రైతుకు రక్ష

రైతుబీమా ప్రీమియం రూ.1141.44 కోట్లు
ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3486.90
గత ఏడాది కంటే రూ.29 కంటే అధికం
32.73 లక్షల మంది అన్నదాతలకు బీమా కవరేజి
ఆగస్టు 14వ తేదీన రెన్యువల్… ఇది మూడో ఏడాది

Mana Telangana news,Telangana Online News,National news in telugu, latest National news in telugu

మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబీమా పథకం అమలునకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రైతులకు ప్రీమియం చెల్లించేందుకు రూ.1141.44 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 13వ తేదీ నాటికి గత ఏడాది ప్రీమియం గడువు ముగుస్తుంది. ఆగస్టు 14వ తేదీ నుంచి పథకం రెన్యువల్ కానుంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న పట్టాదారులకు రెన్యువల్ వర్తింపజేస్తారు. కొత్త రైతులకూ పథకంలో చోటు కల్పించడంతో పాటు అర్హత కోల్పోయిన రైతుల పేర్లను తొలగిస్తారు. ఇదిలా ఉండగా ఈసారి ఒక్కో రైతుకు బీమా ప్రీమియాన్ని రూ.3486.90గా నిర్ణయించారు. ఇందులో వాస్తవ ప్రీమియం రూ.2955 కాగా 18 శాతం జిఎస్‌టి రూ.531గా ఉంది. ఇక ఈసారి ప్రీమియం గతేడాది ప్రీమియం కంటే రూ.29 అధికం. గతేడాది ఒక్కొ రైతుకు రూ.3457.40 ప్రీమియం చొప్పున చెల్లించింది. ఇక గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1141.44 కోట్లు మొత్తం 32.73 లక్షల మంది పట్టాదారుల ప్రీమియం ఎల్‌ఐసికి చెల్లించేందుకు సరిపోతుంది.

దాదాపు 31 లక్షల మంది రెన్యువల్‌కు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి దురదృష్టవశాత్తు పెద్ద దిక్కును కోల్పోతున్న వ్యవసాయ కుటుంబాలకు రైతబంధు జీవిత బీమా పథకం వెలుగును నింపుతోంది. ఏ కారణంతోనైనా బీమా పరిధిలో ఉన్న రైతు మరణిస్తే 10 రోజుల వ్యవధిలో రూ.5 లక్షల చొప్పున ఎల్‌ఐసి చెల్లిస్తుంది. రాష్ట్రంలో వివిధ కారణాలతో కేవలం 22 నెలల వ్యవధిలో (665 రోజులు) 28,480 మంది రైతులు చనిపోయారు. అంటే సగటున రోజుకు 43 మంది రైతులు చనిపోతున్నారు. జూన్ 10వ తేదీ వరకు 28,480 అన్నదాతల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎల్‌ఐసి నుంచి రూ.1424 కోట్లు అందించింది. ఈ పథకం 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ప్రారంభించే ముందు సిఎం కెసిఆర్ తన జీవితంలో చేస్తున్న గొప్ప పనిగా అభివర్ణించారు. బిసి,ఎస్‌సి, ఎస్‌టి రైతు కుటుంబాలకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతోంది. కుటుంబం పెద్దను కోల్పోయిన సందర్భంలో పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకునేందుకు రైతుబీమా పరిహారం సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

గత రెండేళ్లు ఇలా
2018లో 31.27 లక్షల మంది రైతులు రైతుబీమాలోకి వచ్చారు. ఈ పథకాన్ని ఎల్‌ఐసితో కలిసి వ్యవసాయ శాఖ అమలు చేస్తుంది. ఒక్కో రైతుకు ఎల్‌ఐసికి రూ. 2271.50 (జిఎస్‌టి కలుపుకుని) చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.710.58 కోట్లు చెల్లించింది. 2019 ఆగస్టు 13వ తేదీ వరకు బీమా పరిధిలో ఉన్న 17,519 మంది రైతులు దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు(ఎఇఒ) ఎల్‌ఐసికి ఆన్‌లైన్‌లో సమర్పించగా రూ. 5 లక్షల చొప్పున రూ.875.95 కోట్లు పరిహారం చెల్లించింది. అంటే ప్రీమియంకు కట్టిన మొత్తం కంటే అధికంగా క్లెయిమ్స్ రూపంలో అందజేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. అదే సమయంలో 201920లో 32.16 లక్షల మంది అర్హులైన అన్నదాతలు రైతుబీమాలోకి వచ్చారు. ఒక్కొ రైతుకు రూ.3457.40 ప్రీమియం చొప్పున ప్రభుత్వం ఎల్‌ఐసికి తొలి విడతగా రూ.1065.37 కోట్లు చెల్లించింది. ఇందులో జూన్ 10వ తేదీ నాటికి 10961 రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.548 కోట్ల పరిహారాన్ని ఎల్‌ఐసి చెల్లించింది.

TS Govt to give Rs 1141 cr for farmers insurance premium

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రైతుకు రక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.