసుకొని దళారీ మహిళతో రూ.30వేలకు బేరం పెట్టాడు. దాంతో రూ.25వేలు ఇచ్చేందకు ఒప్పందం కుదుర్చుకున్న మహిళ దళారీ రూ.25వేలకు కొంత తక్కువ గా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో బంధువుల ఇంటి వద్దకు వెళ్లి మిగిలిన డబ్బులు తెస్తానని చెప్పి వెళ్లింది. విషయాన్ని బంధువులకు తెలపడంతో ప్రభుత్వమే పాసుపుస్తకాలను, చెక్కులను ఇస్తుందని డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పడంతో ఆగ్రహించిన మహిళా రైతు దళారీని ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం ఒక్కోక్కటిగా బయటికి వచ్చాయి. ఈ విషయంతో తేరుకున్న వ్యవసాయ శాఖ అధికారులు చెక్కుల్లో సైతం దళారులు చేతివాటం చూపారని గమనించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డొంకంతా కదిలింది. ఇదంతా కోడేరుకు చెందిన ఐదుగురు వ్యక్తులు చేసినట్లు తెలిసింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అక్రమాలకు తహసీల్దార్ కార్యాలయంలో కొందరు అధికారులు తమ చేతివాటాన్ని చూపుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. అధికారులకు తెలియకుండా పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా దళారుల చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లే రైతులకు చుక్కలు చూపుతున్నారని అలాంటిది దళారుల చేతుల్లోకి పాసుపుస్తకాలు ఎలా వెళ్లాయని అంటున్నారు. కార్యాలయ పనితీరు సరిగ్గా లేదని గతంలో దొంగ పట్టాదారు పాసుపుస్తకాలు బయటపడినా అధికారుల తీరు మారలేదంటున్నారు. ఇప్పుడు దళారులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చి బేరం పెడుతున్నారని దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. ఒక ప్రక్క దొంగ పాసు పుస్తకాల వైనం, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చిన వైనం, వీటితో బ్యాంక్‌ల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇది మరవకముందే ఇప్పుడు భూములు లేక పోయునా పాసు పుస్తకాలు కొందరికి ఇచ్చారని అంటున్నారు. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Related Stories: