పసందైన పనస…

Jackfruit

 

ఈ శుభకార్యాల సీజన్‌లో విస్తరిలో పనస పొట్టు కూరలేనిదే వడ్డన పూర్తయినట్లు కాదు. పనసతో వివిధ వంటకాలను తయారుచేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. ఒక్కో పండు దాదాపు 35 కిలోల బరువు, 90 సెం.మీ. పొడవు, 50 సెం.మీ. వ్యాసంలో ఉంటుంది. దీన్ని కోయాలంటేనే చాలా మంది భయపడుతుంటారు. పనస కాయను కోసేటప్పుడు చేతికి, చాకుకి కూడా తప్పనిసరిగా నూనె రాయాలి. మార్కెట్‌లో రెడీమేడ్‌గా పనస పొట్టు దొరుకుతుంది. మనకు ముక్కలుగా కావాలంటే అలాగే ముక్కలుగా కూడా అమ్ముతారు. ఈ కాయలో పోషకవిలువలు ఎక్కువగా ఉన్నాయి.

* దీనిని సంస్కృతంలో స్కంద ఫలం అంటారు.
* విందు భోజనాల సమయంలో ఈ కూరను తప్పనిసరిగా తయారుచేస్తారు.
* జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.
* వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
* రక్తపోటును తగ్గిస్తుంది.
* వేడి చేసిన పనస ఆకులను గాయాల మీద ఉంచితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* అధిక బరువును మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
* కొద్దిగా తయారయిన కాయను కోసి, పండ బెట్టుకుంటేనే పనస పండుకి రుచి.
* ఇందులో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
* విటమిన్ ఏ, బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి.
* ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది .
* పనస చెక్కతో తయారైన వీణలు శ్రేష్ఠమైనవి
* చిన్న చిన్న పడవల తయారీకి
పసన చెక్కను ఉపయోగిస్తారు.
* పనసాకులను విస్తరాకులుగా ఉపయోగిస్తారు.
* పనస ఆకులలో ఇడ్లీ పిండి వేసి, ఇడ్లీలు కూడా తయారుచేస్తారు. వీటిని పొట్టిక్కలు అంటారు.
* పనస వేర్లతో ఫొటో ఫ్రేములు తయారుచేస్తారు.
* సీజనల్‌గా వచ్చే పనస కాయ రుచులను తింటే ఆరోగ్య సమస్యలు మాయం
అవుతాయి.

 

గింజల కూర

కావలసిన పదార్థాలు: పనస గింజలు: ఒక కప్పు, మామిడికాయ : ఒకటి, పచ్చిమిర్చి: మూడు, నూనె: ఒక చెంచా. మెంతులు: అర చెంచా, ఆవాలు: అర చెంచా, ఎండుమిర్చి: నాలుగు, పచ్చికొబ్బరి కోరు: పావు కప్పు, జీలకర్ర: పావు చెంచా, పసుపు: పావు చెంచా, లవంగాలు: రెండు, కరివేపాకు: నాలుగు రెబ్బలు, ఉల్లిపాయ: పెద్దది ఒకటి, ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం: పనస గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించాలి. మామిడికాయ, ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసుకోవాలి. పచ్చికొబ్బరి కోరు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, పసుపు, జీలకర్రలను మెత్తని పేస్టులా చేసుకోవాలి. తర్వాత పనస ముక్కలు ఉడికించిన కుక్కర్లో మామిడి ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి ఉడికించాలి. మామిడికాయ ముక్క మెత్తబడ్డాక పప్పు గుత్తితో పనసగింజలను, మామిడి ముక్కలను మెదపాలి. ఇందులో పచ్చికొబ్బరి పేస్టుని కలిపి సన్నని సెగపై మరికొద్దిసేపు ఉంచాలి. ఒక బాణలిని తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లితరుగుతో తాలింపు పెట్టి కూరలో వేసేయాలి. ఈ కూర అన్నంతో చాలా చాలా రుచిగా ఉంటుంది.

 

బిర్యానీ

కావలసిన పదార్థాలు: పనస ముక్కలు: పావు కిలో, నూనె: అరకప్పు, నెయ్యి: కొద్దిగా, బాస్మతి బియ్యం: రెండు కప్పులు, పచ్చిమిర్చి: ఆరు, క్యారెట్: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, బఠాణీ: మూడు చెంచాలు, టొమాటో: ఒకటి, అల్లం-వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు, లవంగాలు: మూడు, చెక్క: కొద్దిగా, యాలకులు: మూడు, బిర్యానీ ఆకులు: మూడు, గరంమసాలా: అర చెంచా, ధనియాల పొడి: రెండు చెంచాలు, పసుపు: చిటికెడు, కారం: అరచెంచా, ఉప్పు: తగినంత, కరివేపాకు: మూడు రెబ్బలు, కొత్తిమీర: మూడు చెంచాలు, పుదీనా: మూడు చెంచాలు.

తయారుచేసే విధానం: ముందుగా కూరగాయలన్నింటినీ సన్నటి ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై కుక్కర్ పెట్టుకుని అందులో నూనె, నెయ్యి వేసుకోవాలి. వేడి చేశాక మొత్తం గరంమసాలా దినుసులు వేసుకుని వేయించాలి. ఇందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయాక ఇందులో ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. ఇవి కూడా వేగాక పనస ముక్కలు వేసి ఫ్రై చేయాలి. దాంట్లో కరివేపాకు, పుదీనా, బఠాణీ, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కాస్త మగ్గాక టొమాటో ముక్కలు వేయాలి. అన్నీ పూర్తిగా మగ్గాక అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి, మూడు కప్పుల నీళ్లను పోయాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కుక్కర్‌పై మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ పోయాక కుక్కర్‌ను తీసి ఇందులో కొత్తిమీర తరుగు వేసి వేడివేడిగా వడ్డించాలి.

 

మసాలా కూర

కావలసిన పదార్థాలు: పనస కాయ ముక్కలు: రెండు కప్పులు, పచ్చికొబ్బరి పేస్ట్: అరకప్పు, ఉల్లిపాయ పేస్ట్: అరకప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా, గసగసాలు, జీడిపప్పు, పేస్ట్: అర కప్పు, వేయించిన పల్లీల పేస్ట్: అర కప్పు,
చింతపండు: కొద్దిగా, బెల్లం: కొద్దిగా, గరంమసాలా: ఒక చెంచా, పసుపు: చిటికెడు, నూనె: మూడు చెంచాలు, ఉప్పు: తగినంత, కారం: తగినంత, కొత్తిమీర: కొద్దిగా

తయారుచేసే విధానం: పనస కాయను శుభ్రం చేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. వీటిలో ఉప్పు, పసుపు, నీళ్లు పోసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసుకుని కాగిన తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, గరంమసాలా వేసుకుని వేయించుకోవాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకుని తరువాత జీడిపప్పు, -గసగసాల పేస్ట్‌ను కూడా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తరువాత పచ్చికొబ్బరి పేస్ట్‌ను వేయాలి. బాగా కలుపుకున్న తరువాత ఇందులో వేయించిన పల్లీల పేస్ట్ వేయాలి. దీన్ని కూడా బాగా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో పనస ముక్కలు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. నూనె తేలిన తరువాత చివరగా కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు కూడా వేసి దించేసుకోవాలి.

 

పనస పొట్టు కూర

కావల్సినవి: చిన్న పనస కాయ, చింతపండు గుజ్జు: అరకప్పు, ఆవాలు: మూడు చెంచాలు, ఎండు మిర్చి: ఆరు, పచ్చిమిరపకాయలు: ఆరు, పొట్టు మినపప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, కరివేపాకు: రెండు రెబ్బలు, ఆవాలు: చెంచా, ఇంగువ: చిటికెడు, పసుపు: అర చెంచా, పల్లీలు: గుప్పెడు, జీడిపప్పు: గుప్పెడు, నూనె: తగినంత, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ముందుగా పనసకాయను పొట్టుగా కొట్టుకోవాలి. పొట్టు ఎంత సన్నగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది. పనస పొట్టును బాగా కడగాలి. తరువాత స్టవ్‌పై వెడల్పాటి బాణలిని ఉంచి నూనె వేయాలి. కాగిన తరువాత పొట్టు మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపును వేయాలి. ఇవి కాస్త వేగాక ఇందులో పల్లీలు, జీడిపప్పు కూడా వేయాలి. ఇవి వేగాక, కడిగి ఉంచుకున్న పనసపొట్టును కూడా వేయాలి. తరువాత దీన్ని బాగా కలిపి చింతపండు పులుసు, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టాలి. స్టవ్ మంటను మీడియంలో పెట్టి వదిలేయాలి. ఇందులో పులుపు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి. ఒక పది నిముషాల తరువాత మూత తీసి ముక్క ఉడికిందో, లేదో చూసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కూర పొడిపొడి అయ్యేంత వరకు స్టవ్ మంటను మీడియంలోనే ఉంచాలి. ఈ సమయంలో కావాలంటే కొద్దిగా నూనెను కూడా కలుపుకోవచ్చు. చివరగా పొయ్యి కట్టేసిన తరువాత ఆవ కోసం తీసుకున్న ఆవాలను కొంచెం నీళ్లు పోసి బాగా నూరి కూర చల్లారిన తరువాత అందులో వేయాలి. అంతే కూర తయారు. ఈ కూర మర్నాటికి చాలా బాగుంటుంది.

Various Dishes prepared with Jackfruit

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పసందైన పనస… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.