ఆకస్మిక లాక్‌డౌన్ పెద్ద తప్పిదం

Uddhav Thackeray said Sudden lockdown is a big mistake

 

కేంద్రంపై మహారాష్ట్ర సిఎం థాకరే గరం
తీవ్రత తగ్గితేనే ఆంక్షల సడలింపులు
విమానాల రాకపోకలకు నో
వైరస్ కట్టడి తరువాతనే ప్యాకేజీ
ఢిల్లీ సాయం లేదు.. బకాయిలు పెండింగ్

 

ముంబై : దేశంలో ఉన్నట్లుండి లాక్‌డౌన్ విధింపు చాలా పెద్ద తప్పిదం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విమర్శించారు. కరోనా వైరస్ కారణంతో ఆకస్మికంగా లాక్‌డౌన్‌ను విధించడం , ఇదే విధంగా లాక్‌డౌన్‌ను ఉన్నట్లుండి ఎత్తివేయడం కూడా తగదని అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ టీవీ ద్వారా ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెలాఖరుకే లాక్‌డౌన్ ఎత్తివేయడాన్ని తాము అనుమతించేది లేదన్నారు. దేశీయ విమాన యానానికి అనుమతి గురించి కూడా థాకరే మాట్లాడారు. ఇప్పుడు విమానాల రాకపోకలు ఆరంభం అయితే, ఇది అనేక చిక్కులకు దారితీస్తుందన్నారు. ఈ దశలో దేశీయ విమానాలకు తమ అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం దేశవ్యాప్త లెక్కలతో పోలిస్తే మహారాష్ట్రలోనే అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ రోగులు ఉన్నారని సిఎం తెలిపారు.

దేశవ్యాప్తంగా 1,31,868 కేసులు ఉండగా, తమ రాష్ట్రంలోనే 47,190 కేసులు నమోదు అయ్యాయని, దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను గుర్తించవచ్చునని థాకరే తెలిపారు. విమాన రాకపోకల అంశంపై తాను కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో మాట్లాడినట్లు తెలిపారు. వైమానిక ప్రయాణాల అవసరం ఉందని తమకూ తెలుసునని, అయితే తమకు ఈ విషయంలో కొంత సమయం కావాలని తాను కేంద్రానికి చెప్పినట్లు థాకరే వివరించారు. ఇప్పటికైతే రాష్ట్రం ప్రత్యేక విమానాలను అన్ని జాగ్రత్త చర్యల మధ్య అనుమతిస్తోందని, విదేశాలలో చిక్కుపడ్డ ప్రజలను, విద్యార్థులను తీసుకురావడం, వైద్య అత్యవసర చికిత్సలకు వచ్చే వారిని వెళ్లే వారికోసం విమాన ప్రయాణాలను అనుమతిస్తామని తెలిపారు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకమైనవని , ఈ రోజుల్లో అత్యధిక సంఖ్యలో జనం రాకపోకలు జరుగుతాయని , ఈ దశలో మరిన్ని కేసులు వస్తాయని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఉన్నట్లుండి ఎత్తివేయడం తమకు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. వర్షాకాలం రానున్నందున వైరస్ విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం అన్నారు. ప్రజలను పదేపదే ఇబ్బందులకు గురి చేయరాదని, లాక్‌డౌన్ విధింపులో చేసిన తప్పిదంతో ఇంకా కోలుకోకముందే ఎత్తివేతతో దీనిని రెండింతలు చేయడం అనుచితం అవుతుందన్నారు. కేంద్రంపై ఆయన విమర్శనాస్త్రాలకు దిగారు. కేంద్రం నుంచి జిఎస్‌టి బకాయిల గురించి ఇప్పటికైతే తమ ప్రభుత్వానికి ఎటువంటి వర్తమానం అందలేదన్నారు. ఇక వలస కూలీల తరలింపు బాధ్యతను కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకే వదిలిపెట్టినట్లుగా ఉందని మండిపడ్డారు. వలసకూలీల ప్రయాణాలకు టికెట్ల ఖర్చులో కేంద్రం వాటా ఇంతవరకూ రాష్ట్రానికి అందలేదని థాకరే తెలిపారు.

కరోనా రోగులకు చికిత్సల విషయంలో కేంద్రం స్పందన అంతంతగానే ఉందని, ఇప్పటికీ తమకు కొన్ని ముఖ్యమైన మందుల కొరత ఉందని, ఇంతకు ముందు తాము పిపిఇ కిట్స్, ఇతర వైద్య పరీక్షల పరికరాల ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తివేయాలనేది ఇప్పుడే చెప్పలేమని, ఎత్తివేసినా ఇది దశలవారిగానే ఉంటుందని థాకరే తెలిపారు. దీనిని బట్టే విమానాల రాకపోకలకు వీలుంటుందని తెలిపారు. క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ముందుగా వైరస్‌ను కట్టడి చేయడం తమ ముందున్న కర్తవ్యం అని, ప్యాకేజీల విషయం తరువాత అని తెలిపారు. వైరస్ వ్యాప్తి దశలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ ప్యాకేజీలకు ముందుకు రావడం లేదని మాజీ సిఎం, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన విమర్శలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు.

రెడ్‌జోన్లలో విమానాశ్రయాల ఓపెన్ అనుచితం

సోమవారం నుంచి విమానాల రాకపోకలపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తీవ్రంగా స్పందించారు. కరోనా తీవ్రతతో ఉన్న రెడ్‌జోన్లలో విమానాశ్రయాలను తిరిగి తెరవడం, ప్రయాణికుల రాకపోకలను అనుమతించడంతో పరిస్థితి దిగజారుతుందని అన్నారు. విమానాల రాకపోకల సలహా సముచితం కాదని అన్నారు. ఈ నెల 25వ తేదీ (సోమవారం) నుంచి విమానాలను నిర్వహిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించిన అంశంపై హోం మంత్రి స్పందించారు. గ్రీన్‌జోన్లలోని ప్యాసింజర్లను రెడ్ జోన్లలోని విమానాశ్రయాలకు తీసుకురావడం, వచ్చిన వారిని ఇళ్లకు చేర్చడం ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెడుతుందన్నారు. మహారాష్ట్రలో ముంబైలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆకస్మిక లాక్‌డౌన్ పెద్ద తప్పిదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.