వరవరరావుకు కరోనా పాజిటివ్..

Varavara Rao tests positive for Corona

మనతెలంగాణ/హైదరాబాద్:ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి ముంబైలోని జెజె ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఎ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన విడుదలను కోరుతూ మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సైతం వామపక్ష పార్టీలు లేఖలు రాశాయి. కనీసం ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Varavara Rao tests positive for Corona

 

The post వరవరరావుకు కరోనా పాజిటివ్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.