నైవేద్యం సమర్పయామి..!

Ganesha

 

గణేశుడి నవరాత్రులు వస్తున్నాయంటే అందరికీ పండుగే పండుగ. వద్దన్నా ప్రసాదాలు పెడుతూనే ఉంటారు మరి. కుడుములూ, ఉండ్రాళ్లూ, లడ్డూలూ, కజ్జ్జికాయలూ, పాయసాలూ, పులిహోరాలూ, పొంగళ్లూ, సెనగలూ ..ఇలా ఎవరికి వచ్చినవి వాళ్లు చేసేస్తుంటారు. విఘ్నేశుడి పూజ చేసి స్వామికి నైవేద్యం సమర్పించి బంధుమిత్రులతో ప్రసాదాలను ఆరగిస్తుంటారు. అందరికీ ఇష్టదైవమైన వినాయకుడిని తలుచుకుంటూ సంతోషంగా గడిపేస్తారు.

కుడుములు
వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉండ్రాళ్లు. గణపయ్య నైవేద్యంలో ప్రధానమైనవి ఇవే. వీటినే కుడుములు అని అంటారు. బియ్యం రవ్వతో చేసే కుడుములంటే వినాయకుడికి చాలా ఇష్టం. వీటి తరువాతే ఏవైనా. నూనె వాడకుండా చేసే పిండివంటలు వినాయక చవితి పండుగలో ప్రత్యేకత. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కావలసిన పదార్థాలు:
బియ్యపు రవ్వ: 1 కప్పు, నీళ్ళు- 1 -1/2 కప్పులు, శెనగపప్పు: 1/2 కప్పు, జీలకర్ర- 1 టీస్పూన్, ఉప్పు -సరిపడా, నూనె కొద్దిగా (బియ్యం పిండి ఉండలు కట్టకుండా ఉండేందుకు మాత్రమే)
తయారు చేసే పద్ధతి :
ముందుగా మందపాటి గిన్నెలో నీరు పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక శెనగపప్పు వేయాలి. ఆ తర్వాత బియ్యం రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. జీలకర్ర వేసుకోవాలి. మంట చిన్నగా పెట్టి బియ్యం రవ్వ మెత్తగా మగ్గాక దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పళ్లెంలో వేసి (కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకుంటే బాగుంటుంది) చల్లారబెట్టుకుని కుడుముల్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి కొద్దిగా నీరు పోసి ఈ ఉండాళ్లను వాటిపై పేర్చి మూతపెట్టాలి. కొంచెం సేపు ఆవిరిపై ఉడికించాలి. అంతే.. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు సిద్ధం.

వెలక్కాయ వడలు

కావలసినవి: వెలక్కాయ గుజ్జు : ఒక కప్పు, మినపప్పు: కప్పు, పెసరపప్పు: అర కప్పు, పచ్చిమిర్చి నాలుగు, ఉప్పు: తగినంత, కరివేపాకు : 4 రెబ్బలు, అల్లం : చిన్నముక్క, జీలకర్ర : టీస్పూను, కొత్తిమీర తురుము: 2 స్పూన్లు, నూనె : వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా మినపప్పు, పచ్చి శెనగపప్పు, పెసరపప్పులు నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బాలి.
* ఓ గిన్నెలో రుబ్బిన పిండి వేసి అందులోనే బాగా పండిన వెలక్కాయ గుజ్జు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు తురుము, కొత్తమీర తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా వత్తి కాగుతున్న నూనెలో వేయించి తీస్తే వెలకాయ వడలు రెడీ. అల్లం, పుదీనా చట్నీలతో బాగుంటాయి.

డ్రైఫ్రూట్ కజ్జికాయలు

కావాల్సినవి: మైదాపిండి: 3 కప్పులు, ఉప్పు: చిటికెడు, నెయ్యి :3 స్పూన్లు, గసగసాలు : 2 స్పూన్లు, ఎండుకొబ్బరి పొడి: పావు కప్పు, పంచదార లేదా బెల్లం తురుము: అర కప్పు, జీడి పప్పు, బాదం, పిస్తా, అక్రోటు ముక్కలు (అన్నీ కలిపి) అరకప్పు, నూనె : వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : * ముందుగా మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కాస్త నూనె, తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలపాలి.
* పాన్‌లో నెయ్యివేసి జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోటు ముక్కలు, గసగసాలు, ఎండుకొబ్బరి పొడి అన్నీ కలిపి వేయించాలి. చల్లారాక బెల్లంతో కలిపి కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి.
* మైదా ముద్దను చిన్న పూరీల్లా చేసుకుని పూరీని కజ్జికాయల చెక్కలో పెట్టి దాని మధ్యలో స్పూను గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి ఓ పక్క పూరీకి కాస్త తడిచేసి చెక్కను మూసి గట్టిగా నొక్కి తీయాలి. ఇలా అన్నీ చేసుకున్నాక కాగిన నూనెలో వేయించి తీయాలి.

గసగసాలు, ఆవపిండి పులిహోర

కావలసినవి: బియ్యం : పావు కిలో, చింతపండు రసం: పావు కప్పు, పసుపు: అర టీ స్పూను, పచిమిర్చి : నాలుగు, గసగసాలు : అరకప్పు, ఆవాలు: పావు కప్పు, ఎండుమిర్చి : నాలుగు, ఎండుకొబ్బరి తురుము : 2 స్పూన్లు, ఉప్పు: తగినంత, కరివేపాకు : 4 రెబ్బలు, పచ్చి సెనగపప్పు: టీ స్పూను, జీలకర్ర : అరటీ స్పూను, ఇంగువ: చిటికెడు, నూనె: 2 స్పూన్లు.
తయారుచేసే విధానం: * ముందుగా బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులో కాస్త పసుపు, నూనె వేసి అన్నం పొడిపొడిగా ఉండేటట్లు వండాలి.
* విడిగా ఓ బాణలిలో గసగసాలు, ఆవాలు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి తురుము దోరగా వేయించి పొడి చేసుకోవాలి. * ఇపుడు బాణలిలో నూనె పోసి కాగాక ఎండుమిర్చి, మినపప్పు, పచ్చి శెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. * తరువాత చింతపండు రసం వేసి మరిగించాలి. ఇపుడు వెడల్పాటి బేసిన్‌లో అన్నం వేసి అందులోనే వేయించి పొడి చేసుకున్న మిశ్రమం, తాలింపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
* అంతే ఘుమఘుమలాడే పులిహోర సిద్ధం.

పూర్ణం ఉండ్రాళ్లు

కావలసినవి : బియ్యంపిండి : 2 కప్పులు, మంచినీళ్లు :3 కప్పులు, నూనె :టీస్పూను, ఉప్పు : కొద్దిగా, పూర్ణం కోసం : పచ్చి శెనగ పప్పు : కప్పు, ఎండు కొబ్బరిపొడి :2 స్పూన్లు, యాలకుల పొడి : స్పూను, బెల్లం తురుము: కప్పు
తయారుచేసే విధానం : స్టవ్‌పైన గిన్నె పెట్టి, మూడు కప్పుల నీళ్లుపోసి కాగాక అందులో కాస్త ఉప్పు, టీ స్పూను నూనె వేసి కలపాలి, ఇపుడు బియ్యప్పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పిండి ముద్దలా అయ్యాక స్టవ్‌పై నుంచి దించాలి. తర్వాత కుక్కర్‌లో పచ్చిశెనగ పప్పును మెత్తగా ఉడికించాలి. నీళ్లు వంపేసి బెల్లం తురుము వేసి కలిపి కచ్చాపచ్చాగా రుబ్బాలి. అందులోనే యాలకుల పొడి, ఎండు కొబ్బరిపొడి వేసి కలపాలి. ఉడికించిన బియ్యప్పిండి మిశ్రమాన్ని పెట్టి దాన్ని మూసేసి గుండ్రంగా చేయాలి. ఇపుడు వీటిని ఇడ్లీ కుక్కర్‌లో ఆవిరి మీద అయిదు నిమిషాలు ఉడికించాలి. అంతే విఘ్నేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు రెడీ.

Vinayaka Chavithi Charitra in Telugu

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నైవేద్యం సమర్పయామి..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.