ఆర్‌టిసి చరిత్రలో రికార్డు బ్రేక్

TSRTC

 

40 రోజులుగా కొనసాగుతోన్న సమ్మె
ఇప్పటికి కోల్పోయిన ఆదాయం రూ.400 కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 40వ రోజుకు చేరింది. సంస్థ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా ఈ సమ్మె నిలిచింది. డిమాండ్లపై కార్మిక జెఎసి పట్టువీడకపోవడం, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో సమ్మె పీఠముడి వీడడం లేదు. ఇటీవల సమ్మె విరమణకు, కార్మికుల్లోనూ విధుల్లో చేర్చుకునేందుకు సిఎం కెసిఆర్ అవకాశం ఇచ్చినప్పటికీ కార్మికులు పెద్దగా స్పందించలేదు. దీంతో సమ్మెకు ముగింపే కనిపించడం లేదు. సమ్మె వ్యవహారంపై ఇరువర్గాలు పట్టు వీడాలని, రాజీకి కుదుర్చుకోవాలన్న హైకోర్టు సూచనలు కూడా ఫలించలేదు. ఇప్పటికీ సమ్మె పరిష్కారం అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులు 24 రోజుల వరకు సమ్మె చేశారు.

ఆర్‌టిసి చరిత్రలో అప్పటికి అదే సుదీర్ఘమైన సమ్మె. 2005లోనూ జీతాలు పెంచాలంటూ జూలైలో 3 రోజులు, అక్టోబర్‌లో 2 రోజులు కార్మికులు సమ్మెకు దిగారు. 2011లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న దశలో సకల జనుల సమ్మెలో ఆర్‌టిసి కార్మికులు 27 రోజుల పాటు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2015లో కార్మికులు వేతనాల పెంపు కోసం 8 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుత సమ్మె పాత రికార్డులను దాటి 40 రోజులకు చేరింది. ఈ సమ్మెతో ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్‌టిసి కోల్పోయింది. సాధారణంగా సంస్థకు రోజూ రూ.11 కోట్ల మేర టికెట్లపై ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుస్తున్న సర్వీసుల ఆదాయంతో పోలిస్తే ఖర్చు అధికంగా అవుతుంది. ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టు దఫదఫాలుగా విచారిస్తున్నది. ఆర్‌టిసి యూనియన్, ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నది. సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని సూచించింది. ఇందుకు ప్రభుత్వం సమ్మతించలేదు.

దీంతో సమ్మె సమస్య కోర్టు నుంచి లేబర్ కమిషన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నది. దీంతో ప్రస్తుతం కోర్టులో కొనసాగుతున్న సమ్మె వాదనలు మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 రోజులుగా సమ్మె కొనసాగుతూ హైకోర్టులో విచారణ జరుగుతుంది.అక్కడ నుంచి లేబర్ కమిషనర్‌కు బదిలీ చేస్తే పలు అంశాలు మరోసారి చర్చకు రానున్నాయి. దీంతో ఆర్‌టిసి సమ్మె సమస్య అంశంపై చర్చలు మొదటికి రానున్నాయి. లేబర్ కమిషనర్ విచారణ అనంతరం లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని మంగళవారం జరిగిన వాదనల్లో పిటీషనర్ తరపున న్యాయవాది వివరించారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో సమస్య తిరిగి మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఆర్‌టిసి కార్మికులు సమస్యకు పరిష్కారంగానీ ముగింపుగానీ దగ్గరలో కనిపించడం లేదు. అయితే, సమ్మెకు ముగింపు ఎప్పుడు పలుకుతుందానని కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నారు.

TSRTC Strike On 40th Day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్‌టిసి చరిత్రలో రికార్డు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.