వేసవి విహారాలు

ఎలా వెళ్లాలి? దేశం నలుమూలల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం ఉంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. కాలంతో పాటు పరుగుపెట్టే జీవితంతో సతమతమయ్యేవారికి కాస్త ఆట విడుపు విహార యాత్రలు. ముఖ్యంగా ఇవి పిల్లలకి కావల్సినంత ఆనందాన్ని, సంతోషాన్నిస్తాయి. రోజుకి పన్నెండు గంటలు కార్పొరేట్ తరగతి గదుల్లో మగ్గి మసిబారిపోతున్న పిల్లలకు ఇవి కాస్తంత ఉత్సాహాన్ని, కొండంత ఆనందాన్నిస్తాయి. అందుకే వేసవి […]

ఎలా వెళ్లాలి?

దేశం నలుమూలల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం ఉంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

కాలంతో పాటు పరుగుపెట్టే జీవితంతో సతమతమయ్యేవారికి కాస్త ఆట విడుపు విహార యాత్రలు. ముఖ్యంగా ఇవి పిల్లలకి కావల్సినంత ఆనందాన్ని, సంతోషాన్నిస్తాయి. రోజుకి పన్నెండు గంటలు కార్పొరేట్ తరగతి గదుల్లో మగ్గి మసిబారిపోతున్న పిల్లలకు ఇవి కాస్తంత ఉత్సాహాన్ని, కొండంత ఆనందాన్నిస్తాయి. అందుకే వేసవి సమీపిస్తుందంటే చాలు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ టక్కున పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి. గుర్తొచ్చిందే తడవుగా చాలామంది విహారయాత్రలకు మాత్రం అప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఆదరాబాదరాగా ప్రణాళికలు సిద్ధం చేసి, తీరా అక్కడకు వెళ్ళిన తరువాత నిరీక్షణలు, నీరసాలు, అలసటలను సొంతం చేసుకుంటారు. అందువల్ల ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

అయితే వేసవిలో ఏఏ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలి? ఏ ఏ ప్రదేశాలను చూడాలన్న ఆతృత ప్రతి ఒక్కరిలోనూ కలగడం అత్యంత సహజం. ఎక్కడో దూరాన్న ఉన్న ఊటీ, కోడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలు వెంటనే స్ఫురణకు వచ్చినప్పటికీ, అంత దూరం వెళ్ళలేక, వేసవిని నిస్సారంగా చాలా మంది గడిపేస్తుంటారు. అయితే వేసవి విడిది కోసం దూర ప్రాంతాలలో ఉన్న క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకే వెళ్ళనవసరం లేదు.. కాస్త మనస్సు పెట్టి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక వేసవి విడిది ప్రాంతాలున్నాయి. వాటిలో చాలా వరకు మానసికోల్లాసాన్నిచ్చేవే.. ఖర్చును అదుపులో పెట్టాలనుకునేవారు, ఖర్చుకు వెనకాడే వారు తెలంగాణలో మన చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను, క్షేత్రాలను వేసవి విడిదిగా ఎంచుకుని కావల్సినంత మానసికానందాన్ని పొందవచ్చు.

చారిత్రక నగరం.. హైద్రాబాద్

నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహా నగరంలో దర్శించడానికి అనేక ప్రాంతాలున్నాయి. ఇక్కడ ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలెన్నో పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఈ మహానగరంలో చార్మినార్, గోల్కొండ, మక్కామసీదు, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలీ, బిర్లా మందిరం, రామోజీ ఫిల్మ్‌సిటీ, చిలుకూరు బాలాజి ఆలయం, బిర్లా ప్లానిటోరియం, శిల్పారామం .. ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలు కనువిందు చేస్తాయి.
అలాగే, లుంబినీ పార్కు, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరాపార్కు, కోట్ల విజయ భాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్, ఒపీనియన్ పార్కు, పబ్లిక్ గార్డెన్స్, స్నో వరల్డ్, దుర్గం చెరువు, సాలార్జంగ్, స్టేట్ మ్యూజియాలున్నాయి. వీటితో పాటు నెహ్రూ జూపార్క్‌లో వన్యప్రాణులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు తదితర ప్రాంతాలు విపరీతంగా ఆకర్షిస్తాయి.

అనంతగిరి కొండలు

తెలంగాణా ఊటీ అనంతగిరి. 41 వేల హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతమిది. సహజ సౌందర్యాల నడుమ ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేసే అనంతగిరి కొండలు వికారాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అనంతగిరి మూసీనదికి జన్మస్థానం. అటవీప్రాంతం కావడం వల్ల చుట్టూ పచ్చటి కొండలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి. ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం అనంతగిరి సొంతం. అనంతగిరి కొండలు, అనంతగిరి పద్మనాభుడు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. వీటితో పాటు బుగ్గరామేశ్వరం, భూకైలాస్, ఏకాంబరేశ్వర, జుంటుపల్లి రాముడు, కొడంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు చూడదగినవి. కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా ట్రెక్కింగ్‌కు కూడా ఇది అనువైన ప్రాంతం. అనంతగిరిలో ఎన్నో ట్రెక్కింగ్ స్పాట్స్ ఉన్నాయి.

కళల కాణాచి వరంగల్

కాకతీయుల రాజధానిగా రెండు శతాబ్దాల పాటు వెలుగొంది వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ప్రాంతమిది. ప్రకృతి రమణీయతకు, చారిత్రక కట్టడాలకు, అపురూప శిల్ప సంపదకు నెలవు. ఓరుగల్లు పేరుతో విలసిల్లిన వరంగల్ జిల్లా పునర్విభజనలో భాగంగా నగరం చుట్టూ ఉన్న మండలాలన్నీ కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా అవతరించింది. భద్రకాళి దేవాలయం, చారిత్రక వేయి స్తంభాల గుడి, ఖిల్లా వరంగల్, కాకతీయ తోరణం, ఖుష్ మహల్, నైజాం కాలం నాటి మామునూరు విమానాశ్రయాలు పర్యాటక ప్రాంతాలుగా చెప్పుకోదగినవి..
అలాగే రామప్ప దేవాలయం. రామప్ప చెరువు, లక్నవరం, రుద్రసము ద్రం, ఉదయ సముద్రం, తదితర పర్యాటక ప్రాంతాలను జిల్లాలో సందర్శించవచ్చు. కాకతీయుల పాలనకు గుర్తుగా మిగిలిన చారిత్రక పాకాల సరస్సు, పాకాల గుండం శివాలయం, అయినవోలు దేవస్థానం, భీమునిపాదం జలపాతం ఇక్కడ సందర్శించుకోవచ్చు. ఇక్కడకు 70కిలో మీటర్ల దూరంలో ప్రొ. జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయం ఉంది. ఇక్కడే త్రివేణి సంగమా న్ని పర్యాటకులు దర్శించుకోవచ్చు.
శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, గణపురం కోటగుళ్లు, రేగొండ పాం డవుల గుట్ట, కోటంచ నర్సింహస్వామి ఆలయం, బోగత జలపాతం తదితరాలను కూడా సందర్శించవచ్చు.
ఎలా వెళ్లాలి? :హైదరాబాద్ నుంచి వరంగల్ 145 కి.మీ దూరంలో ఉంది. ఇమ్లిబన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, వరంగల్‌లకు రైలు సౌకర్యం ఉంది. వరంగల్ నుంచి ఆయా ప్రాంతాలకు బస్సు ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

కొలనుపాక జైన దేవాలయం, ఏకశిలపై వెయ్యేళ్ళ క్రితం నిర్మించిన భువనగిరి కోట ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. భువనగిరి కొండ రాక్ క్లైంబింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. తెలంగాణలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ సుప్రసిద్ధం.

ఆకర్షణీయం ‘సాగర్’ బోటు ప్రయాణం

చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ వెనుక జలాల్లో ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు ఈ జిల్లాలోనే ఉంది. రాణీ రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్లను కూడా ‘హెరిటేజ్ టూరిజం’లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు.
ఇక నాగార్జునసాగర్ ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత ఆనకట్ట. వేసవికాలంలో సాగర్‌లో బోటింగ్ ఎంతో అకర్షణీయంగా ఉంటుంది. సాగర్ నుంచి శ్రీశైలం వరకు విస్తరించిన రిజర్వు ఫారెస్టు, జలాశయం మధ్యలో ఉన్న ద్వీపంపై మ్యూజియం చూడవచ్చు. చంద్రవంక జలపాతం ఇక్కడి మరో ఆకర్షణ . ఎత్తిపోతలకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలోని పచ్చని కొండలపై 213 మీటర్ల ఎత్తు నుంచి దూకే నీటి ప్రవాహాన్ని చూడడానికి రెండు కనులూ చాలవంటే అతిశయోక్తి కాదు.
ఎలా వెళ్ళాలి?
నల్లగొండకు హైదరాబాద్ నుంచి విరివిగా బస్సులు ఉన్నాయి. రైల్వే సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ 154 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. నాగార్జున సాగర్‌లో బస చేయడానికి అనేక ప్రభుత్వ,ప్రయివేటు హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి.

సుందర పర్యాటక క్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం

దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భద్రాచలం ఒకటి. ఇక్కడ భక్త రామదాసు కట్టించిన రామాలయం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. భద్రాచలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో గల పర్ణశాలలో రామాయణ కాలం నాటి చారిత్రక ఆధారాలు చూడవచ్చు. దీనితో పాటు తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెర సాని అభయారణ్యం, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. భద్రాచలానికి సుమారు 120 కిలోమీటర్లు దూరంలో పాపికొండలు ప్రాంతంలో ఉన్న పేరంటాల పల్లి చక్కటి పర్యాటక ప్రాంతం. గోదావరి నది ప్రయాణం ద్వారా దీనిని చేరుకోవడం ఓ అద్భుత అనుభూతి.
జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం నేలకొండపల్లి బౌద్ధస్థూపం. ఖమ్మం పట్టణానికి 21 కిలో మీటర్ల దూరంలో గల ఈ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపాలు దర్శనమిస్తాయి.
అలాగే. ఖమ్మం పట్టణ నడిబొడ్డున గల ఖిల్లా ప్రత్యేకమైన నిర్మాణ కౌశలంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఈ జిల్లా ప్రత్యేకత. జిల్లాలోని వాజేడు మండలంలో బొగత జలపాతం ఉంది.

ప్రకృతి రమణీయతకు ప్రతీక ‘ఆదిలాబాద్’

 

ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో పొచ్చర, గాయతి, కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడ ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఉంది. ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సహ్యాద్రి పర్వతాల్లోంచి జాలువారే పొచ్చెర అందాలను ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే.. కుంటాలతోపాటు పొచ్చెర, గాయత్రి, మిట్టె, గుత్పల, సమితుల.. వంటివి ఎన్నో జలపాతాలు పర్యాటక పుటల్లోకి ఎక్కకపోయినా అవి పంచుతున్న మధురానుభూతులు ఎన్నో..
సహ్యాది పర్వతప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం కుంతాల జలపాతం. కడెం నదిపై హోరుమంటూ దూకే ఈ జలపాతం అందాలు వర్ణనాతీతం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కవ్వాలా టైగర్ జోన్ కూడా ఈ పరిధిలోకే వస్తుంది. కుంతాల జలపాతం వంద అడుగుల ఎత్తు నుంచి కిందపడే జలధార మధ్యలో ఓ గుహ ఉంది. ఈ గుహలో సోమేశ్వరుడు, కొలువయ్యాడు. శివరాత్రి నాడు శివభక్తులు ఇక్కడి సోమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. ఇక్కడ నిర్వహించే జాతరను సోమన్నజాతరగా పిలుస్తారు.

 

కాకతీయుల నాటి శివాలయాలకు చిరునామా సూర్యాపేట

ఇక్కడ పురాతన కాకతీయుల కాలం నాటి శివాలయాలు అనేకం ఉన్నాయి. సూర్యాపేటకు ఆరు కిలోమీటర్లు దూరంలో పిల్లలమర్రి చారిత్రక ప్రదేశం ఉంది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన చెన్నకేశవ ఆలయాన్ని కూడా ఈ ప్రాంతంలో సందర్శించవచ్చు.

ఎలా వెళ్ళాలి?
హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట ఉంది. ఇక్కడకు విరివిగా బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్, నల్లగొండల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

సంస్థానాధీశుల కోట ‘వనపర్తి’

ఒకప్పుడు సంస్థానాధీశుల పాలనలో ఉన్న వనపర్తి ప్రస్తుతం జిల్లాగా ఆవిర్భవించింది. వనపర్తికోట, శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం, రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గరుడ పుష్కరిణి, ఘన్‌పూర్ కోట చూడదగిన ప్రదేశాలు.
ఎలా వెళ్ళాలి?: నుంచి వనపర్తికి బస్సు సౌకర్యం ఉంది.

 

కృష్ణ, తుంగభద్రల పావన క్షేత్రం ‘జోగులాంబ- గద్వాల’

కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించే క్షేత్రం జోగులాంబ- గద్వాల జిల్లా. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం ఆలంపూర్ ఈ జిల్లాలో ఉంది. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత చీరలకు నిలయమైన గద్వాల ఈ జిల్లాలోనే ఉంది. తెలంగాణలో మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల, నెట్టె ంపాడు, చంద ఘడ్ కోట, పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయం, పాగుంట వెంకటేశ్వరస్వామి దేవాలయం, జూరాల జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు.

పాలమూరే.. మహబూబ్‌నగర్

ఒకప్పుడు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తి చేసే ప్రాంతంగా ఇది ఖ్యాతి గాంచింది. ఆ కారణంగా దీనిని పాలమూరు అని పిలిచేవారు. అయితే నిజాం పాలనలో దీనిని మహబూబ్‌నగర్‌గా మార్చారు. ఇక్కడ పిల్లలమర్రి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఓ మర్రిచెట్టు మూడెకరాల్లో విస్తరించి ఉంది. పర్యాటకశాఖ ప్రదర్శనశాల, వస్తు ప్రదర్శనశాల ఉన్నాయి.దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పురాతన విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ జలాశయం, పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆల యం ప్రధాన పర్యాటక ప్రదేశాలు.

సోమశిల అందాలకు తార్కాణం ‘నాగర్ కర్నూలు’

పొడవైన కృష్ణాతీరం, సోమశిల అందాలు, నల్లమల అభయారణ్యం, నాగార్జునసాగర్ పులుల అభయారణ్యం, ఎత్తిపోతల ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమకాల్వ సొరంగం, సోమశిల సప్తనదుల సంగమం, మల్లెల తీర్థం జలపాతం, పరహాబాద్ వ్యూపాయింట్ నాగర్ కర్నూలు జిల్లాలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో సాగే పడవ ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. నల్లమలలోని ఉమామహేశ్వరస్వామి దేవాలయం, సోమేశ్వరాలయం, వట్టెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, సోమేశ్వరాలయాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి.

మనస్సును హత్తుకునే ‘మెదక్’

హైదరాబాద్‌కు సమీపంలో ఉండి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా మెదక్. నిజాం కాలంలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన మెదక్ ఖిల్లా, కొల్చారంలోని జైనమందిరం, నర్సాపూర్ అడవులు, పోచారం జలాశయం, పోచారం అభయారణ్యం ప్రధాన పర్యాటక ప్రాంతాలు.
మంజీర నది ఒడ్డున ఏడుపాయల కనకదుర్గ దేవాలయం ఉంది. కొండాపూర్‌లోని పురావస్తు సంగ్రహాలయంలో బౌద్ధ నిర్మాణాలు, శాతవాహనుల కాలం నాటి అవశేషాలు దర్శనమిస్తాయి. మెదక్‌కు15 కి.మీ దూరంలోని పోచారం అభయారణ్యం, విశాలమైన చెరువు, సింగూరు డ్యాం సందర్శించవచ్చు.
సంగమేశ్వర స్వామి కొలువైన ‘సంగారెడ్డి’
సంగారెడ్డి జిల్లాలో సింగూరు జలాశయం, ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం ప్రధాన పర్యాటక కేంద్రాలు.

ఎలగందుల కోట

హైదరాబాద్ సంస్థానంలో ఎలగందులగా ప్రసిద్ధి చెందిన జిల్లా కరీంనగర్. ఎలగందుల కోట, మనారు జలాశయం, దీనిపై నిర్మించిన డ్యాం, వెండితో వస్తువులు తయారుచేసే ఫిలిగ్రీ కళ, ఇల్లందుకుంట దేవాలయం, పురావస్తు ప్రదర్శన శాల ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాలు..
ఆలయాల నిలయం జగిత్యాల: ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, జగిత్యాల కోట, క్లాక్‌టవర్ ప్రధాన పర్యాటక ప్రాంతాలు.
ఓదెల మల్లన్న: రామగిరి ఖిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్‌మడుగు జలాశయం, సబితం జలపాతం, రాముని గుండాలు పెద్దపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు. ప్రసిద్ధ శైవాలయం ఓదెల మల్లన్న దేవాలయం.
సిరిసిల్ల: చేనేత పరిశ్రమకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ జిల్లాలోనే దక్షిణ కాశీగా పేర్గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇదే జిల్లాలో ఎగువ మానేరు జలాశయం ఉంది. సిరిసిల్ల చేనేత పరిశ్రమ, వేములవాడ, నాంపల్లి గుట్ట ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.

చారిత్రక కట్టడాల నిలయాలు నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలు

మూడు వేల ఏళ్లనాటి మానవ ఆనవాళ్లు కలిగిన ప్రాంతంగా నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలు గుర్తింపు పొందాయి. అద్భుత శిలా సంపదకు ఈ ప్రాంతం నెలవు. కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి చారిత్రక కట్టడాలు, అటవీ సంపద ఈ జిల్లాల ప్రత్యేకత. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పుట్టిల్లు నిజామాబాద్. బడాపహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్, అశోకాసాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు. సిర్నాపల్లిలో సిర్నాపల్లి జలపాతం ఉంది. శ్రీరాంసాగర్, ఆలీసాగర్ ముఖ్యమైన ప్రాజెక్టులు.

నిజాం నవాబులు కేవలం ఏడు సంవత్సరాలలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు, బిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం, కాల భైరవస్వామి, లక్ష్మీనరసింహస్వామి, బుగ్గరామలింగేశ్వర, బసవేశ్వర ఆలయాలు, పోచారం కౌలాస్నాలా ప్రాజెక్టు, దోమకొండ సంస్థానం కోట, పోచారం అభయారణ్యం పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ 176 కి.మీ. దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి కొత్త జిల్లాలకు ఇతర పర్యాటక స్థలాలకు బస్సు సౌకర్యం ఉంది.

జైన,బౌద్ధ మతాల చిరునామా ‘మేడ్చల్’

కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. జైన, బౌద్ధమతాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఇక్కడ వెలుగుచూశాయి. ద్రాక్షతోటలు, అందమైన విల్లాలు ఈ ప్రాంతపు ఆకర్షణలు. చిలుకూరు బాలాజీ లీలలకు వేదిక ‘రంగారెడ్డి’ రెండో తిరుపతిగా పేరొందిన చిల్కూరు బాలాజీ, నర్కూడలోని అమ్మపల్లి ఆలయం, హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు ప్రసిద్ధ పర్యాటకాలు.

 

Tourist Places in Telangana

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]