టిఆర్‌ఎస్‌కు వందేళ్లు నిలబడే సత్తా

TRS paid Rs 45 crore as premium towards workers

 

కార్యకర్తల సంక్షేమానికి సిఎం కెసిఆర్ అనేక పథకాలను ఆలోచిస్తున్నారు
ఏపార్టీకి లేని యంత్రాంగం టిఆర్‌ఎస్‌కు ఉంది
మూడేళ్లలో కార్యకర్తలకు రూ.45కోట్ల ప్రీమియం చెల్లించాం
త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభం
కాంగ్రెస్, బిజెపిల ముందు టి అక్షరం ఉందంటే అది టిఆర్‌ఎస్ పుణ్యమే
రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

హైదరాబాద్: శతాబ్దం పాటు చెక్కుచెదరని సంస్థాగత నిర్మాణంతో టిఆర్‌ఎస్ పార్టీ ఉందని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం కేవలం టిఆర్‌ఎస్‌కే ఉందని ఆయన అన్నారు. ఒక ఆశయం, లక్ష్యంతో ముందుకు వెళ్ళుతున్న టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తోందన్నారు. అయితే పార్టీ స్థాపించిన 20 ఏళ్లలో అనేక సమస్యలను అధిగమించి దేశంలోనే గొప్పరాజకీయ శక్తిగా ఆవిర్భవించిన చరిత్ర టిఆర్‌ఎస్ దే అన్నారు.

శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల బీమా సౌకర్యం కోసం రూ.16.11కోట్ల చెక్కును యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి కెటిఆర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి పార్టీల ముందు టి అక్షరం ఉందంటే అది టిఆర్‌ఎస్ తోనే సాధ్యమైందనే విషయం గమనించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్, బిజెపి సిఎం కెసిఆర్ పై జాగ్రతగా మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. ఈ రెండు పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాన్ని పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఆయన మందలించారు.

20 ఏళ్లలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ ఎన్నో ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని సాధించి దేశంలో సత్తా చాటిందని కెటిఆర్ చెప్పారు. జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం జరిగితే ఆనాటి ఆంధ్రపాలకులు అక్కడి నుంచి టిఆర్‌ఎస్‌ను గెంటివేయించారని విచారం వ్యక్తం చేశారు. అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్యాన్ని సాధించగలిగామని గుర్తు చేశారు. తెలంగాణ సాధించేంతవరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని ఆయన గుర్తు చేశారు. 13 ఏళ్లు ఎన్నో రాజకీయ కుట్రలను కూడా ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండనే ధైర్యం, పట్టుదలతో ఉద్యమానికి నాయకత్వం వహించి, రాష్ట్ర సాధన అనంతరం సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కెసిఆర్ కార్యకర్తలందరికీ ఆదర్శమన్నారు.

ఈ సందర్భంగా స్వీయ రాష్ట్ర అస్తిత్వమే మనకు రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను కెటిఆర్ గుర్తు చేశారు. అయితే కార్యకర్తల పట్టుదల, కృషి, శ్రమతోనే టిఆర్‌ఎస్ ఈ స్థాయికి ఎదగగలిగిందని ఆయన చెప్పారు. కార్యాకర్తలను కాపాడుకోవల్సిన బాధ్యత కూడా పార్టీపై ఉందని ఆయన చెప్పారు. కార్యకర్తలు, వారి కుటుంబాలు క్షేమంగా ఉంటేనే పార్టీ క్షేమంగా ఉంటుందని చెప్పారు. టిఆర్‌ఎస్ కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ వినూతన పథకాలను ఆలోచిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు ప్రమాదాలకు గురైతే ఆర్థికంగా ఆదునేందుకు బీమా సౌకర్యాన్ని కల్పించిన మొదటి పార్టీ టిఆర్‌ఎస్‌అని ఆయన చెప్పారు. మూడేళ్లలో ఇప్పటివరకు రూ.45కోట్లు బీమా చెల్లించిన ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని అయన తెలిపారు.

టిఆర్‌ఎస్ అంటే అజేయమైన శక్తి
దేశరాజకీయాల్లో కానీ, రాష్ట్రాభివృద్ధిలో కానీ టిఆర్‌ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగిందని కెటిఆర్ చెప్పారు. కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను స్థాపించిన మూహూర్తబలంతో మరో వంద సంవత్సరాలు టిఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉంటుందన్నారు. ఇప్పటికే 60 లక్షల మంది కార్యకర్తలతో రాష్ట్రంలో తిరుగు లేని రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన గుర్తుచేశారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునే చర్యలను టిఆర్‌ఎస్ శాసన సభ్యులు చేపట్టాలని కెటిఆర్ ఆదేశించారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు శాసనసభ్యులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉండాలని కెటిఆర్ చెప్పారు. ప్రతి కార్యకర్త కరోనాలో ప్రజలను ఆదుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పరంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం
ప్రస్తుతం ఎన్నికలు లేవు పార్టీని మరింత శక్తి వంతంగా తీర్చిదిద్దే కార్యక్రమాలే ఉంటాయని కెటిఆర్ చెప్పారు. అయితే కరోనా కారణంగా ఇప్పటికే నిర్వహించాల్సిన కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయాలు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో త్వరలో కార్యాలయాలను ప్రారంభించాలని టిఆర్‌ఎస్ అధిష్టానం యోచిస్తోందని చెప్పారు.

కార్యకర్తలను ఆదుకోవడం పార్టీ ప్రధాన కర్తవ్యం : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్
కార్యకర్తల భుజస్కంధాలపైనే టిఆర్‌ఎస్ పార్టీ విజయాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ చెప్పారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి పార్టీకి ప్రధానమని ఆయన చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బీమా కంపెనీలకు ప్రిమియం చెక్కు ఇచ్చారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీ విధానమని ఆయన అన్నారు.

TRS paid Rs 45 crore as premium towards workers

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post టిఆర్‌ఎస్‌కు వందేళ్లు నిలబడే సత్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.