ఉద్ధవ్‌కే మహా పీఠం

  ఎన్‌సిపి, కాంగ్రెస్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు, మూడు పార్టీల కీలక భేటీ తర్వాత ప్రకటించిన పవార్ న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ స్థాపనపై ఎన్‌సిపి నేత శరద్ పవార్ శుక్రవారం నాడు కీలక ప్రకటన వెలువరించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అవుతారని, ఆయన సారథ్యంలో ప్రభు త్వం ఏర్పాటు అవుతుందని పవార్ చెప్పా రు. ఈ మేరకు శివసేన కాంగ్రెస్ ఎన్‌సిపి కూటమిలో ఏకాభిప్రాయం కుదిరిందని వివరించారు. శుక్రవారం ముంబై లో, దేశ […] The post ఉద్ధవ్‌కే మహా పీఠం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్‌సిపి, కాంగ్రెస్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు, మూడు పార్టీల కీలక భేటీ తర్వాత ప్రకటించిన పవార్

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ స్థాపనపై ఎన్‌సిపి నేత శరద్ పవార్ శుక్రవారం నాడు కీలక ప్రకటన వెలువరించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అవుతారని, ఆయన సారథ్యంలో ప్రభు త్వం ఏర్పాటు అవుతుందని పవార్ చెప్పా రు. ఈ మేరకు శివసేన కాంగ్రెస్ ఎన్‌సిపి కూటమిలో ఏకాభిప్రాయం కుదిరిందని వివరించారు. శుక్రవారం ముంబై లో, దేశ రాజధాని ఢిల్లీలో మూడు పార్టీల నేతల మధ్య పూర్తిస్థాయి చర్చలు జోరుగా సాగాయి. కాంగ్రెస్ , ఎన్‌సిపి నేతలు ముందుగా మంతనాలకు దిగారు. కాంగ్రెస్, ఎన్‌సిపి నేతలు ఇతర మిత్రపక్షాలతో కూడా మాట్లాడారు. ఆ తరువాతి క్రమంలో శివసేన వారితో కాంగ్రెస్, ఎన్‌సిపిల నేతలు చర్చించినట్లు, ప్రధానంగా ప్రభుత్వ స్థాపన విషయం ప్రస్తావనకు వచ్చినట్లు, ఈ మూడు పార్టీల మధ్య అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పవార్ విలేకరులకు తెలిపారు.

మొత్తం మీద ప్రభుత్వానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఉద్ధవ్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించడంపై అంగీకారం కుదిరిందని, ఇక ప్రభుత్వ స్థాపన వేగవంతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వోర్లీలోని నెహ్రూ సెంటర్‌లో సమావేశాల తరువాత అక్కడున్న విలేకరులు తాజా పరిస్థితి గురించి పవార్‌ను ప్రశ్నించారు. పలు ఇతర విషయాలు కూడా ఉన్నాయని, వీటిపై చర్చలు పురోగతిలో ఉన్నాయని పవార్ వివరించారు. అయితే ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇప్పుడు పెండింగ్‌లో లేదని స్పష్టం చేశారు.

దీనిపై మారు ప్రశ్నలకు తావేలేదన్నారు. చర్చలలో పాల్గొన్న తరువాత బయటకు వచ్చిన ఉద్ధవ్ కూడా విలేకరులతో కొద్ది సేపు మాట్లాడారు. చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. అయితే చర్చల ప్రక్రియ తరువాత తిరిగి తామంతా కలిసి మీడియా ముందుకు వస్తామని వెల్లడించారు. గత నెల 31వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకూ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాజకీయ మిత్రత్వాలు బెడిసికొట్టి, కొత్త రాజకీయ వియ్యాలు కుదిరి ఇప్పుడు శివసేన వారు కాంగ్రెస్, ఎన్‌సిపిలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశలో సిద్ధపడ్డారు.

పార్టీ ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ భేటీ
రాష్ట్రంలో ప్రభుత్వ స్థాపన యత్నాల గురించి శివసేన నేత ఉద్ధవ్ థాకరే తమ పార్టీ ఎమ్మెల్యేలకు వివరించారు. శుక్రవారం ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కొద్ది సేపు భేటీ అయ్యారు. శివసేన నాయకత్వపు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు తుది దశలలో ఉందని, త్వరలోనే సేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వారికి తెలిపారు. ఎమ్మెల్యేలంతా ముంబైలోనే ఒకేచోట ఉండాలని, వారు తాము పిలవగానే వచ్చేలా అందుబాటులో ఉంటే మంచిదని సూచించారు. తమకు దూరమైన బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలంటే ఇతర పార్టీల మద్దతుతో సాధ్యమైనంత త్వరగా ఉద్ధవ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రతిపాదనల దశ దాటింది : రౌత్
ఇక బిజెపితో పొత్తు సమస్యనే లేదని, వారి నుంచి తమకు ఇంద్రపీఠం అందినా తిరస్కరిస్తామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చెప్పారు. తమ పార్టీకే సిఎం పదవి దక్కుతుందని, ప్రతిపాదనల దశ అయిపోయిందని, ఇక కార్యాచరణ స్థాయికి చేరామని న్యూఢిల్లీలో తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్‌ను సిఎం పదవిలో చూడాలనుకుంటున్నారని, ఇప్పుడు తామంతా ఇదే దిశలో సాగుతున్నామని విలేకరులకు చెప్పారు.

ఆర్‌పిఐ, పీజెంట్ వర్కర్స్ పార్టీ ఇతరులతో భేటీ
ప్రభుత్వ స్థాపన దిశలో భాగంగా పవార్ సూచనలతో ఎన్‌సిపి, కాంగ్రెస్ నేతలు పలు కసరత్తులు చేపట్టారు.ఎన్నికలకు ముందు సర్దుబాట్లు చేసుకున్న సమాజ్‌వాది పార్టీ, ఆర్‌పిఐ (కవాడే వర్గం), ఆర్‌పిఐ (ఖారత్ వర్గం), రాజుశెట్టి నాయకత్వపు స్వాభిమాన్ పక్ష, పిడబ్యుపి, సిపిఎం, జనతాదళ్ ఇతరులతో కూడా చర్చలు జరిపారు. బిజెపిని దూరంగా పెట్టి, వారికి అధికారం అందకుండా చేసేందుకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ స్థాపన ప్రతిపాదనకు ఈ పార్టీలు మద్దతు ప్రకటించినట్లు ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షులు జయంత్ పాటిల్ విలేకరులకు తెలిపారు.

మాజీ సిఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ప్రభుత్వం సవ్యంగా సాగేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపి)రూపొందించినట్లు తెలిపారు. దీనికి అగ్రనాయకత్వం ఆమోదం రావాల్సి ఉందని చెప్పారు. అయితే తమ మద్దతు కావాలనుకుంటే శివసేన వారు వారి పద్ధతులను మార్చుకోవల్సి ఉంటుందని ఎస్‌పి నేత అబూ ఆజ్మీ చెప్పా రు. మతతత్వం వీడాలని, దేశంలో మతోన్మాదం ప్రబలకుండా చేయడంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. వారికి మద్దతు కావాలనుకుంటే పాత పద్ధతులపై రాజీకి రావాల్సిందే అన్నారు. దళితులు, మైనార్టీలు, రైతాంగం, బలహీనవర్గాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఉండాలన్నారు.

స్పీకర్‌గా మాజీ సిఎం చవాన్?
శివసేన ప్రభుత్వం ఏర్పాటు దిశలో కాంగ్రెస్ అగ్రనేతలను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన పృథ్వీరాజ్ చవాన్ తదుపరి స్పీకర్ కానున్నారు. ఈ మేరకు శుక్రవారం సంకేతాలు వెలువడ్డాయి. పవార్ ప్రతిపాదించిన శివసేన సారథ్యపు సర్కారును తొలుత సోనియా గాంధీ వ్యతిరేకించారు. అయితే బిజెపికి సరైన చెక్ పెట్టేందుకు శివసేనతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని చవాన్ సోనియాకు ఇతర కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు, దీనిపై వారు అంగీకరించినట్లు వెల్లడైంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గీటురాయి అయ్యే సిఎంపిని కూడా మాజీ సిఎం దగ్గరుండి తయారు చేస్తున్నారు. తదుపరి స్పీకర్‌గా ఆయనను నియమిస్తారని రాజకీయవర్గాలు తెలిపాయి.

Uddhav Thackeray is the Chief Minister of Maharashtra

The post ఉద్ధవ్‌కే మహా పీఠం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: