దుబ్బాక ఎంఎల్‌ఎ సోలిపేట కన్నుమూత

 కాలికి ఇన్‌ఫెక్షన్‌తో హైదరాబాద్‌లోని ప్రైవేటు
ఆసుపత్రిలో చేరిక అకస్మాత్తుగా గుండెపోటు,
రామలింగారెడ్డి హఠాన్మరణం ముఖ్యమంత్రి
కెసిఆర్ నివాళి, ఉద్వేగానికి గురైన సిఎం
పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖుల సంతాపం

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశాడు.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రామలింగారెడ్డి 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ శాసన సభ్యుడుగా గెలిచారు. 2004 నుంచి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనేక సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశారు. సోలిపేట రామలింగారెడ్డి 2004లో సిఎం కెసిఆర్ దృష్టిలో పడ్డారు. ఏమయ్యా జర్నలిస్టులంటే నాకు గౌరవం, నీ పనితీరు నచ్చింది. రాజకీయాల్లోకి రారాదు అంటూ కెసిఆర్ స్వయంగా ఆహ్వానించారు. కెసిఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో తీవ్రంగా ఆలోచించి తెలంగాణ ఉద్యమంలోకి దూకినట్లు అనేక పర్యాయాలు రామలింగారెడ్డి చెప్పేవారు. అలాగే పేదప్రజల గొంతుకగా రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసి అనేక పర్యాయాలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పాలకులను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. రాంలింగారెడ్డి ప్రజలతో మమేకమై అనేక సమస్యలపై నిరంతరం పోరాడారు. శాసనసభ్యుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు ఆయనను వరించింది. ఆయన బలపర్చిన అభ్యర్థులంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అపూర్వవిజయం సాధించారు. లింగారెడ్డిలో రాడికల్ విద్యార్థినాయకుడి భావజాలం, జర్నలిస్టు ఆలోచన, రాజకీయ నాయకుడు కావడటంతో ప్రజల మనసులను సులువుగా గెలుచుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.


భావోద్వేగానికి గురైన సిఎం కెసిఆర్
సోలిపేట రామలింగారెడ్డి పార్థివదేహంపై ముఖ్యమంత్రి కెసిఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రామ లింగారెడ్డి మృతి చెందారని సమాచారం అందగానే గురువారం చిట్టాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సిఎం కెసిఆర్ నివాళులు అర్పించారు. ఎంఎల్‌ఏ సోలిపేట లింగారెడ్డి హఠన్మరణం చెందడంతో సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో కెసిఆర్ కన్నీటిపర్యంతమయ్యారు. భౌతిక దేహం దగ్గర కొద్ది సేపు కూర్చొని సోలిపేట కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండాగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సిఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు చిట్టాపూర్ గ్రామానికి వెళ్లి శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో లింగారెడ్డి, హరీష్‌రావు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమాల్లో ఇద్దరూ జైలుకు వెళ్లిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. లింగారెడ్డిలేని లోటు మెదక్‌జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటని హరీష్‌రావు చెప్పారు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజాప్రతినిధిగా లింగారెడ్డితో ఎన్నోఎళ్ల అనుబందం ఉందన్నారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మృతిపట్ల మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం దుబ్బాక ప్రజలకు, టిఆర్‌ఎస్ పార్టీకి తీరనిలోటన్నారు.

రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రామలింగారెడ్డి అంత్యక్రియలకు వెళ్లి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, శాసనసభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట లింగారెడ్డి అకాల మరణం నన్ను కలచివేసిందని కెటిఆర్ చెప్పారు. లింగారెడ్డి మృతి టిఆర్‌ఎస్‌కు, తెలంగాణకు తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. రామలింగారెడ్డి మృతిపట్ల శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. రాడికల్ విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టుగా వృత్తికొనసాగించి ప్రజాప్రతినిధిగా సేవలు అందించిన సోలిపేట లింగారెడ్డి మృతి తీరనిలోటని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు సోలిపేట లింగారెడ్డి మృతి దుబ్బాకప్రజలకు, పార్టీకి తీరనిలోటని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. సోలిపేట మృతిపట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సిఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, మంత్రి దగదీష్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యుడు దివాకర్‌రావు, ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌తో పాటుగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.

TRS MLA Lingareddy dies with Heart Attack

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దుబ్బాక ఎంఎల్‌ఎ సోలిపేట కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.