30 రోజులకు చేరిన ఆర్టీసి సమ్మె

TSRTC

ఖమ్మం ఆర్టీసి రీజియన్‌కు రూ.75 కోట్ల నష్టం
సమ్మెలో కొనసాగుతున్న 2836 మంది కార్మికులు
ప్రత్యామ్నయంగా 95 శాతం నడుస్తున్న బస్సులు
దసరా, దీపావళి సీజన్‌లో ప్రజలకు ఇబ్బంది లేకుండా తిరిగిన బస్సులు

ఆర్టీసి కార్మికుల నిరవధిక సమ్మె నేటితో 30 రోజులకు చేరింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 4వ తేదీ అర్దరాత్రి నుంచి ఆర్టీసి జెఎసి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు ఆర్టీసి బస్ డిపో పరిధిలోని 2836 మంది కార్మికులు ఈ సమ్మెలో నిరవధికంగా పాల్గొంటున్నారు. వీరిలో 1046 మంది కండక్టర్లు, 1028 మంది డ్రైవర్లు,162 మంది మెకానిక్‌లు, 374 మంది సూపర్‌వైజర్లు, మరో 48 మంది ఆర్‌ఎం ఆఫీస్, ఆర్టీసి ఆసుపత్రి సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే సమ్మెకు దూరంగా ఉన్నారు. వారిలో ఇద్దరు అక్టోబర్ 31న పదవీ విరమణ చేశారు.

ఖమ్మం: జిల్లాలోని ఆర్టీసి రిజియన్ పరిధిలో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల నుంచి ప్రతి రోజు 630 బస్సులు వివిధ మార్గలో 3 లక్షల కిలో మీటర్ల పరిధిలో తిరేగేవి. అయితే సమ్మె ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నయంగా తాత్కాలిక కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు.తొలుత 75 శాతం నుంచి 80శాతం వరకు నడిపించిన బస్సులు దీపావళి పండగ నుంచి 95 శాతానికి పైగా అన్ని రూట్లలో బస్సులను నడిపిస్తున్నారు. దసరా, దీపావళీ పండగల సందర్భంగా ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నయ  ఏర్పాట్లతో బస్సులను అన్ని రూట్లలో నడిపించారు. తాజాగా ఏసి బస్సులను కూడా అన్ని రూట్లలో తిప్పుతున్నారు. తొలుత తాత్కాలిక సిబ్బందితో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికి ఆ తరువాత పరిస్థితి గాడిన పడింది. టిమ్ మిషన్ల ద్వారా ప్రయాణికులకు టికెట్లను చెల్లించడం జరుగుతుంది. అంతేగాక ఉమ్మడి జిల్లాలో కూడా పెద్దగా ప్రమాధ సంఘటనలు చోటు చేసుకున్నదాఖలాలు కూడా లేవు.

పోలీసుల ఎస్కార్ట్ సహాయంతో విజయవంతంగా బస్సులను నడిపిస్తున్నారు. సమ్మెకు ముందు ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల ద్వారా ప్రతి రోజు ఆర్టీసికి రూ.60 లక్షల నుంచి రూ.65లక్షల ఆదాయం వచ్చేది.సమ్మె ప్రారంభం అయిన తొలిరోజుల్లో రోజుకు రూ.11లక్షల నుంచి రూ.14లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా మంది కండక్టర్లు చేతివాటంకు పాల్పడటం, ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో భారీగా దుర్వినియోగమైంది. ఆ తరువాత టిమ్ మిషన్లు, టికెట్లను పంపిణీ చేయడంతో ఆదాయం గాడిన పడింది గత కొన్ని రోజుల నుంచి రోజుకు రూ.40లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఆదాయం వస్తుంది. 95 శాతం వరకు బస్సులను నడిపిస్తున్నారు. 80శాతం రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. కేవలం 20 శాతం రూట్లలో బెంగుళూరు ఇతర ప్రదేశాలకు మాత్రమే నడపడం లేదు. అయితే సమ్మె కాలంలో మాత్రం జిల్లా ఆర్టీసి మాత్రం రోజుకు రూ.20 లక్షల నుంచిరూ.25 లక్షల వరకు ఆదాయాన్ని కొల్పోయింది.

నెల రోజుల్లో దాదాపు రూ.75 కోట్ల ఆధాయాన్ని నష్టపోయింది. దసరా, దీపావళి పండగల సమయంలో వచ్చే అదనపు ఆదాయాన్ని కూడా భారీగా కొల్పోయింది. ఇంకోవైపు ఆర్టీసి జెఎసి, అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె నిరవధికంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజు ఆరు డిపోల పరిధిలో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మెతో కలతచెందిన ఇద్దరు ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. ఇద్దరు కార్మికుల ఆత్మహత్యకు నిరసనగాజిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఒకానొక సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. గత నెల 19న తెలంగాణ రాష్ట్ర బంద్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా బంద్ కూడా ప్రశాంతంగా జరిగింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, న్యూడెమోక్రసి, టిజెఎస్, పార్టీల ముఖ్యనేతలు జిల్లాలో పర్యటించారు. ఆర్టీసి కార్మికులకు అండగా నిలిచారు. ప్రతి రోజు ఎదో కార్యక్రమాన్ని చేపట్టారు. గత నెల 30న హైద్రాబాద్‌లో జరిగిన సకలజనభేరి సభకు భారీగా తరలివెళ్ళారు.

శనివారం కూడా జిల్లాలోని అన్ని బస్ డిపోల ముందు ఆందోళనలు కొనసాగాయి. కొత్తగూడెం బస్‌డిపో ముందు వంటా వార్పు కార్యక్రమం కొనసాగింది. ఖమ్మం, కొత్తగూడెం బస్ డిపో ముందు జరిగిన ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా గత ఆరు రోజుల పాటు హైదరాబాద్‌లో ఆమరణదీక్ష చేసిన కూనంనేని సాంబశివరావుకు ఖమ్మం రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. రాత్రి కొత్తగూడెం పట్టణంలో కూడా కూనంనేని సాంబశివరావుకు ఘన స్వాగతం లభించింది. మార్కెట్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

TSRTC strike Reaches to 30 days

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 30 రోజులకు చేరిన ఆర్టీసి సమ్మె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.