కాంగ్రెస్‌పై కమలం గురి…

congress-And-Bjpహైదరాబాద్: తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న కమలదళం వైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పలువురు నేతలు అడుగులు వేస్తున్నారు. మోడీ హవాలో కుదేలైన కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకోవడం కష్టమన్న భావనలో వున్న కాంగ్రెస్‌తో పాటు టిడిపి, టిజెఎస్, ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు కమలదళంలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి పూర్వం రంగారెడ్డి జిల్లాలో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అనంతర పరిణామాలలో నేతలు, క్యాడర్ అంతా సైకిల్ దిగి కారు ఎక్కినా అక్కడక్కడ ఒకరిద్దరు నేతలు ఇంకా పార్టీలో మిగిలారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించిన నేతలు ఇక సైకిల్ దిగి కమలం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్‌తో పాటు పలువురు టిడిపి నేతలు ఇటీవల శంషాబాద్‌లో బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్బంగా విచ్చేసిన అమిత్‌షా సమక్షంలో బిజెపిలో చేరగా పలువురు నేతలు ఆయన వెంట బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు అధ్వర్యంలో ఈ నెల 18 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో జిల్లాలోని పలువురు టిడిపి నేతలు బిజెపిలో చేరడానికి రంగం సిద్దమైంది.

రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గతంలో శాసనసభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలైన మువ్వ సత్యనారాయణలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన టిడిపి నేతలు బిజెపి జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ జె.పి నడ్డా సమక్షంలో చేరడానికి సిద్దమవుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు నియోజకవర్గాలలో కొంత వరకు పట్టున్న నేతలంతా ముకూమ్మడిగా సైకిల్ దిగి కమలం గూటికి చేరనుండటంతో టిడిపి దుకాణం బంద్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. టిడిపిలో కొనసాగుతున్న మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆయన తనయుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ సైతం సమీప కాలంలోనే టిడిపి వదిలి బిజెపిలో చేరడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్‌పై కమలం గురి…

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న కాంగ్రెస్ నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి కమలదళం నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపి ఇంటికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి నేరుగా వెళ్లి చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను బిజెపిలోకి తీసుకువచ్చేందుకు బడానేత పావులు కదుపుతున్నారు. ఈ నెల 18 న నిర్వహించే సమావేశంలో కాకపోయిన సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్న సమావేశంలో అమిత్‌షా సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నేతలు చాలామంది కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేకంగా కన్నెసిన కమలదళంలో అంతర్గతంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తుంది.

Telangana senior Congress leaders in touch with BJP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాంగ్రెస్‌పై కమలం గురి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.