విఆర్‌ఒ వ్యవస్థను రద్దు చేయొద్దు

VRO

వేరే శాఖలో విలీనం చేయకూడదు
సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
త్వరలో అధికారులకు వినతిప్రతం అందిస్తాం
విఆర్‌ఒ సంఘాల వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : విఆర్‌ఒ వ్యవస్థను రద్దు చేయకుండా వేరే శాఖలో విలీనం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ విఆర్‌ఓల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికె ఉపేందర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఆర్‌ఓ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందని అనేక వదంతులు వస్తున్నాయని, దీనిపై నేడు చీఫ్ సెక్రటరీ, సెకట్రరీలను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయిం చినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని, విఆర్‌ఓ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కొందరు కావాలనే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే తమ బాధను సిఎంకు చెప్పుకోవాలను కుంటున్నామన్నారు. విఆర్‌ఓ వ్యవస్థ రద్దు వల్ల కలిగే నష్టాలు, ఇన్ని రోజులుగా తాము చేసిన సేవలు, ప్రభుత్వ భూములకు తాము కల్పించిన రక్షణ తదితర వివరాల గురించి రౌండ్ టేండ్ సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణను మేథావులతో కలిసి చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోనున్నట్టు ఆయన తెలిపారు.
‘ధరణి’ వెబ్‌సైట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి
ఈ వ్యవస్థ రద్దు వలన ప్రజలు రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారని, తమ ఆవశ్యకతను తెలియచేయడానికే ప్రజలతో చర్చించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటికీ ‘ధరణి’ వెబ్‌సైట్ ప్రారంభానికి నోచుకోలేదని, అందులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దానివలన విఆర్‌ఓలు దోషులుగా నిలబడుతున్నారన్నారు. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. తమ వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల తరఫున తాము ఈ సమావేశాన్ని నిర్వహించామని, రానున్న రోజుల్లో తమ సంఘాల తరఫున ప్రభుత్వానికి వినతిపత్రాలను అందచేస్తామన్నారు. ఈ విషయమై సిఎం కెసిఆర్ స్పందించి గందరగోళంగా ఉన్న తమ ఉద్యోగుల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సిఎం తీసుకునే నిర్ణయంపై తమ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయవద్దు, విలీనం చేయవద్దన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుధాకర్‌రావు, విఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు రవినాయక్, ప్రధాన కార్యదర్శి చెన్నం రాజు, విఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు బాలనర్సయ్య, ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు, డైరెక్ట్ విఆర్‌ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సెక్రటరీ జనరల్ ఉమా మహేశ్వర్, రిటైర్డ్ విఆర్‌ఓల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.

VRO associations Demond Dnot cancel VRO system

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విఆర్‌ఒ వ్యవస్థను రద్దు చేయొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.