ఇద్దరూ ఇద్దరే.. శిఖర సమానులే!

Chandrashekhara Kambara

 

నేడు డా॥ చంద్రశేఖర కంబారకు ‘విశ్వంభర’ పురస్కారం
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డా॥ సి.నారాయణరెడ్డి 88వ జయంతి సందర్భంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షులు డా॥ చంద్రశేఖర కంబారకు “విశ్వంభర’ జాతీయ పురస్కారం ఈ నెల 29వ తేదీన ఇవ్వనున్నట్లు సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ప్రకటించింది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో చంద్రశేఖర కంబారా ఈ పురస్కారం అందుకుంటారని ట్రస్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కె.శివారెడ్డి, విశిష్ట అతిథిగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, అధ్యక్షులుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గౌరవ అతిథులుగా పద్మభూషణ్ డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు, ప్రముఖ కవి డా॥ నందిని సిధారెడ్డి, ప్రముక రచయిత్రి ఓల్లా పాల్గొంటారని పేర్కొంది.

పక్క పక్క రాష్ట్రాలకు చెందిన ఆ ఇద్దరూ అనేక రంగాల్లో కృషి చేసిన శిఖర సమానులు. ఇద్దరూ భాషాపరంగా చిన్నచూపు చూడబడ్డ ప్రాంతాలకు చెందినవారు. ఇద్దరూ విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పనిచేశారు. ఇద్దరూ భాషకు సంబంధించిన ప్రత్యేక విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులుగా పనిచేశారు. ఇద్దరూ గొప్ప సాహితీవేత్తలుగా పేరుపొందారు. సాహిత్యంలోనూ విభిన్న ప్రక్రియల్లో అసామాన్యులుగా ఇద్దరూ సినీరంగంలో పనిచేశారు. ఇద్దరూ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరూ పద్మ పురస్కారాలు పొందారు. ఇద్దరూ జ్ఞానపీఠ అవార్డు సాధించారు. ఆ ఇద్దరిలో ఒకరిపేరిట నెలకొల్పిన జాతీయ అవార్డును మరొకరు పొందనున్నారు. ఆ ఇద్దరిలో మొదటివారు దివంగత ఆచార్య సి.నారాయణరెడ్డి. రెండవవారు ప్రముఖ కన్నడ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు ఆచార్య చంద్రశేఖర కంబార.

ఆచార్య సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ప్రతి ఏటా జూలై 29న జాతీయ స్థాయిలో ప్రముఖ సాహితీవేత్తకు విశ్వంభర పురస్కారం అందజేయాలని సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్ణయించింది. ఈ నెల 29న తొలిసారిగా విశ్వంభర జాతీయ పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య చంద్రశేఖర కంబారకు ఇవ్వనున్నారు.
భాషాపరంగా అవహేళనలెదుర్కొన్న ప్రాంతం తెలంగాణ. ఈ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో 1931 జూలై 29న నారాయణరెడ్డి జన్మించారు. కర్ణాటకలో ఉత్తర ప్రాంతం కూడా తెలంగాణలాగే భాషాపరంగా అవమానాలను ఎదుర్కొన్న ప్రాంతం.

ఆ ప్రాంతంలోని బెల్గాం జిల్లాలో ఉన్న ఘోడగెరి అనే గ్రామంలో చంద్రశేఖర కంబార 1937 జనవరి 2న జన్మించారు. వారిరువురూ విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పనిచేశారు. మొదట్లో సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్ట్‌టైం ఉపన్యాసకులుగా చేరి, అక్కడే రెగ్యులర్ ఉద్యోగం పొందారు నారాయణరెడ్డి. 195859లో నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో రీడర్ అయ్యారు. 1976లో ఆచార్యులై, 1981 వరకు అదే విశ్వవిద్యాలయ ఆచార్యులుగా కొనసాగారు. కొద్దికాలం చికాగో విశ్వవిద్యాలయంలో బోధించిన చంద్రశేఖర కంబార అనంతర కాలంలో ఇండియాకు తిరిగివచ్చి, బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఇరవై ఏళ్లకు పైగా ఆచార్యులుగా పనిచేశారు.

అనంతర కాలంలో నారాయణరెడ్డి, కంబార ఇద్దరూ భాషకు సంబంధించి, ప్రత్యేకంగా నెలకొల్పిన విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989 జూన్ 21న తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నారాయణరెడ్డి ఆ పదవిలో 1992 నవంబరు నాలుగో తేదీ వరకు కొనసాగారు. ఆయన ఆ పదవిలో ఉన్నకాలంలోనే పలువురు ప్రముఖులపై తెలుగు విశ్వవిద్యాలయం వీడియో డాక్యుమెంటేషన్ చేసింది. 150కి పైగా ఉత్తమ గ్రంథాలను ప్రచురించింది. ఆ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టకపూర్వమే దేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ప్రత్యేకత పొందిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 1985 నుండి 1989 వరకు వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే అదనంగా కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కూడా కొంతకాలం వ్యవహరించారు. కన్నడ భాషా సాహిత్యాల కోసం ప్రత్యేకంగా ఏర్పరచిన కన్నడ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతిగా పనిచేశారు చంద్రశేఖర కంబార. విజయనగర శిల్పశైలిలో భవనాల నిర్మాణం చేపట్టి, ఆ విశ్వవిద్యాలయానికి కన్నడ సీమ చారిత్రక సొబగులద్దారు.

ఇద్దరూ సాహిత్యంలో పరిశోధన చేశారు. ఆచార్య సి.నారాయణరెడ్డి పరిశోధన ‘ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు’ అత్యుత్తమ పరిశోధనాగ్రంథంగా పేరొందింది. చంద్రశేఖర కంబార ధార్వాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి ‘ఉత్తర కర్ణాటక జానపద రంగభూమి’ అనే అంశంపై పిహెచ్.డి. చేశారు. జానపద కళల్లోనూ, జానపద సాహిత్యంలోనూ విశేష పరిశోధన చేశారు.వారిరువురూ సాహిత్యరంగంలో పలు ప్రక్రియల్లో విశేష కృషి చేశారు. ఆచార్య సి.నారాయణరెడ్డి 18 ప్రక్రియల్లో 90కి పైగా గ్రంథాలను రచించారు. వచన కవిత్వంతో పాటు పద్యకావ్యాలు, గేయ కావ్యాలు, గద్య కృతులు, యాత్రాకథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్రకథలు, గజళ్లు, వ్యాసాలు, విమర్శనాగ్రంథాలు, అనువాదాలు మొదలైనవి ఆయన లేఖిని నుండి వెలువడ్డాయి. ఆచార్య చంద్రశేఖర కంబార కూడా వేర్వేరు ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇప్పటివరకు 31 నాటకాలను, 11 కవితాసంకలనాలను, 5 నవలలను, ఒక కథాసంపుటిని, 16 పరిశోధనాగ్రంథాలను వెలువరించారు.

సాంస్కృతిక రంగంలోనూ ఇద్దరూ శ్లాఘనీయమైన కృషితో గొప్ప సృజనకారులుగా పేరుపొందారు. ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం మొదలైన పద్య నాటికలతో పాటు భలే శిష్యులు మొదలైన సాంఘిక నాటకాలను బాల్యంలోనే రచించారు. ఆయా ప్రదర్శనల్లో నటుడిగా కూడా పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ‘సినీకవి’ అనే నాటికను రచించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఆ నాటికలో నటనకు బహుమతి కూడా పొందారు. రామప్ప సంగీత నృత్యరూపకంతో పాటు పలు రూపకాలను, నాటకాలను ఆయన రచించారు. చంద్రశేఖర కంబార 31 నాటకాలను రాశారు. వాటిలో సంగ్యబాల్య, జోకుమారస్వామి, జై సిద్ధనాయక, ఛలేషా, సిరి సంపిగె, మహామాయి, సాంబశివ ప్రహసన మొదలైనవి బహుళ ప్రజాదరణ పొందాయి. ‘జోకుమారస్వామి’ నాట్యసంఘ్ వారి కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డు పొందింది. నాయి కథె, కాడు కుదురె మొదలైన నాటకాలు అనంతర కాలంలో సినిమాలుగా రూపొంది, ఆయనకు మంచిపేరు తెచ్చాయి. ఆయన రాసిన పలు నాటకాలు కర్ణాటక రాష్ట్రంలో వేలాదిసార్లు ప్రదర్శితమయ్యాయి.

భారతీయ ఆధునిక నాటకాల సంకలనాన్ని కూడా ఆయన వెలువరించారు. సినీరంగంలోనూ ఇరువురూ పనిచేశారు. ‘గులేబకావళి కథ’తో సినీ రంగంలో ప్రవేశించిన నారాయణరెడ్డి మూడున్నరవేలకు పైగా పాటలను సినిమాల కోసం రాశారు. ‘ఏకవీర’ మొదలైన సినిమాలకు సంభాషణలు కూడా రాశారు. నటుడిగానూ వెండితెరపై కొన్ని సినిమాల్లో తళుక్కుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాన్ని ఉత్తమ గేయ రచయితగా రెండు పర్యాయాలు స్వీకరించారు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, కథారచయితగా, సంభాషణల రచయితగా కంబార సినీరంగంలో పనిచేశారు. ‘కరిమయి’, ‘కాడు కుదురె’, ‘ప్రణయ ప్రసంగ’ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆరు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ‘కాడు కుదురె’ సినిమాకు 1987లో ఆయన జాతీయ అవార్డు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సంగీత’ అనే చలనచిత్రానికి మూడవ అత్యుత్తమ చలనచిత్రంగా 1981లో అవార్డు లభించింది. ఉత్తమ కథారచయితగా, ఉత్తమ సంభాషణల రచయితగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ దర్శకుడిగా ఆయన సినీరంగంలో అవార్డులు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం అనేక డాక్యుమెంటరీలను ఆయన రూపొందించారు.

ఇరువురికీ లభించిన గౌరవాల విషయంలోనూ అనేక పోలికలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారాలను ఇరువురూ పొందారు. నారాయణరెడ్డి 1977లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. చంద్రశేఖర కంబార 2001లో పద్మశ్రీ పొందారు. ఈ ఇరువురూ జ్ఞానపీఠ పురస్కారాన్ని వరుసగా 1988, 2010 సంవత్సరాల్లో స్వీకరించారు. ఈ ఇద్దరూ కేరళకు చెందిన కుమారన్ ఆసన్ అవార్డు పొందారు. వారిద్దరూ పెద్దల సభలో సభ్యులుగా పనిచేశారు. ఆచార్య సి.నారాయణరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా 1997 సంవత్సరంలో రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఆ పదవిలో 2003 వరకు ఆయన కొనసాగారు. ఆచార్య చంద్రశేఖర కంబార కర్ణాటక శాసనమండలి సభ్యునిగా పనిచేశారు.

బహుశా ఇద్దరి మధ్య అనేక విషయాల్లో సారూప్యత ఉన్నందువల్లే సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు నెలకొల్పిన విశ్వంభర జాతీయ అవార్డుకు తొలిసారిగా ఆచార్య చంద్రశేఖర కంబారను ఎంపికచేసింది. ఈ నెల 29వ తేదీన ఆచార్య సి.నారాయణరెడ్డి జయంత్యుత్సవ సందర్భంగా హైదరాబాదులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును కంబార స్వీకరించనున్నారు. కంబారను ఈ అవార్డుకు ఎంపిక చేసిన ఆచార్య సి.నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు; ట్రస్టు అధ్యక్ష కార్యదర్శులు గోవిందరాజు రామకృష్ణారావు, డాక్టర్ జె.చెన్నయ్య; ఎంపిక కమిటీ సభ్యులు అభినందనీయులు. అవార్డును స్వీకరిస్తున్న సందర్భంగా ఆచార్య చంద్రశేఖర కంబారకు శుభాకాంక్షలు.

Visvambhara National Award to Chandrashekhara Kambara

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇద్దరూ ఇద్దరే.. శిఖర సమానులే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.