రాజరాజేశ్వరి మనసాస్మరామి

  దేవాసురులు పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్తమే విజయదశమి. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, వర్జ్యం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా, విజయదశమి నాడు ప్రారంభించిన పనిలో విజయం తథ్యమని చెబుతారు. దసరా ఉత్సవాలలో నేటికీ రామలీల ఆచరణలో ఉంది. రావణ కుంభకర్ణుల దిష్ట బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానం వరకు […] The post రాజరాజేశ్వరి మనసాస్మరామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేవాసురులు పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్తమే విజయదశమి. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, వర్జ్యం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా, విజయదశమి నాడు ప్రారంభించిన పనిలో విజయం తథ్యమని చెబుతారు. దసరా ఉత్సవాలలో నేటికీ రామలీల ఆచరణలో ఉంది. రావణ కుంభకర్ణుల దిష్ట బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానం వరకు వేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణాసంచాతో వాటిని తగులబెడతారు. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే సంప్రదాయం ఉంది.

శనగపిండి లడ్డు:
కావాల్సినవి: శనగపిండి – 1 కప్పు, నూనె – పావుకిలో, జీడిపప్పు : 50 గ్రాములు, పంచదార – 1 కప్పు, నీళ్ళు – 1 కప్పు.
తయారీ: శనగపిండిలో తగినన్ని నీళ్ళు కలిపి ముద్దచేసి, బూందీ తయారు చేసుకోవాలి. ఆ బూందీని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక గిన్నెలో నీళ్ళు, పంచదార కలిపి పాకం పట్టుకోవాలి. ఈ పాకంలో బూందీ పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ముద్దను బాగా కలిపి పాలతో కొంచెం తడిచేసుకుంటూ ఉండలు చేస్తే సరి.. రాజరాజేశ్వరీ దేవికి నివేదించాల్సిన లడ్డూలు రెడీ.

 

పండుగ నాడే ఎందుకు చూడాలి

పాలపిట్టను ఎప్పుడు చూసినా ఆనందమే. పండుగ రోజునే చూడటానికి చరిత్రలో ఓ కారణం ఉంది. పాండవులు 12 ఏళ్ల వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం ముగించుకొని తమ రాజ్యానికి బయలుదేరుతున్న సమయంలో పాలపిట్ట కనిపించిందట. ఆహా ఆ పక్షి ఎంత బాగుంది. అని వాళ్లు దాన్ని తనివితీరా చూశారు. ఐతే… ఆ తర్వాత చాలా జరిగాయి. కౌరవులు, పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకపోవడం, తమ రాజ్యం కోసం వాళ్లు యుద్ధం చెయ్యడం, ఆ యుద్ధంలో వీర విజయం సాధించడం అన్నీ జరిగాయి. ఈ క్రమంలో పాల పిట్టను చూడటం వల్లే వాళ్లకు అన్ని విజయాలూ వరించాయనే ప్రచారం జరుగుతోంది. అందువల్ల పాలపిట్టను చూడాలి. ఒకవేళ పండుగ నాడు కనిపించకపోతే బాధపడనక్కర్లేదు. పాలపిట్టను ఎప్పుడు చూసినా విజయోస్తే.

జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గా దేవికి, సిద్ది ప్రదాత వినాయకునికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం ఉంది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణుని పై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీ రాముని వనవాస సమయం లో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసంకి వెళ్ళే ముందు తమ ఆయుధాల్ని శమీ చెట్టు పై పెట్టడం జరిగింది.

శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.
దసరా పర్వదినం నాడు పాలపిట్టను చూడటం ఆనవాయితీ. ఊళ్లల్లో అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్లి పాలపిట్టను చూస్తుంటారు.
దసరాకీ, నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకూ సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక… విజయ దశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సూచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే… దసరా అంటేనే చెడుపై విజయానికి గుర్తు. ఇదే దసరా రోజున రావణాసురుణ్ని అంతమొందించి శ్రీరాముడు ఘన విజయం సాధించాడు. అలాగే రాక్షసుల రాజు మహిషాసురడిని నేల కూల్చి… కాళికా మాత ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం దక్కినట్లే. అందుకే… పండుగ నాడు పాలపిట్టను చూడాలి. అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు.

Vijayadashami Festival Celebration in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజరాజేశ్వరి మనసాస్మరామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: