అసంతృప్తి లేదు

Discontent

 

వైద్యుల సూచన మేరకే ఫోన్ స్విచాఫ్ చేశా : జోగు రామన్న
చిట్‌చాట్ వ్యాఖ్యను భూతద్దంలో చూపించారు : నాయిని
అలిగినట్టు వచ్చిన మీడియా వార్తలు అబద్ధం : అరికెపూడి గాంధీ
సమయం వచ్చినప్పుడు పదవులు అవే వస్తాయ్ : దానం
కెటిఆర్‌ను స్వయంగా కలుసుకున్న కడియం

హైదరాబాద్ : తనకు పదవి రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదివారం అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లానని, వైద్యుల సూచన మేరకే తన ఫోన్ స్విచాఫ్ చేశానని తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతం వీడి అదిలాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణలో పదవి వస్తుందని రెండు సార్లు ఆశించినా తనకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి ఫిర్యాదు రాకుండా నడుచుకున్నానని అన్నారు.

గతంలో టిడిపిలో ఉన్నప్పుడుగానీ, టిఆర్‌ఎస్‌లో ఎంఎల్‌ఎగా, మంత్రి చేసినప్పటికీ తనపై ఎలాంటి ఫిర్యాదులూ లేవని పేర్కొన్నారు. మంత్రి పదవి రాకపోవడం వల్ల కొంత మనస్తాపానికి, బాధకు గురికావడం సహజమని అన్నారు. ఈ క్రమంలోనే తనకు హైబీపీ రావడం వల్ల తన కుమారుడితో కలిసి రెండు రోజులు హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చేరానని చెప్పారు. తన గన్‌మెన్, కార్యకర్తలెవరికీ చెప్పకుండా ఆసుపత్రిలో ఉన్నానన్నారు.

ఆ వార్తలపై కెటిఆర్‌కు వివరణ ఇచ్చా : నాయిని
తన గురించి ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు తనను అడిగారని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ ఏదో చిన్నగా మాట్లాడితే దాన్నే పెద్ద వార్తగా రాశారని కెటిఆర్‌తో చెప్పానని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్సే తమ పార్టీ అని, కెసిఆరే తమ నాయకుడని చెప్పారు. పదవులు తమకే దక్కుతాయని, తమకు అన్ని హామీలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఆర్‌టిసి ఛైర్మన్ పదవి ఇస్తే రసం కూడా వాళ్లే పోస్తారని అన్నారు. సిఎం కెసిఆర్ ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతానని చెప్పారు.

కెటిఆర్‌ను కలిసిన కడియం
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత తనకు అసంతృప్తి ఉందంటూ వస్తున్న వార్తలపై మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రి కెటిఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసిన ఆయన తనపై వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవి రానందుకు తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని కెటిఆర్‌తో అన్నట్లు సమాచారం.

నాకు ఎలాంటి అసంతృప్తి లేదు : ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఎలాంటి అసంతృప్తి లేదని శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ ఆరెకపూడి గాంధీ తెలిపారు. తాను అలకబూనానని, గన్‌మెన్‌లను పంపించారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. తన మనవడిని చూసేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రెండు రోజుల పాటు గన్‌మెన్‌లను వాపస్ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి గన్‌మెన్‌లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. అందుకే తాను ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి ఇలానే గన్‌మెన్‌లను పంపిస్తానని వివరించారు.

తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తాను సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు విధేయునిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కెటిఆర్‌ను కలిశానన్నారు. సోమవారం గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణమైన ఆయన నగర శివార్లలోకి వెళ్లగానే గన్‌మెన్‌లను పంపించారనే ప్రచారం జరగడంతో వెనుదిరిగి వివేకానందనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.

సమయం వచ్చినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయి : దానం
సమయం వచ్చినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయని టిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాకపోవడం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. 18 మంది ఉన్న కేబినెట్‌లో ఎన్నో సమీకరణలు ఉంటాయని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉందని, ఉద్యమం చేశారు కాబట్టే పదవులు వచ్చాయని తెలిపారు. అన్ని పదవులు వాళ్లకే అనే వాదన తప్పు అని స్పష్టం చేశారు.

There is no Discontent

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అసంతృప్తి లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.