కన్నులొట్ట హంతకుడు

తమిళనాడులో ఒక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆరోజే బదిలీపై వచ్చిన ఇన్‌స్పెక్టర్ వైరవన్ (42) ఠాణాలో సిబ్బందితో పరిచయాలయ్యాక తన సీటులో కూర్చుని పెండింగ్ కేసుల ఫైలు ఆసక్తిగా తిరగేసాడు. జాతీయరోడ్డుకు సమీపంలో పోలీస్ ఠాణా ఎక్కువగా రోడ్డుమీద యాక్సిడెంటు డెత్ కేసులే ఉన్నాయి. అందులో యాక్సిడెంట్ మాటున హత్యలుగా నమోదు చేయబడ్డ కేసులు ఒకటికి రెండుసార్లు చూసాడు. పోలీసులు ఎంతో శ్రమించినా ఆ హత్యలకు సంబంధించిన క్లూస్ ఏమీ సేకరించలేకపోయారు. అప్పుడే పోస్టుమాన్ వచ్చి రిజిష్టర్ […] The post కన్నులొట్ట హంతకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తమిళనాడులో ఒక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆరోజే బదిలీపై వచ్చిన ఇన్‌స్పెక్టర్ వైరవన్ (42) ఠాణాలో సిబ్బందితో పరిచయాలయ్యాక తన సీటులో కూర్చుని పెండింగ్ కేసుల ఫైలు ఆసక్తిగా తిరగేసాడు. జాతీయరోడ్డుకు సమీపంలో పోలీస్ ఠాణా ఎక్కువగా రోడ్డుమీద యాక్సిడెంటు డెత్ కేసులే ఉన్నాయి. అందులో యాక్సిడెంట్ మాటున హత్యలుగా నమోదు చేయబడ్డ కేసులు ఒకటికి రెండుసార్లు చూసాడు. పోలీసులు ఎంతో శ్రమించినా ఆ హత్యలకు సంబంధించిన క్లూస్ ఏమీ సేకరించలేకపోయారు.

అప్పుడే పోస్టుమాన్ వచ్చి రిజిష్టర్ కవర్ అందించాడు. వారణాసి నుంచి వచ్చిన కవర్ అది.
తెరచి చూసాడు. అందులో ఓ వృద్ధుడి ఫొటోలు రెండున్నాయి, టైప్ చేసిన లేఖ క్లిప్ చేసి ఉంది. రాసిందెవరో గాని, సంతకం చేయలేదు.
ఆసక్తిగా చదివాడు ఇన్‌స్పెక్టర్.
“ సార్, మీ ఠాణాకు అతి సమీపంలో 1974లో ఓ ఉడిపి హోటల్ ఉండేది. అందులో పనిచేసే నంజయ్యన్ (30) ఎంతో నమ్మకంగా పనిచేసేవాడు. ఒకరోజు మీ ఠాణా నుంచి పోలీసులు వచ్చి నంజయ్యన్‌ను అరెస్టు చేశారు. అందుకు కారణం అతడు మూడు హత్యలు చేసాడని నేరం మోపబడింది.” లేఖ చదువుతున్న ఇన్‌స్పెక్టర్‌లో ఉత్కంఠ పెరిగింది. ఆత్రంగా చదివాడు. అప్పటి ఇన్‌స్పెక్టర్ తంగవేలు థర్డుడిగ్రీ విచారణలో నేరాన్ని నంజయ్యన్ ఒప్పుకోలేదు. తీవ్రస్థాయిలో హింస పెంచేసరికి అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. దాంతో మీ పోలీసులు ఆదరాబాదరాగా రాయవెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి పదిరోజులు తర్వాత తెలివి వచ్చిన నంజయ్యన్ కోలుకోవడానికి మూడు నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. లాకప్ దెబ్బలకు కుడికాలు కుడిచేయి విరిగిపోయాయి. మతిస్థిమితం తప్పిపోయిందని డాక్టర్లు రిపోర్టులో తేల్చారు.
మీ ఠాణాలో ఇన్‌స్పెక్టర్ తంగవేలును, మరి ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అందుకే నంజయ్యన్ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు కాపలాగా ఆసుపత్రిలో ఏదో ఉన్నామన్నట్లు ఉండేవారు. పేషెంట్ పారిపోయే సీన్ ఎంతమాత్రం లేదు.
నెల రోజులు తర్వాత ఊహించని విధంగా అంతో ఇంతో కోలుకున్న నంజయ్యన్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పట్నించి నంజయ్యన్ జాడ మీ పోలీసులకు, నా వంటి వారికి లభించనే లేదు.
అయితే, ఈ లేఖ ఎందుకు రాసానంటే నంజయ్యన్ హోటల్ లో పనిచేసేటప్పుడు వాడితో నేను కలిసిపని చేసేవాడిని. మా చెల్లెల్ని వాడికిచ్చి చేయాలనుకున్నాడు. పైగా, ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఎప్పుడయితే వాడు హంతకుడు అని తెలిసిందో అక్కణ్నించి నా చెల్లెలు తట్టుకోలేక పోయింది. తిండి తిప్పలు మానుకుని టిబి పేషెంట్‌లా అయిపోయింది. చివరికి వాడి బెంగతో చనిపోయింది. అప్పట్నించి ఎప్పుడైనా ఎక్కడైనా నంజయ్యన్ కన్పిస్తే వాడిని నిలువుగా చీల్చేయాలనుకున్నాను. కానీ, నాటి నుంచి నేటి వరకు మీ పోలీసులకు దొరకనట్టే , నాకూ వాడి జాడ దొరకలేదు. నేటికి వాడిని చూసాను. అదే ఒంటికన్ను, పోలీసులు విరిచేసిన ఆనవాలుగా కుంటి కాలు, వంగిన కుడిచేయితో వాడు అవసాన దశలో కాశీలో ముక్తిభవన్ వద్ద చూసాను.
ముక్తిభవన్ నిర్వాహకులకు వాడి గురించి అడిగాను. వారు ఏదో పేరు చెప్పారు. వాడితో బాటున్న మరో వృద్ధుణ్ని అడిగాను. పేరు నంజయ్యన్ తమిళనాడు అని చెప్పాడు. వాడు చేసిన పాపాలను వదిలించుకోవడానికి ఎన్నో క్షేత్రాలు తిరిగాడని చివరికి శివసాయిజ్యం పొందడానికి కాశీ చేరుకున్నాడని వాడితో బాటున్న మరో వృద్ధుడు చెప్పాడు. అలాంటి వాడికి మోక్షం సిద్ధించకూడదు నరకమే ప్రాప్తం కావాలి.
పోలీసులను తప్పించుకుని, న్యాయదేవత కళ్లకు గంతలు కట్టేసి తప్పించుకున్న నేరగాడు నంజయ్యన్. ఉనికి తెలిపాను. వచ్చి అరెస్టు చేసి కోర్టుబోన్‌లో నిలిపి నాటి హత్యలకు నేడు విచారణ చేసి తగుశిక్ష విధించితే మీ వృత్తి ధర్మం మీరు చేసినట్లే అని లేఖ ముగించాడు. ఇన్‌స్పెక్టర్ లేఖ చదివాక గరమ్‌ఛాయ్ తాగి గాఢంగా నిట్టూర్చాడు. పదేపదే లేఖ చదవడం. చేతిలో ఉన్న వృద్ధుని ఫొటోలు చూడడంతో చాలాసేపు గడిపాడు. ఠాణా రైటర్‌ను పిలిచి “ 1974 నాటి పెండింగ్ ఫైళ్లు వెతికి అందులో మూడు హత్యల నేరగాడు నంజయ్యన్ ఫైలు నా ముందు పెట్టం డి. ఫైలు ఎలుకలో, బొద్దింకలో పాడుచేసాయ్ అని చెప్పొద్దు.” కటువుగానే ఆదేశించాడు ఇన్‌స్పెక్టర్ వైరవన్.
కొత్త ఇన్‌స్పెక్టర్ అందులో యమస్ట్రిక్టు ఆఫీసర్ అని ఎగువ నుంచి ఎవరెవరో చెబితే విన్నారు. స్టోర్‌రూమ్‌లోకి వెళ్లాక నిదానంగా వెతికారు. 1974 నాటి ఫైళ్లు కొన్ని చెదలు పట్టాయి. దాంతో సిబ్బంది భయపడుతునే వెతికారు.
హంతకుడు నంజయ్యన్ కేసు ఫైలు చెక్కుచెదరకుండా ఉంది. అంటే, ఈ ఫైలు ఇది వరలో కొందరు ఇన్‌స్పెక్టర్లు తీసి హంతకుడి వేట సాగించారేమో అని తర్కించుకుని స్టోర్‌రూమ్ లోంచి బయటకి వచ్చి ఆత్రంగా ఎదురు చూస్తున్న ఇన్‌స్పెక్టర్ ముందు పెట్టారు.
ఫైలులో తలదూర్చాడు ఇన్‌స్పెక్టర్ వైరవన్. హంతకుడు నంజయ్యన్ పట్టుకునే వేటలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు తమ పరిశోధనలు ఏ విధంగా, ఎలా చేసారో అందులో రాసుంది. 1982లో అహ్మదాబాద్ వెళ్లి ఓ డాబాలో పనిచేస్తున్న నంజయ్యన్ పట్టుకోవాలంటే అక్కడ నుంచి పారిపోయాడు. దాంతో పోలీసులు ఉత్త చేతులతో వచ్చారు. 1985లో కలకత్తాలో పాన్‌మసాలా తయారీ కేంద్రంపై దాడిచేసారు. అంత వరకు ఉన్న నంజయ్యన్ తప్పించుకోవడంతో దొరక్క వచ్చేసారు. 1990లో బెంగుళూర్‌లో నంజయ్యన్ పట్టుకోవడంలో తృటిలో తప్పారు. అదే ఏడాది గోవాలో కూడా పానీపూరీ తయారీ నిపుణుడుగా పేరుపడ్డ నంజయ్యన్ పట్టుకోలేక పోయారు.
అప్పట్లో ఎలా వేటాడింది, ఎవరు వేగు అందించారో అన్నీ ఉన్నా ఎప్పటికప్పుడు నంజయ్యన్ ఫొటోలు మాత్రం సేకరించలేక పోవడం చిత్రాతిచిత్రంగా ఇన్‌స్పెక్టర్ వైరవన్ మనస్సులో తర్కించుకున్నాడు.
మూడుహత్యలు చేసిన నంజయ్యన్ ఫొటోలు పరీక్షగా చూసాడు. వృద్ధాప్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.
శుష్కించిన దేహం, ఎముకలు తేరిపోయి అనారోగ్యంతో ఉన్నట్లుగా గుర్తించాడు. ఏదిఏమయినా చట్టం ముందు నిలపాలని కాశీవెళ్లాలనే నిశ్చయించుకున్నాడు ఇన్‌స్పెక్టర్.
***
ముక్తిభవన్ ముందు ఇన్‌స్పెక్టర్ వైరవన్ నిలబడి తలెత్తి ఆ భవనాన్ని చూసాడు. హిందువుల నమ్మకానికి పెద్దదిక్కుగా 60 ఏళ్లుగా మృత్యుదేవత ఒడిగా ఆ భవనం ప్రేత కళలతో నిండి ఉంది. లోపలకి వెళ్లాడు. రేపోమాపో చావుకు సిద్ధపడుతున్న వారి దగ్గులు, తుమ్ములు, వారిని అనునయిస్తున్న వారి కుటుంబ సభ్యుల గొంతులు విన్పిస్తున్నాయి. శ్రీరామనామ భజన అక్కడ నిర్విరామంగా జరుగుతోంది.
తను వెతుకుతున్న హంతకుడు నంజయ్యన్ కోసం తన వద్ద ఉన్న ఫొటోలతో సరిపోల్చి ఆ వృద్ధుల్లో ఎవరా అని ఎవరికీ అనుమానం రాకుండా వెతుకసాగాడు.
ఒక మూల పడుకుని ఉన్న హంతకుడు నంజయ్యన్ కన్పించాడు. బాగా అనారోగ్యం పాలయ్యాడు. ఇక బతకడనే మనస్సులోనే అనుకున్నాడు. ఆ పక్కనే మరో వృద్ధుడు ఒకింత యాక్టివ్‌గానే గోడకు చేరగిలబడి ఉన్నాడు.
ఇన్‌స్పెక్టర్ వైరవన్ ముందుకు వంగి తనవద్ద ఉన్న ఫొటోలు చూపించాడు.
“ చావుకోసం నిరీక్షిస్తున్న నంజయ్యన్ ఈతడేనయ్యా! మీరు బంధువులా?”
“ అలాంటి సంబంధమే”
పడుకుని ఉన్న నంజయ్యన్ కళ్లు విప్పి చూశాడు. నేను అతనితో మాట్లాడుతాను. నీవు కాస్తా దూరంగా వెళ్లిపో”! నంజయ్యన్ అతి కష్టం మీద ఆ వృద్ధునికి చెప్పి పంపించేసాడు.
“ మీరు పోలీసులు కదూ!”
షాక్ తిన్నట్లు అయిపోయాడు ఇన్‌స్పెక్టర్ వైరవన్.
నీవు మతి చెడిపోయేంత వృద్ధాప్యంలో, అవసానంలో రెపరెపలాడే ప్రాణాన్ని బొందిలో నిలుపుకున్న వేళ కూడా ఇంత అలర్టుగా ఉన్నందుకు ఆశర్యంగా ఉంది.” అని ఒకింత మెచ్చుకోలుగా మాట్లాడాడు వైరవన్.
“ సాబ్! ఓ ఆడకూతురుకి ఇచ్చినమాట కోసం పోలీసులకు చిక్కకూడదనే అనుకున్నాను. అందుకే నా కోసం అత్యంత సమీపంలోకి వచ్చిన మీ వంటి పోలీస్ అధికార్లకు ఠోకరా ఇచ్చి పారిపోతూ నేటికి చిక్కకుండా గడిపాను.”
“ మాటిచ్చావా! ఆ ఆడకూతురు ఎవరు? నీవెవరికో మాటిచ్చినందున నీవు చేసిన మూడుహత్యలను కప్పిపుచ్చుకుంటున్నావు. నీవో హంతకుడి ముద్రతో క్షణక్షణం పోలీస్ భయంతో, పోలీస్ బూట్ల చప్పుడుకి ఉలికిపడుతూ, పారుబోతుగా జీవిస్తున్నావు.”
“ నేను మీతో ఆనాటి నా కథనాన్ని వివరంగా ఇప్పుడు చెప్పుకోలేని అస్వస్థతతో ఉన్నాను. అందుకే నేను చేసిన మూడు హత్యలను చేయడానికి గల కారణాలు. అందులో నేనో ఆడకూతురుకి ఇచ్చిన మాటేమిటో అంతా ఒక వాంగ్మూలంగా రాసి నా చేతి సంచిలో ఉన్న కవర్‌లో పెట్టుకున్నాను. నేను ఏక్షణమైన చచ్చాకనే ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను” అని మాటలు పెగిలి రాకున్నా అతి కష్టం మీద చెప్పి తన తల కింద ఉన్న సంచిని చూపి కళ్లు మూసుకున్నాడు.
ఇన్‌స్పెక్టర్ వైరవన్ వంగి నంజయ్యన్ తలకింద ఉన్న సంచి లోంచి కవర్ తీసి తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు.
నంజయ్యన్‌కు మరిన్ని ప్రశ్నలు గుప్పించి తనకున్న అనుమానాలు తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, ఎంతగా పిలిచినా ప్రశ్నించినా తను మాట్లాడలేని అశక్తతను, వృద్ధాప్య నీరసాన్ని చేత్తోనో చెబుతూ కళ్లు మూసి తెరవసాగాడు.
వైరవన్‌కు అర్థమయ్యింది. నంజయ్యన్ కళ్లల్లో ప్రాణాలు నిలుపుకున్నాడనే నిర్ధారణ చేసి అక్కణ్నించి లేచి ఆ ప్రాంగణం అంతా కలియతిరిగాడు.
ఆ మరుసటిరోజు వేకువజామున నంజయ్యన్ ప్రాణాలు వదిలాడు. మణికర్ణిక ఘాట్‌లో చితిమంటల్లో హంతకుడు నంజయ్యన్ పార్థివ శరీరం రగిలిపోతుంటే చేతులు జోడించి వెను
దిరిగాడు వైరవన్.
***
పోలీస్ ఠాణాకు ఉత్తచేతులతో వైరవన్ వచ్చినందుకు పై అధికారి ఒకరు నవ్వుతూ “ఆ నాటి నరహంతకుడు నంజయ్యన్ నీకే దొరకలేదంటే వాడిని పట్టుకునే వారే మన డిపార్టుమెంట్‌లో లేరన్నమాట”.
“దొరికాడు సార్! కానీ, అరెస్టు చేసి తీసుకురావడానిక కుదరని పరిస్థితిలో, చివరిఘడియల్లో నాతో మాట్లాడిన కొన్ని గంటలకే నేచురల్‌గానే చనిపోయాడు. అతడెందుకు హత్యలు చేసాడో ఆ వివరాలతో కూడిన వాంగ్మూలం అతడే రాసిపెట్టుకున్న కవర్‌తో వచ్చాను. ఇప్పుడు కీలకవ్యక్తి ఉళగారసన్ ఇంటికి వెడుతున్నాను” అని ఫోన్‌లోనే చెప్పి పోలీస్ జీప్ ఎక్కాడు.
పోలీస్ ఠాణాకు పదిహేను కి॥ మీ॥ దూరంలో ఉన్న అయ్యంగార్ల కుటుంబానికి చెందిన ఉళగారసన్ కోట లాంటి ఇంటి ముందు జీపు ఆగింది. ఇద్దరు కానిస్టేబుళ్లతో ఇంటిలోకి వెళ్లాడు.
ఉళగారసన్ మూడేళ్లక్రితం చనిపోయాడు. ఆయన చిన్న కూతురు థానూ పిల్లాపాపలతో ఆ ఇంటిలో ఉంది.
తను ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు. ఆమె “ఏమడిగినా తెలిసినంత వరకు నిజమే చెబుతాను. ఏదీ దాచను” అని చెప్పింది ఎదురుగా తనో చైర్‌లో కూర్చుంది.
“ మీ అక్క వెన్యా ఎక్కడుంది?” ఇన్‌స్పెక్టర్ వైరవన్ తొలి ప్రశ్న సంధించాడు.
ఆమె ప్రేమించిన వాడితో చాలా ఏళ్లక్రితమే వెళ్లిపోయింది. తర్వాత ఏనాడు మాకు కన్పించలేదు. ఆమె ఇప్పుడు ఎక్కడుందో? ఎలా ఉందో? మీకు తెలిసిందా? లేక ఆమెకు ఏదైనా అయ్యిందా? అలాంటిదే చెప్పడానికి వచ్చారా?” అని ఆత్రంగానే అడిగింది. అలాంటిదేమీ లేదు. ఏదేదో ఊహించుకోవద్దు”
ఆమెలో టెన్షన్ చప్పున చల్లారినట్లు అయ్యింది.
“ నంజయ్యన్ మీ వద్ద పని చేసేవాడా?”
డబ్బుకోసం మా చిన్నాన్న తంగరాసన్‌ను, మా అన్న హిరేష్‌ను, మా పొలాలు చూసుకునే రైతు ఇంగోవలన్‌ను చంపి పారిపోయాడు. వాడిని నేటివరకు మీ పోలీసులు పట్టుకోలేక పోయారు. ఆ కే సు అలానే నీరుగారి పోయింది.”ఇప్పుడు విషయానికి వస్తాను. మీ అక్క వెన్యాను, ఆమె ప్రేమించిన వేరే కులం వాడిని, ప్రేమించినందుకు తట్టుకోలేని నీ తండ్రి ఉళగారసన్ పరువు సమస్యతో ఆత్మహత్యాయత్నం చేసుకోబోతే నీ పినతండ్రి, నీ అన్న అడ్డం పడ్డారు. అందుకు మీ అక్కను

ఆమె ప్రియుడిని చంపుతామని మాటిచ్చి వారిని వలవేసి పట్టుకుని మీ ఫామ్‌హవుస్‌లో ఆ ఇద్దరికీ విషమిచ్చి ఓగదిలో పడేసారు. ఆ హత్యల్లో మీ నమ్మినబంటు రైతుకూడా ఉన్నాడు. విషం తాగగానే వెన్యా ప్రియుడు క్షణాల్లో మరణించాడు. ఆ శవంపై పడి ఏడుస్తున్న మీ అక్కను మీ వద్ద పనిచేసే సంజయ్యన్ కిటికీలోంచి చూసి భీతిల్లిపోయాడు.
అల్లంతదూరంలో తవ్వబడిన గోతివద్ద మద్యం తాగుతూ ముగ్గురు హంతకులు గుసగుసలాడుకుంటున్నారు.
మీ అక్కను బతికించేందుకు ఆ గది తలుపులు తెరిచే యత్నం చేసాడు. అప్పుడు మీ అక్క చివరి కోరిక కోరింది. “నంజయ్యన్ తల్లీతండ్రిలేని అనాథవు. మా అమ్మ చేరదీసింది. ఆ విశ్వాసం నామీద కనబరుచు. ఓ చెల్లిగా నీకు చేతులు జోడిస్తున్నాను. నన్ను, నా ప్రియుడిని చంపిన ఆ ముగ్గురిని నీవు చంపగలిగితే అదే నాకు నీవు చేసే పెద్దసాయం. ప్రేమించిన నేరానికి అకారణంగా ఛస్తున్నాం” అని లుంగలు చుట్టుకుపోయి మృత్యవుతో పోరి చనిపోయింది. ఆ ముగ్గురు హంతకులు రెండు శవాలను పొలాల్లో ఖననం చేసేసారు”.
“ మా అక్క వెన్యాను అప్పుడే చంపేసారా? అందుకేనా మా నాన్న చనిపోయిన వరకు ఏముఖం పెట్టుకుని ఈ ఇంటికి వస్తుంది మీ అక్క. ఎక్కడో చచ్చుంటుంది అని ఈసడించేవాడు. అంటే నాన్నకు తెలిసే హత్యలు చేయించాడా?”.
“ మీ అక్కకు ఇచ్చే మాటకోసం ఆ ముగ్గురిని ఏడాది తిరక్కుండానే నంజయ్యన్ భూ వివాదం కేసులో గెలుచుకున్న తోటలోనే మద్యం మత్తులో ఉన్న వారిని తీవ్రంగా గాయ పరిచి నేలబావిలోకి తోసి చంపేసాడు. ఆ హత్యలు మీ భూముల తగువల్లో మీ ప్రత్యర్థులే చంపారని అనుకుని ఎందరినో అనుమానించి పోలీసులు విచారణ చేసారు. కాదని తేలిపోవడంతో అసలు హంతకుడు కోసం వేట ఆరంభించారు. ఆరుమాసాలు పాటు పోలీసులు నంజయ్యన్‌ను అనుమానించలేదు. చివరికి పోలీస్ విచారణలో అసలు హంతకుడు నంజయ్యన్ అని తేలిపోవడంతో పోలీసులు అరెస్టుచేసి విచారించినప్పుడు పోలీస్ దెబ్బలకు ఆసుపత్రి పాలయ్యాడు. అక్కణ్నించి తప్పించుకు పారిపోయి నేడు కాశీలో చావుబతుకుల మధ్య నాకు వాంగ్మూలం ఇచ్చాడు” చెప్పి ముగించాడు ఇన్‌స్పెక్టర్ వైరవన్.

Telugu Crime Story
                                                                                              99852 65313

                                                                                              యర్నాగుల సుధా కరరావు

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కన్నులొట్ట హంతకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.