రుషి పత్నులకు నీలాపనిందలు

Vinayaka Chavithi Celebrations

విఘ్నాలకి అధిపతి

ఓ రోజు అనేకమంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, పూజించి చెప్పారు. “స్వామీ! విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలను శాసించేందుకుగాను మాకో అధిపతిని ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలుగకుండా చూసుకుంటాము” తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు. “నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యం నాకివ్వండి నాన్నగారు” రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో చెప్పాడు. “నాన్నగారూ! అన్నయ్య మరుగుజ్జు. అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి” వారి వాదనలను విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు. “పిల్లల్లారా! మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి, వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను. వెంటనే బయలుదేరండి”

ఆ మాటలు వినీవినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు. “నాన్నగారూ! ఎలుకనెక్కి వెళ్లి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేను. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి” అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు.

“కుమారా! ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు మూడు వందల కల్పాల కాలం, పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు” “అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారూ” ఉత్సాహంగా అడిగాడు గజాననుడు. తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తితో ఆ మంత్రాన్ని స్మరించసాగాడు.——
మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్లగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభైలక్షల నదుల్లో స్నానానికి వెళ్లినా మంత్ర
మహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరిస్నానం కూడా పూర్తి చేసి, ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరకు వెళ్లి పశ్చాత్తాపంతో చెప్పాడు.

vinayaka chavithi pooja vidhanam

“నాన్నగారూ! అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్యే అన్నివిధాలా సమర్థుడు కనుక గజాననుడినే విఘ్నాలకి అధిపతిని చేయండి” ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుడిని ఆ రోజు పూజించి, వడపప్పు, పానకం, అరటిపండ్లు, తేనె, పాలు, కొబ్బరి, అతనికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లు ఇతర పిండివంటలను నైవేద్యంగా పెట్టసాగారు.

ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకు నైవేద్యం పెట్టిన వాటన్నిటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వంగి నమస్కారం చేయటానికి ప్రయత్నించాడు. అయితే తిన్నవాటితో కడుపు ఉబ్బిన వినాయకుడు నేల మీద బోర్లా పడుకొన్నాడు. పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతులను భూమికి ఆనిస్తే, కాళ్లు పైకి లేవసాగాయి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థ పడే విఘ్నేశ్వరుడిని చూసిన, శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా పిండవుతాయంటారు. ఈ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి నేల మీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి వెంటనే శపించింది. “దుర్మార్గుడా! నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారంతా నీలాపనిందలతో బాధపడుదురుగాక!”

రుషి పత్నులకు నీలాపనిందలు

సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నిప్రదక్షిణం చేస్తూండగా, అగ్నిదేవుడు ఆ ఏడుగురి భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు. కాని వారిని ఏం చేయలేనివాడై, క్షీణించసాగాడు. ఈ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహా దేవి భర్త కోరికను తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప, మిగిలిన ఆరుగురి రూపాలను తన మహత్తుతో ధరించి అగ్నిదేవుడి కోరికను తీర్చింది. ఆ ఆరుగురు మునులు అది చూసి, తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్లను వదిలేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ని చూసిన ఆ ఆరుగురు భార్యల మీద, తాము చేయని నేరం వచ్చి పడింది.

ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి, ఆ రుషుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. “పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు. మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా. పదండి” అంటూ శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్లాడు.
కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుని బతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు. “తల్లీ! పార్వతీ! నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకులకు అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి.

దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు” అంటూ వేడుకున్నారు. బతికి వచ్చిన విఘ్నేశ్వరుడిని ముద్దు పెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది. “సరే ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసినా ఏం కాదు” అన్నది. బ్రహ్మ, ఇతర దేవతలు అది విని సంతోషించి, తమ తమ స్థానాలకు వెళ్లారు. అప్పటి నుంచి భాద్రపద మాస శుద్ధ చవితినాడు చంద్రుడిని చూడకుండా ప్రజలు జాగ్రత్తపడుతూ సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రుషి పత్నులకు నీలాపనిందలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.