పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే..

 improve children memory

 

కొంతమంది పిల్లల్లో సహజంగా ఉండే చురుకుదనం గానీ, జ్ఞాపకశక్తిగానీ ఉండవు. అయితే, ఆ లక్షణాలన్నీ పిల్లలు తమకు తామే సృష్టించుకున్నవి అన్నట్లు, చాలామంది తల్లిదండ్రులు వాళ్లను అదేపనిగా తిడుతూ ఉంటారు. వాస్తవానికి కొంత మంది పిల్లలు, బ్రేక్‌ఫా్‌స్టను అసలే చేయరు. లేదా ఎక్కువ సార్లు స్కిప్ చేస్తుంటారు. బాగా ఒత్తిడి చేస్తే అరకప్పు పాలు ఒక బిస్కట్ తినేసి వెళ్లిపోతుంటారు. సమస్య అంతా ఇక్కడే ఉంది. నిజానికి, పెద్దల్లో అయినా, పిల్లల్లో అయినా మెదడు శక్తివంతంగా పనిచేయాలంటే రక్తంలో సరిపడా గ్లూకోజ్ ఉండాలి. అందుకు బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి.

ఎందుకంటే ముందురోజు డిన్నర్ పూర్తి చేసి ఉంటే ఉదయం 8 అయ్యేసరికి 12 గంటలు పూర్తవుతుంది. అప్పటిక శరీరంలోని గ్లూకోజ్ అంతా హరించుకుపోతుంది. అందుకే తెల్లారేసరికి, మెదడు, మొత్తం శరీరం గ్లూకోజ్ కోసం ఆవురావురుమన్నట్లుగా ఉంటాయి. ఆ దీర్ఘవ్యవధి తర్వాత కూడా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా స్కూలుకు వెళితే ఎలా ఉంటుంది? మెదడు పూర్తిగా డీలాపడి పోతుంది. క్లాసులో చెప్పే పాఠాలు గ్రహించి, వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం మాట అటుంచి, అసలు కుదరుగా కూర్చుని పాఠాలు వినే ఓపికే ఉండదు. అందుకే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా దాటేసే అవకాశాన్ని పిల్లలకు ఎంత మాత్రం ఇవ్వకూడదు.

అయినా రోజుకో వెరైటీగా బ్రేక్‌ఫాస్ట్ చేసిపెడుతూ ఉంటే, పిల్లలు వద్దని వెళ్లిపోవడం ఉండదు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. రాత్రి భోజనం తర్వాత కూడా బాగా పొద్దుపోయేదాకా రకరకాల చిరుతిండ్లు తినేయడం ఒక కారణమైతే, మలబద్దకం మరో కారణం. అయితే, ఈ మలబద్దకాన్ని దూరం చేయాలంటే, పిండిపదార్థాలను చిరుతిండ్లుగా ఇవ్వడం మానేయాలి. అంతగా ఆకలిగా ఉంటే యాపిల్, జామ లాంటి బాగా పీచుపదార్థం ఉండే పండ్లు ఇవ్వాలి. మలబద్దకం సమస్య పోతే మళ్లీ ఆకలి మొదలవుతుంది. అప్పుడిక బ్రేక్‌ఫాస్ట్ కోసం తహతహలాడిపోతారు. అందువల్ల పిల్లల జీర్ణ, విసర్జక ప్రక్రియల మీద తల్లిదండ్రులు కాస్త దృష్టి సారిస్తే, దోషాలన్నీ తొలగిపోయి, పిల్లల్లోని గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి. ఆ క్రమంలో వాళ్లలో చురుకుదనమూ పెరుగుతుంది.

Tips for improve children memory

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.