ఆకు కారాలు

  జ్వరమొచ్చి తగ్గినప్పుడు పథ్యం గానూ, ముసురు పట్టినప్పుడు నోటికి కారంగానూ తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త కారప్పొడీ, నెయ్యీ వేసుకుని తింటే ఆ రుచేవేరు. ఆ కారప్పొడిని ఆకులతో గానీ చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. అన్నంలోకే కాదు, ఇడ్లీల్లోకి దోసెల్లోకీ కూడా ఈ పొడి ఎంతో బాగుంటుంది. మరి చేసేద్దామా..! మునగాకు కావలసినవి: మునగాకు: 4 కప్పులు, శనగపప్పు: కప్పు, పెసరపప్పు: అర కప్పు, ధనియాలు:4టీస్పూన్లు, ఎండుమిర్చి: పన్నెండు, చింతపండు :కొద్దిగా, […] The post ఆకు కారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జ్వరమొచ్చి తగ్గినప్పుడు పథ్యం గానూ, ముసురు పట్టినప్పుడు నోటికి కారంగానూ తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త కారప్పొడీ, నెయ్యీ వేసుకుని తింటే ఆ రుచేవేరు. ఆ కారప్పొడిని ఆకులతో గానీ చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. అన్నంలోకే కాదు, ఇడ్లీల్లోకి దోసెల్లోకీ కూడా ఈ పొడి ఎంతో బాగుంటుంది. మరి చేసేద్దామా..!

మునగాకు
కావలసినవి: మునగాకు: 4 కప్పులు, శనగపప్పు: కప్పు, పెసరపప్పు: అర కప్పు, ధనియాలు:4టీస్పూన్లు, ఎండుమిర్చి: పన్నెండు, చింతపండు :కొద్దిగా, బెల్లం: చిన్న ముక్క, జీలకర్ర: 2టీస్పూన్లు, మెంతులు:2 టీస్పూను, పసుపు:చిటికెడు, ఉప్పు:తగినంత, నూనె:తగినంత
తయారు చేసే విధానం : 1. ముందుగా బాణలిలో శనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు విడివిడిగా వేయించి తీయాలి. ఇవి చల్లారక అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి.
2. తరువాత అందులోనే కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించి తీసి చింతపండు వేయాలి. అది కూడా కాస్త వేయించాక తీసేసి మునగాకు వేయించాలి.
3. ఇప్పుడు మిక్సీలో చింతపండు, ఎండుమిర్చి, మునగాకు, పసుపు, ఉప్పు, బెల్లం కలిపి గ్రైండ్ చేయాలి. తరవాత అందులోనే మళ్లీ ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసి మళ్లీ ఓ సారి గ్రైండ్ చేసి తీయాలి.

పుదీనా

కావలసినవి : పుదీనా ఆకులు: ఒకటిన్నర కప్పులు, ఎండుమిర్చి:పన్నెండు, ధనియాలు:ముప్పావు కప్పు, మినపప్పు:పావు కప్పు, చింతపండు:ఉసిరి కాయంత, ఉప్పు:తగినంత, నూనె: నాలుగు టీస్పూన్లు
తయారు చేసే విధానం : పుదీనా ఆకుల్ని కడిగి బాగా ఆరనివ్వాలి. బాణలిలో నూనె వేసి కాగగానే ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, చింతపండు వేసి వేయించి తీయాలి. తరవాత పుదీనా ఆకులు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీలో ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, చింతపండు వేసి మెత్తగా పొడి చేయాలి. తరవాత పుదీనా ఆకు, ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

కరివేపాకు
కావలసినవి: కరివేపాకు: పది కప్పులు, ఎండుమిర్చి:15, మినపప్పు: 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు:50 గ్రా॥, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు:20 (పొట్టు తీయకూడదు), ఉప్పు: తగినంత, చింతపండు: నిమ్మకాయంత, నూనె:ఆరు టీస్పూన్లు
తయారు చేసే విధానం: ముందుగా కరివేపాకు కడిగి నీడలోనే తడిలేకుండా ఆరనివ్వాలి. తరవాత బాణలిలో మూడు టీస్పూన్ల నూనె వేసి కాగాక కరివేపాకు వేసి ఆకు గలగలలాడే వరకూ వేయించి తీయాలి. మళ్లీ బాణలిలో మిగిలిన నూనె వేసి బాగా కాగాక ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు వేసి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా వేసి అవి చిటపటమన్నాక దించి చల్లారాక అన్నీ మిక్సీలో వేసి తిప్పాలి. తరవాత చింతపండు, వేయించిన కరివేపాకు వేసి తిప్పాలి. ఇప్పుడు పొడిని వెడల్పాటి పళ్లెంలో వేసి చేత్తో బాగా కలుపుకుని ఆరాక సీసాలో పోసుకోవాలి.

కొత్తిమీర
కావలసినవి: కొత్తిమీర తురుము: నాలుగు కప్పులు, పచ్చి సెనగపప్పు: 2టేబుల్ స్పూన్లు, మినపప్పు:4టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి: పది, వెల్లుల్లి పాయలు: నాలుగు, చింతపండు:కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె:2 టీస్పూన్లు,
తయారు చేసే విధానం: కొత్తిమీరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఆరనివ్వాలి. తరువాత బాణలిలో వేసి వేయించి తీయాలి. ఇప్పుడు పప్పులూ, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించి తీయాలి. చల్లారాక వీటన్నింటికీ చింతపండు, ఉప్పు చేర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

గోంగూర
కావలసినవి: గోంగూర ఆకులు:4కప్పులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు:పావుకప్పు చొప్పున, వెల్లులి: నాలుగు, ఎండుమిర్చి: 12 మినపప్పు:అరకప్పు, ఉప్పు:రుచికి సరిపడా, సెనగపప్పు: అరకప్పు, మెంతులు:టీస్పూను, నూనె:2 టీస్పూన్లు.
తయారు చేసే విధానం: బాణలిలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి వేయించి తీయాలి. తరువాత అందులోనే శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసి వేయించి తీయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి గోంగూర ఆకులు వేసి సిమ్‌లో వేయించాలి. తరువాత మిక్సీలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి ఓసారి తిప్పాలి. ఆ తరువాత శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఉప్పు, ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాక తిప్పాలి. చివరగా వేయించిన గోంగూర ఆకులు వేసి ఓసారి తిప్పి తీస్తే సరి.

Variety Green Leaves Recipes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆకు కారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: