పాలమూరు ఇక పరుగు

  ఊపందుకోనున్న దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు పనుల్లో వేగం పెంచడంపై ప్రభుత్వ దృష్టి మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి ద శకు చేరడంతో ప్రభుత్వం ఇక దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై దృష్టి పెట్టనుంది. మరి రెండు వారాల్లో కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద వెట్న్ ప్రారంభించి, నీటిని మళ్లించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీంతో కాళేశ్వరంలో ప్రధానఘట్టం పూర్తవుతుంది. మిగిలిన పనులు కాస్త, అటూ, ఇటూగా పూర్తిచేసినా, నీళ్లు ఎత్తిపోయడం మొదలైతే ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లు, ప్రభుత్వం […] The post పాలమూరు ఇక పరుగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఊపందుకోనున్న దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు
పనుల్లో వేగం పెంచడంపై ప్రభుత్వ దృష్టి

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి ద శకు చేరడంతో ప్రభుత్వం ఇక దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై దృష్టి పెట్టనుంది. మరి రెండు వారాల్లో కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద వెట్న్ ప్రారంభించి, నీటిని మళ్లించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీంతో కాళేశ్వరంలో ప్రధానఘట్టం పూర్తవుతుంది. మిగిలిన పనులు కాస్త, అటూ, ఇటూగా పూర్తిచేసినా, నీళ్లు ఎత్తిపోయడం మొదలైతే ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం దక్షిణ తెలంగాణ వరదాయినిలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. భూసేకరణలో అవాంతరాలు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసుల కారణంగా పనులకు కొంత ఆటంకం కలిగినా, ఇప్పుడు ఆయా పనుల్లో వేగం పుంజుకొంది. కాళేశ్వరం తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యతలు పాలమూరు
రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలే. ఈ పథకాలు పూర్తిచేస్తే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగు నీటి కష్టాలు తీరతాయి. 16 లక్షల ఎకరాలకు సాగునీటి పరిధిలోకి తీసుకురావచ్చు. రాజధాని హైదరాబాద్ నగరానికి తాగునీటిని సైతం ఇక్కడి నుంచే తీసుకుపోవచ్చు. 2015 జూన్ 11న మహబూబ్‌నగర్ జిల్లా భూత్ఫూర్ మండలం కరివెన గ్రామం వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన జరిగింది. ఆ తరువాత రోజే జూన్ 12న నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని శివన్న గూడెం గ్రామం వద్ద డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితేనే దక్షిణ తెలంగాణ నీటి కష్టాలకు చెల్లుచీటి రాయవచ్చు.
కృష్ణా నదిపై శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటిని రోజుకు 2 టిఎంసిల చొప్పున 60 రోజుల పాటు వినియోగించుకునేలా రెండు పథకాలు డిజైన్ చేశారు. ఇందులో డిండికి అర టిఎంసి కేటాయించగా, పాలమూరు, రంగారెడ్డికి 1.5 టిఎంసి చొప్పున కేటాయించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఆయకట్టు 12.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, డిండి ఎత్తిపోతలలో 3.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. డిండికి రూ.6,190 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచారు. పనులు నడుస్తున్నాయి. అయితే దీనికి నీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలోని భాగంగా రెండో దశలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ నుంచి మళ్లిస్తారు. ఏదుల నుంచి ప్రస్తుత డిండి రిజర్వాయర్‌కు ఎగువన ఉల్పర వద్ద మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి డిజైన్ల పని నడుస్తుంది. అయితే తొలుత ఏదుల నుంచే ప్రతిపాదించినా మధ్యలో అది నార్లాపూర్‌కు మారింది. డిండి పథకం నుంచి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని మరో 5 మండలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. పాలమూరు రంగారెడ్డి పథకంలో తొలుత 10 లక్షల ఎకరాల ఆయకట్టే ఉండగా, దాన్ని 12 లక్షలకు పెంచారు. ఇందులో 5 లక్షల ఎకరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండగా, 7 లక్షల ఎకరాల వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. రూ.35,200 కోట్లతో ప్రాజెక్టును ప్రభుత్వం పెంచింది. తొలి దశలో 18 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి, పనులు నడుస్తుండగా, రెండో దశలో వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ పనులు, మెయిన్ కెనాల్ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. దీంతో పాటు రాచకొండ గుట్టల్లో హైదరాబాద్ మంచినీటి కోసం తలపెట్టిన ప్రత్యేక రిజర్వాయర్లకు కూడా పాలమూరు ఎత్తిపోతల నుంచే నీరందిస్తారు.
నాలుగేళ్లలో రూ.7300 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇప్పటికే రూ.7300 కోట్లు ఖర్చు చేసింది. 201819 ఆర్ధిక సంవత్సరం వరకు పాలమూరు ప్రాజెక్టుపై రూ.5774 కోట్లు, డిండి ప్రాజెక్టుపై రూ.1213 కోట్లు వెచ్చించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పాలమూరుపై రూ.238 కోట్లు, డిండి ప్రాజెక్టుపై రూ.75 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా పాలమూరుపై రూ.6,012 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ. 1,288 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీనికి తోడు పనుల్లో వేగం పెంచేందుకు కార్పోరేషన్ల ద్వారా రుణం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు ఎత్తిపోతలలోని పంపుహౌజ్‌ల పనుల కోసం రుణం ఇవ్వడానికి పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ సూత్రప్రాయం గా అంగీకరించింది. కాళేశ్వరం కార్పోరేషన్ నుంచే ఈ రుణాన్ని సర్ధుబాటు చేస్తున్నారు. 90 టిఎంసిల నీటిని శ్రీశైలం నుంచి లిఫ్టు చేసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌కు నీరు, పరిశ్రమలకు సరఫరా చేసే ఉద్దేశంతో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు పాలమూరు, డిండి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా నీటిని తెలంగాణ సమర్థంగా వినియోగించుకోవడంలో ఈ ప్రాజెక్టుల పాత్ర భవిష్యత్తులో కీలకంగా మారనుంది. దీంతో ఈ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

TS Govt special focus on Palamuru project

 

The post పాలమూరు ఇక పరుగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: