ఎలెక్టోరల్ బాండ్ల బండారం!

Sampadakiyam        రాజకీయ పార్టీలకు విరాళాల సంబంధమైన ఎలెక్టోరల్ బాండ్ల బాగోతం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున లేవనెత్తడంతో ఈ అంశం తాజాగా దేశం దృష్టిని ఆకర్షించింది. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు కోసం ప్రైవేటు సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి నగదు విరాళాలు తీసుకునేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం 2017లో ఎలెక్టోరల్ బాండ్ల చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇందు కోసం రిజర్వు బ్యాంకు చట్టానికి, ప్రజా ప్రాతినిధ్య, ఆదాయ పన్ను శాసనాలకు సవరణలు చేశారు. ఆ చట్టం మేరకు 2018 జనవరిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైనా ఏ రాజకీయ పక్షానికైనా విరాళం ఇవ్వదలిస్తే నిర్ణీత సమయంలో ఆ సొమ్మును స్టేట్ బ్యాంకులో మాత్రమే జమ చేసి అంత కిమ్మత్తు బేరర్ బాండ్‌ను తీసుకొని తాము కోరుకున్న పార్టీకి ఇవ్వొచ్చు. దానిని ఆ పార్టీలు 15 రోజుల్లో నగదుగా మార్చుకోవచ్చు.

ఆ బాండ్ ఇచ్చినవారి పేరు రహస్యంగా ఉంటుంది. స్టేట్ బ్యాంకు ఆ వివరాలను బయట పెట్టడానికి వీలు లేదు. అలాగే తాము ఎవరికి ఆ బాండ్లు ఇచ్చామో దాత కంపెనీలు కూడా బయట పెట్టవలసిన అగత్యం ఉండదు. పార్టీలకు విరాళాలందించే విధానాన్ని గోప్యతకు ఆస్కారం లేని విధంగా, పారదర్శకంగా ఉంచడానికే ఎలెక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకోడంలోని డొల్లతనం ఇక్కడే బయటపడుతున్నది. దీనిని గుప్పెట విప్పడంగా ఎలా పరిగణించాలో తెలియడం లేదు. అసలు విధానమే అధికారంలో ఉన్నవారికి వడ్డించిన విస్తరని తలపిస్తుండగా ఆ మేరకు తాను రూపొందించిన నిబంధనలకే తిలోదకాలిస్తూ మోడీ ప్రభుత్వం ఈ బాండ్ల విషయంలో సాగించిన ఉల్లంఘనలు మరింత ఘోరంగా ఉన్నాయి. హఫ్ పోస్టు ఇండియా ప్రచురించిన ఐదు భాగాల పరిశోధనాత్మక వార్తా కథనాలు ఈ బండారాన్ని బట్టబయలు చేశాయి.

ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని, పాలకులు స్వీయ ప్రయోజనాల కోసం నిబంధనలను ఉల్లంఘించారని ఈ కథనాలు బయట పెట్టాయి. చట్టం ప్రకారం ఈ బాండ్లను జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాల్లో మొత్తం 10 రోజుల వ్యవధిలో బ్యాంకు ఇవ్వవలసి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఈ వ్యవధిని నెల రోజుల వరకు పొడిగించుకోవచ్చు. గత ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలెక్టోరల్ బాండ్ల పథకం నిబంధనల ఉల్లంఘనకు ప్రధాన మంత్రి కార్యాలయమే ఆదేశించినట్టు హఫ్ పోస్టు కథనం వెల్లడించింది. కేవలం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాల్లోనే బాండ్లను ఇవ్వాలని పథకం సూచిస్తుండగా గత ఏడాది జరిగిన కర్నాటక ఎన్నికల సందర్భంగా ఆ సంవత్సరం మార్చి, మే నెలల్లో కూడా ఇచ్చారని బహిర్గతం చేసింది.

ఈ సమయంలో తీసుకున్న బాండ్లలో 95 శాతం మేరకు బిజెపికే వెళ్లాయని చెప్పింది. కర్నాటక ఎన్నికలు ముగిసిపోయి హంగ్ అసెంబ్లీ అవతరించిన తర్వాత కాల దోషం పట్టిన బాండ్లకు కూడా నగదు చెల్లించవలసిందిగా స్టేట్ బ్యాంకును పాలక పెద్దలు ఆదేశించినట్టు బయటపెట్టింది. మొదట్లో అందుకు అంగీకరించని స్టేట్ బ్యాంకు కేంద్ర ఆర్థిక శాఖ వివరణను కోరగా బాండ్లు నగదు చేసుకోడానికి నిర్దేశించిన 15 రోజుల వ్యవధిని 15 కేలెండర్ దినాలుగా పరిగణించే అవకాశాన్ని కల్పించారు. అంటే వారాంతపు విరామ దినాలను, ఇతర సెలవు రోజులను మినహాయించి మిగతా పని దినాలను మాత్రమే లెక్కించి 15 రోజుల వ్యవధిని ఇవ్వాలని వెసులు బాటు కల్పించారు. అది కూడా ఆ ఒక్కసారికే అని షరతు పెట్టారు. ఇది కేవలం పాలక భారతీయ జనతా పార్టీ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన నీతి బాహ్యమైన సందేనని స్పష్టపడడం లేదా? ఎలెక్టోరల్ బాండ్ల విధి విధానాల పట్ల రిజర్వు బ్యాంకు, ఎన్నికల కమిషన్ కూడా వ్యక్తం చేసిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని స్పష్టపడుతున్నది.

ఎన్నికల కమిషన్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఎలెక్టోరల్ బాండ్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి నిజమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలియజేశారు. అంతకు ముందు 2017 లో పార్లమెంటులో ఒక ప్రశ్నకు అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి. రాధాకృష్ణన్ సమాధానమిస్తూ ఎన్నికల కమిషన్ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని అబద్ధమాడారు. ఇలా ఇన్ని కంతలతో కల్లబొల్లి ప్రకటనలతో నిండిన ఎలెక్టోరల్ బాండ్ల పథకాన్ని భారతీయ జనతా పార్టీ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగపరిచిందని ఇది చెప్పనలవికానంత కుంభకోణమని ఇంత స్పష్టంగా, వివరంగా తెలుస్తున్నప్పటికీ ప్రధాని మోడీ ఎప్పటి మాదిరిగానే ఈ విషయంలో మౌన వ్రతాన్ని పాటించడం సమంజసంగా తోచడం లేదు.

The real problem with electoral bonds

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎలెక్టోరల్ బాండ్ల బండారం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.