అద్భుతాలకు కేరాఫ్ రామగిరి ఖిల్లా

ఆహ్లాద పరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు, ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు, రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన కళా వైభవాన్ని చాటుతూ నేటకీ పర్యాటకులను అలరిస్తూ విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం శిల్ప కళా పోషణకు పెట్టింది పేరుగా ఉండేది. వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై […]

ఆహ్లాద పరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు, ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు, రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన కళా వైభవాన్ని చాటుతూ నేటకీ పర్యాటకులను అలరిస్తూ విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం శిల్ప కళా పోషణకు పెట్టింది పేరుగా ఉండేది. వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రంగాను భాసిల్లుతోంది. 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా పేరొందింది. చారిత్రాత్మక నేపథ్యంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతుంది. పర్యాటకులను ఆహ్లదపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. రామగిరి ఖిల్లా తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.

ఇది అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం. నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం. రామగిరి కోటను గురిజాల కమ్మ వంశీయులు పరిపాలించారు. వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పరుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా ఉంది.

రామగిరి చరిత్ర:
పెద్దబొంకూర్,గుంజపడుగు గ్రామాల్లో పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధిపరిచారని చరిత్ర చెబుతుంది. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకొన్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు, మంత్రకూటమిల శాసనాలు తెలియపరుస్తున్నాయి. రామగిరి రాజధానిగా రాజు గురిజాల ముప్పభూపతి సబ్బినాడును వైభవోపేతముగా పరిపాలించాడు. 1595లో మొఘలాయిల స్వాధీనంలోకి వెళ్లింది. 1606 లో గోల్కొండ నవాబులు ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

వారి నుండి మహమ్మదీయులు వశపరుచు కొని నైజాం కాలం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది. పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరాముని విగ్రహం ఉన్న చోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజులపాలనలో రామగిరిఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానంలో సంగీత నృత్యకళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాలక్రమేణ అది బోగంపేటగా మారింది.

నాటి వాడలే నేటి పల్లెలు:
రాజుల పరిపాలనాకాలంలో వాడలుగా పిలువబడిన రామగిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నేడు పల్లె సీమలుగా మారాయి. వాడల విశిష్టతను బట్టి నేటికీ ఆ గ్రామాల పేర్లు అలాగే కొనసాగుతుండడం విశేషం. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌గా మహ్మదీయుల కాలంలో బేగాలు నివాసం ఉండేప్రాంతం నేడు బేగంపేటగా పిలుస్తున్నారు. అదే విధంగా పోతన పేరుతో ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగాళ్లు నిలిపేచోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగేచోటును శుక్రవారం పేట అని ఆదివారం సంత జరిగేచోటు ఆదివారంపేటగా మైదపు పిండి విసురురాళ్ళు ఉండే చోటును మైదంబండ గా, గుండరాజు పేరున గుండారం అనే పేర్లు వాడుకలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

శ్రావణం మాసం లో సందడే సందడి:
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో… ప్రతి శ్రావణమాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అంద చందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వన మూలికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళా సంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సివుంది.దీన్ని పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతా మని అధికారులు చెబుతున్నారు.

చూడాల్సిన ప్రదేశాలు:
రామగిరి దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభా స్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యాటకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.

ఖిల్లాకు ఎలా వెళ్లాలంటే..
కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా మంథని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల . దూరంలో వుంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్ మండలంలోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామగిరిఖిల్లాకు చేరుకోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా సాంతం చూడాలంటే కనీసం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట – బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.

Related Stories: