ఉద్యోగంలో కొత్తా…ఇవి పాటించండి!

New Job Tips చదువు.. ఆపై ఉద్యోగం వచ్చింది..ఎంతో సంతోషంగా ఉంటుంది..కానీ ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్నట్టు చేరిన మొదట్లోనే మన ప్రవర్తనా శైలిపై ఒక మంచి అవగాహన ఏర్పడాలి. మీ విషయంలో సానుకూల దృక్పథం ఏర్పడాలి. అయితే అదే పరిస్థితి అక్కడున్నంత కాలం కొనసాగాలంటే కొన్నింటిని మీరు తప్పక పాటించాలి.

ఉద్యోగంలోకి చేరిన రోజునుంచి ఒకటే లక్ష్యం కావాలి. అందరితో కలిసిపోవాలి. అక్కడి పని సంస్కృతికి అలవాటుపడాలి. చిన్నచిన్న విషయాల్లో ఏవైనా తేడాలు ఉంటే తెలుసుకుని సరిదిద్దుకోవాలి. కంపెనీ విధానాలు, లేని నిబంధనలు, మర్యాదలు, వివిధ విషయాలకు సంబంధించి అందరూ ఉపయోగించే భాష, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే విధానం మొదలైన వాటన్నింటినీ తెలుసుకోవాలి. అక్కడ అంతా కొత్తగా అనిపిస్తే చెప్పినట్టు చేయడమే మంచిది. మీకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని రాసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. కొత్త ప్రదేశంలో ఆఫీసు పద్ధతులన్నీ భిన్నంగా ఉండొచ్చు. మీరు వాటికి అనుగుణంగా కలిసి పోయేలా ఉండాలి. మీ అభిప్రాయాలనూ వెంటనే వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

మొదట్లో మీ బాస్ చెప్పినట్టుగానే పనిచేయాల్సి ఉంటుంది. మీ నియామకానికి ఆ వ్యక్తే కారణం కావచ్చు. ప్రతిరోజూ బాస్ ఆదేశాల మేరకు పని చేయడమే మేలు. తనతో మాట్లాడి, సలహాలు తీసుకోండి. అప్‌డేట్ అవ్వండి. బాస్ విశ్వాసం పొందే పని మొదట చేయాలి. కొత్త అన్నది కలకాలం ఉండదు. కొత్త అన్న ట్యాగ్ వదలగానే మీ పని పర్యవేక్షణ పరిధిలోకి వెళుతుంది. అప్పట్నించి బాధ్యతలనూ తలకెత్తుకోవాల్సి ఉంటుంది. పనితీరు ద్వారా ఆఫీసులో పేరు సంపాదించుకున్న ఉద్యోగులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని అనుసరించడానికి ప్రయత్నించండి. ఇది ఎప్పటికీ తప్పు కాదు. ఎదుగుదలకు సంబంధించి ఒక చార్ట్ రూపొందించుకోండి.

వివిధ టాస్కులు ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత ఒక వారాంతంలో పనితీరును చూసుకోవాలి. మీకై మీరే నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. పనిచేసే క్రమంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలకు ఎంతవరకు చేరుకున్నారు.. అన్నది చెక్ చేసుకోండి. సీనియర్ పొజిషన్ లేదంటే ట్రైనీగా చేరినా సరే, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. పరిశీలన, వినడం, పనిలో లీనం కావడం అన్నది మీ మంత్రం కావాలి. అంతా తెలుసు అనుకోవద్దు. అంచెలంచెలుగా నేర్చుకునేందుకు ప్రయత్నం చేయండి. నిశ్శబ్దంగా, ఒంటరిగా ఉండమని కాదు. మీ చుట్టూ ఉన్న సహోద్యోగులను పరిచయం చేసుకోండి. భిన్నంగా ఆలోచించండి. ఆఫీసు నిర్వహించే వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోండి. జాబ్‌లో విజయం అన్నది ఒక లక్షంగా పెట్టుకోండి.

తప్పులను ఇట్టే పట్టేస్తారు

అభ్యర్థులు ఉద్యోగం కోసం ఇంటర్వూకి వెళ్లేటప్పుడు తమకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరిచిన పత్రమే రెజ్యుమె. ఒక్కమాటలో చెప్పాలంటే అభ్యర్థి పరిచయ పత్రం. అయితే ఈ విషయంలో కొంతమంది ఉన్నది ఉన్నట్టుగాక.. రెజ్యుమెలో అధిక సమాచారాన్ని అసంబద్ధ సమాచారాన్ని కూడా చూపిస్తారు. అది తప్పు, అలాంటివి చేయకూడదు. ఇలాంటి వాటిని రిక్రూటర్ చిటికెలో కనిపెట్టి పక్కన పడేస్తారు. కొందరు రెండు మూడు భిన్న అంశాలను కలగలిపి రెజ్యూమె తయారు చేస్తుంటారు. దీని వల్ల విషయంలోపిస్తుంది. రెజ్యూమె తయారీలో ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం..

నైపుణ్యం, తెలివితేటలు ఎక్కువగా కలిపేసి చూస్తారు. నిజానికి ఈ రెండూ వేర్వేరు. ప్రత్యేకించి ఒక విషయంలో నేర్చుకున్నవి, తెలుసుకున్నవి స్కిల్స్ కిందకు వస్తాయి. ఐటికి సంబంధించి ఫలానా లాంగ్వేజ్ తెలుసు అని చెప్పడం స్కిల్ కిందకు వస్తుంది. అదే సంక్షిప్తంగా కోడ్ రాయగలను, ఆఫీస్ అపాయింట్‌మెంట్స్ విషయంలో సింపుల్ ప్రోగ్రామ్ ఇవ్వగలను అని తెలియజేయడాన్ని తెలివితేటలుగా పరిగణించాలి. ఈ రెంటినీ కలిపేయకూడదు.

విషయం ఏదైనా తెలియజేసేటప్పుడు పెద్ద పేరాగ్రాఫ్‌లు రాయకూడదు. అలా రాస్తే కొందరు రిక్రూటర్లు వాటిని పక్కన పెట్టేయవచ్చు కూడా. అనుభవం గురించి రాసేటప్పుడు అంతా ఒక పద్ధతిలో ఉండకపోవచ్చు. మధ్యలో ఖాళీ ఉండవచ్చు. ఆ బ్రేక్ ఎందుకు వచ్చిందో తెలియజేయాలి. అంతే తప్ప వేరే ఇతర కారణాలు చూపరాదు. రెజ్యూమె చూడగానే చాలా వరకు రిక్రూటర్‌కు కారణాలు అర్థం అవుతాయి. అభ్యర్థి ఎంత నిజాయితీగా ఉన్నాడో తెలుసుకోవడం కోసం మాత్రమే కారణాలు అడుగుతుంటారు. ముఖ్యంగా అంకెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ విడిచిపెట్టిన సంవత్సరం, జాయినింగ్ తేదీ అలాగే సాధించిన విజయాలను పొందుపర్చడంలో తప్పులు చేయకూడదు. అందులో తప్పులు పడితే, మొత్తం రెజ్యుమె అనుమానాస్పదంగా తయారవుతుంది.

వాస్తవాలతో అంకెలు కలవకుంటే ఇబ్బందికరమే.సాధించిన విజయాలను వివరించడంలో కలగాపులగం చేయకూడదు. సాధించిన విజయం, అప్పట్లో పని చేసిన కంపెనీ పేరు స్పష్టంగా, ఒక క్రమంలో తెలియజేయాలి. అంతే తప్ప అన్నింటినీ కలిపేయకూడదు. మొత్తం వివరాలన్నీ అర్థమయ్యే విధంగా ఉండాలి.

రిక్రూటర్‌కు మీ దరఖాస్తు ఒక్కటే కొత్త కాదు. ఒక వారంలో వందలాది రెజ్యూమెలను చూస్తూ ఉంటారు. అందువల్ల కొద్దిగా ఆకట్టుకునే విధంగా టెంప్లేట్లు ఉపయోగించడం మంచిది. అది విషయం తెలియ జేయడానికి సహాయపడాలి. కానీ గజిబిజి చేయకూడదు. వాటిని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విషయం కంటికి ఇంపుగా తెలియజేసేలా, అవసరమైనంత మేరకే టెంప్లేట్స్‌ను ఉపయోగించాలి.

Tips for Successfully Starting a New Job

Related Images:

[See image gallery at manatelangana.news]