గ్రూప్4 పరీక్షలో గందరగోళం

ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో పొరపాట్లు ఒకే నంబర్‌తో రెండు మూడు ప్రశ్నలు కొన్ని ప్రశ్నల నంబర్లు పునరావృతం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రూప్4 పరీక్ష గందరగోళం మధ్య ముగిసింది. ప్రశ్నపత్రం ముద్రణలో పొరపాట్లు, అచ్చుతప్పులతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేపర్-1 ఎ కోడ్ ప్రశ్నపత్రంలో ఈ తరహా సమస్యలు అధికంగా ఉత్పన్నమయ్యాయి. ఒకే నెంబర్‌తో రెండు, మూడు ప్రశ్నలు ముద్రితం కావడం, ప్రశ్నల నెంబర్లు పునరావృతం కావడంతో సమాధానాలను ఎలా గుర్తించాలో తెలియక […]

ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో పొరపాట్లు
ఒకే నంబర్‌తో రెండు మూడు ప్రశ్నలు
కొన్ని ప్రశ్నల నంబర్లు పునరావృతం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రూప్4 పరీక్ష గందరగోళం మధ్య ముగిసింది. ప్రశ్నపత్రం ముద్రణలో పొరపాట్లు, అచ్చుతప్పులతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేపర్-1 ఎ కోడ్ ప్రశ్నపత్రంలో ఈ తరహా సమస్యలు అధికంగా ఉత్పన్నమయ్యాయి. ఒకే నెంబర్‌తో రెండు, మూడు ప్రశ్నలు ముద్రితం కావడం, ప్రశ్నల నెంబర్లు పునరావృతం కావడంతో సమాధానాలను ఎలా గుర్తించాలో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఆయా ప్రశ్నపత్రాలను వెనక్కు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సంబంధిత పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు ప్రశ్నపత్రం ముద్రణలో జరిగిన పొరపాట్లను టిఎస్‌పిఎస్‌సి దృష్టికి తీసుకువెళ్లడంతో కమిషన్ ఆయా ప్రశ్నపత్రాల స్థానంలో కొత్త వాటిని వెంటనే పంపిణీ చేసింది. దాంతో కొన్ని పరీక్షా కేంద్రాలలో ఎ సిరీస్ ప్రశ్నపత్రం పొందిన పలువురు అభ్యర్థులకు సరైన సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదు. కొన్ని చోట్ల మాత్రమే అదనపు సమయం కేటాయించినట్లు తెలిసింది. ప్రశ్నపత్రాలను పొరపాట్లు లేకుండా ఎందుకు ముద్రించలేకపోయారంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

65 శాతం హాజరు : టిఎస్‌పిఎస్‌సి

గ్రూప్4,జిహెచ్‌ఎంసిలో బిల్ కలెక్టర్, ఆర్‌టిసి, బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 65 శాతం హాజరు నమోదైనట్లు టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ తెలిపారు. మొత్తం 4,80,481 మంది అభ్యర్థులకు పేపర్1కు 3,12,397 మంది, పేపర్2కు 3,09,482 మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,046 కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్2 పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ పోస్టులకు మొత్తం 4,80,545 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 65 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు.

కొన్ని కేంద్రాలలో ఎ సీరీస్ ప్రశ్నపత్రం తప్పుగా ముద్రితమైనట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆయా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు తమ వద్ద అదనంగా ప్రశ్నపత్రాలను మార్చి సరైన ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందజేసినట్లు వివరించారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించామని అన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాయమని పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

TSPSC: Mistakes in Group-4 Exam

Telangana news

Related Stories: