పొంచి ఉన్న పెను విపత్తు!

      కరోనా సమూలంగా కడతేరుతుందా, లేదా.. దాన్ని పూర్తిగా నయం చేసే మందు అందివస్తుందా, రాదా అనే చర్చను పక్కనపెడితే దాని కారణంగా విరుచుకుపడిన కనీవినీ ఎరుగని ఆర్థిక ప్రతిష్టంభన వల్ల ప్రపంచ ప్రగతికి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందనే విషయం సష్టపడుతున్నది. వచ్చే రెండేళ్లలో విశ్వ వ్యాప్తంగా 8.5 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉత్పత్తి నష్టం వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించిన అంచనా ఆందోళన గొల్పుతున్నది. ఇందువల్ల 3 కోట్ల 40 […] The post పొంచి ఉన్న పెను విపత్తు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

      కరోనా సమూలంగా కడతేరుతుందా, లేదా.. దాన్ని పూర్తిగా నయం చేసే మందు అందివస్తుందా, రాదా అనే చర్చను పక్కనపెడితే దాని కారణంగా విరుచుకుపడిన కనీవినీ ఎరుగని ఆర్థిక ప్రతిష్టంభన వల్ల ప్రపంచ ప్రగతికి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందనే విషయం సష్టపడుతున్నది. వచ్చే రెండేళ్లలో విశ్వ వ్యాప్తంగా 8.5 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉత్పత్తి నష్టం వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించిన అంచనా ఆందోళన గొల్పుతున్నది. ఇందువల్ల 3 కోట్ల 40 లక్షల మంది నిరుపేదరికంలోకి జారుకుంటారని సమితి హెచ్చరించింది. 1929లో అమెరికాలో ప్రారంభమై అనేక సంవత్సరాల పాటు ప్రపంచాన్ని పీడించిన దానికి మించిన ఆర్థిక మాంద్యం కోరల్లోకి జారుకోకతప్పదని అభిప్రాయపడింది. పెట్టుబడిదారీ ఆర్థిక విధాన ప్రక్రియలో మేధస్సును, శ్రమను, సాంకేతిక విజయాలను వినియోగించి విశేష సంపద సృష్టికి అధిక లాభార్జనకు పాటుపడుతూనే సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచడానికి పేరుకుపోయిన దారిద్య్రాన్ని తగ్గించడానికి నిరంతర కృషి జరుగుతున్నది. దీని వల్ల తరతమ తేడాలతో అన్ని దేశాల్లోనూ పేదరికం తగ్గుముఖం పడుతుంది.

సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపడుతున్నాయి. మొత్తం ఆర్థిక చక్రాన్ని నెలల తరబడిగా స్తంభింప జేసే ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు ఉత్పత్తులు నిలిచిపోయి, ఉపాధులు కోల్పోయి సాధారణ ప్రజానీకం కొనుగోలు శక్తి దారుణంగా సన్నగిల్లిపోయి ఆ మేరకు వారు అన్నానికి, వస్త్రానికి, వసతికి దూరమైపోయి కఠిక దారిద్య్రంలోకి కూరుకుపోతారు. పేదరికాన్ని తొలగించడానికి అంతవరకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వచ్చిన కృషి నిరర్థకమైపోతుంది. దారిద్య్రరేఖ దాటి పైకి వచ్చిన వారు తిరిగి దాని కిందికి జారిపోతారు. 2020లో ప్రపంచ ఆర్థిక రంగం 3.2 శాతం మేరకు కుంగిపోతుందని అంతర్జాతీయ వాణిజ్యం 15 శాతం పతనమవుతుందని దీని వల్ల కలిగే 8.5 ట్రిలియన్ డాలర్ల నష్టం గత నాలుగేళ్లుగా సాధించుకున్న ప్రగతిని కరి మింగిన వెలగ పండుగా డొల్లబారుస్తుందని ప్రపంచ ఆర్థిక స్థితిపై విడుదలైన అర్ధ సంవత్సర నివేదిక వివరించింది. కరోనా వైరస్ చాలా సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను స్తంభింపచేసింది.

పేద దేశాలలో దాని విజృంభణ పరిమితంగానే ఉంది. కాని అభివృద్ధి చెందిన దేశాలతో గల అనుబంధం వల్ల అవి కూడా భారీగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. సరకుల ఎగుమతి, దిగుమతులు, టూరిజం రంగాలు లాక్‌డౌన్ వల్ల అసాధారణంగా డీలాపడిపోయాయి. రవాణా, తయారీ రంగాలు పతనమైపోయాయి. ఇందువల్ల కొద్ది వారాల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు అదృశ్యమయ్యాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో 2030 నాటికి అదనంగా 16 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోతారని సమితి చెబుతున్నది. లాక్‌డౌన్‌ను నెమ్మది నెమ్మదిగా సడలించి ఆర్థిక కార్యకలాపాలకు మళ్లీ పూర్తి స్థాయిలో తలుపులు తెరిచినా పూర్వం మాదిరిగా అవి పుంజుకోడానికి మరి కొంత సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ పనుల్లేని దుర్దశ వల్ల కనీసం 3 కోట్ల 40 లక్షల మంది 1.90 డాలర్ల లోపు రోజువారీ ఆదాయ స్థాయి (అంతర్జాతీయ దారిద్య్ర రేఖ) కిందికి దిగజారిపోతారని సమితి అంచనాను కాదనలేము. ఇప్పటికే పేదరికం కోరల్లో విలవిలలాడుతున్న ఆఫ్రికా దేశాలు ఈ లాక్‌డౌన్ వల్ల అధికంగా నష్టపోతాయని భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌ను సడలించిన చోట్ల తెరుచుకున్న దుకాణాల్లో కొనేవారు అంతగా కనిపించడం లేదు. ఆదాయాలు లేక చేతిలో చిల్లి గవ్వ కూడా కరువైనందువల్ల ప్రజల కొనుగోలు శక్తి అడుగంటిపోయింది. ఒకవైపు ప్రాణ భయం, మరోవైపు ఆకలి చావుల వెరపు పులి, సింహం మాదిరి ఈ రెండు అతిపెద్ద విపత్తుల మధ్య అడకత్తెరలో పోకలా ప్రపంచం చిక్కుకున్నది. ఈ సంకట స్థితి పని వయసులోని జనం అత్యధికంగా ఉన్న భారత దేశాన్ని మరింతగా పట్టి పల్లారుస్తున్నది. దేశంలో అదనంగా 10 కోట్ల 40 లక్షల మంది రోజుకి 3.2 డాలర్ల ఆదాయ పరిమితి వర్తించే ప్రపంచ బ్యాంకు నిర్దేశిత దారిద్య్ర రేఖకు చేరుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. రోజుకి 1.9 డాలర్ల లోపు రాబడి గణనపరమైన దారిద్య్ర రేఖ కిందికి దాదాపు 7 కోట్ల మంది చేరుకుంటారని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చెప్పనలవికాని నిరుద్యోగంలో, దారిద్య్రంలో కూరుకుపోయిన అసంఖ్యాక సాధారణ జనం మరింతగా దరిద్రులైపోయి ఆకలి చావులకు గురైపోతే అది మానవ సమాజానికే మాయని మచ్చ అవుతుంది. ప్రపంచాన్ని అభ్యుదయ పథంలో నడిపించే సమర్థమైన నాయకత్వం కరువు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. నూతన ఆర్థిక సంస్కరణలు మన దేశంలోనూ ఇంకా పలు చోట్లా సంక్షేమ కవచాన్ని దారుణంగా బలి తీసుకున్నాయి. తాజా ఆపత్సమయంలో దానిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించవలసి ఉన్నది.

UN reveals worldwide loss of $ 8.5 trillion in 2 years

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పొంచి ఉన్న పెను విపత్తు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: