వంద కోట్ల మొక్కల పెంపే లక్ష్యం

Haritha-Haram

మన తెలంగాణ/ఖమ్మం/కూసుమంచి/ముదిగొండ/ఖమ్మం అర్బన్: తెలంగాణకు హరితహారం ఐదవ విడతలో భాగంగా రాష్ట్రంలో వంద కోట్ల మొక్కలు నాటే లక్షంతో రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీ నర్సరీలలో మొక్కలను పెంచినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్ (ఐఎఫ్‌ఎస్) తెలిపారు. ఖమ్మం జిల్లాలోని నర్సరీల పరిశీలనకు గురువారం ఖమ్మం చేరుకున్న ప్రియాంక వర్గీస్ జిల్లాలోని కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం అర్బన్ మండలాల్లోని వివిధ గ్రామ పంచాయతీల నర్సరీలలో పెంచిన మొక్కలను ఆమె పరిశీలించారు. తొలుత కూసుమంచి మండలం పాలేరులోని నవోదయ విద్యాలయంలో, అదే విధంగా జుజ్జుల్‌రావుపేట గ్రామ పంచాయతీ నర్సరీని, కేశవాపురం నర్సరీని, ముదిగొండ మండలం లక్ష్మిపురం, సువర్ణాపురం నర్సరీలతో పాటు ఖమ్మం అర్బన్ మండలంలోని నర్సరీని, వెలుగుమట్ల అర్బన్ పార్కును ఆమె జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఖమ్మం జిల్లాలోని నర్సరీల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో మొక్కలు నాటేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించామని ఆమె తెలిపారు. ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

మన ఊరు- మన నర్సరీ లక్షంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని, దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 12వేల గ్రామ పంచాయతీల్లో 80 కోట్ల మొక్కలను నర్సరీలలో సిద్ధంగా ఉంచినట్లు ఆమె తెలిపారు. అధికారులతో పాటు ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యల్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై రైతులకు అవసరమైన, అదే విధంగా గృహ అవసరాలకు అవసరమైన మొక్కలను పంపిణీ చేయాలని ఆమె స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. మొక్కలు అవసరమయ్యే రైతులను వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా గుర్తించి ఏఏ రైతుకు ఏఏ మొక్కలు అవసరం ఉన్నాయో వాటిని అందించాలని ఆమె సూచించారు. నర్సరీలలో ఈ సంవత్సరం పెంచుతున్న మొక్కల్లో పూర్తిగా ఎదగని వాటిని వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు జిల్లా కలెక్టర్ స్వాగతం పలికి తెలంగాణకు హరితహారం కింద ఖమ్మం జిల్లాలో మొక్కలు నాటేందుకు నిర్ధేశించిన లక్షాన్ని వివరించారు.

జిల్లాలో ఈ సంవత్సరం 3.30 కోట్ల మొక్కలు నాటేందుకు లక్షంగా నిర్ణయించి అటవీశాఖ, డిఆర్‌డిఎ, పోలీస్, ఎక్సైజ్, ఉద్యానవన, మున్సిపల్, ఐటిసి, సింగరేణి శాఖల ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీతో పాటు నగరపాలక సంస్థ పరిధి, మున్సిపల్ పరిధిలోని నర్సరీలలో మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ హనుమంతు కొడింబా, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, డిఆర్‌డిఎ పీడీ బెల్లం ఇందుమతి, అడిషనల్ పీడీ విద్యాచందన, ఎఫ్‌డిఒలు సతీష్, ప్రకాష్‌రావు, ఫారెస్టు రేంజ్ అధికారులు జ్యోత్స, రాధిక, పాలేరు ఎంపిటిసి వెంకన్న, జుజ్జుల్‌రావుపేట సర్పంచ్ పద్మారెడ్డి, కేశవాపురం సర్పంచ్ పి. వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపిడిఒలు, ఎపిఒలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

The goal of planting hundreds of crores

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వంద కోట్ల మొక్కల పెంపే లక్ష్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.