తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి

Telangana self esteem symbol Suravaram Pratapa Reddy

 

తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. కవిత్వం, కథలు, నాటకాలు, వ్యాసాలు, జీవిత చరిత్ర, పరిశోధన గ్రంథాలు, పత్రికా సంపాదకీయాలు ఇలా ఎన్నో నిజాం రాష్ట్రంలో ఉర్దూ భాష అధికారం చెలాయిస్తున్న రోజులలో, తెలుగుకు ఏమ్రాతం ఆదరణ లేని రోజులలో విశృంఖలంగా నిమ్మకునీరెత్తినట్లు నిర్భయంగా, నిశ్చలంగా, నిర్విరామంగా రాసుకొంటూ పోయిన ఒక నిష్కల్మష నిరాడంబర జీవి ప్రతాపరెడ్డి గారు. ఆయన రాసిన గ్రంథానికి (ఆంధ్రుల సాంఘిక చరిత్ర) ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమి తొలి పురస్కారం (1957) తెలుగు వారికి లభించిందంటే, తెలంగాణ వారే కాదు, ప్రతి తెలుగువాడూ ఆనాడే గర్వించినవారే.

ఆయన పుట్టింది (28-051896) అప్పటి రాయచూరు జిల్లా (ఇప్పటి జోగులాంబ గద్వాల జిల్లా) అలంపురం తాలూకా ఇటికేలపాడులో. దాన్ని ‘నీళ్లు లేని ఇటిక్యాలపాడు’ అని అంటారు అంటువంటి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన ప్రతాపరెడ్డి గారు నిజాం రాష్ట్రంలో పచ్చదనంతో నింపి తెలంగాణ తేనేమాగాణ మొనరించిన సాహిత్య సాహసిక హాలికుడు. ‘తెలంగాణ మూల్గిన తొలి నాటి ధ్వనిగా, ‘సంచార గ్రంథాలయం’గా, ‘సంభాషించే విజ్ఞానకోశం’గా, ‘మౌలిక పరిశోధన మౌని’గా సాహితీమూర్తుల చేతకీర్తింపబడిన ప్రతిభా ప్రభాకరులు ప్రతాపరెడ్డిగారు.

తెలుగు భాషకు, తెలుగుదనానికి ఏమాత్రం అండలేని నాళ్లలో ‘గస్తీ నిషాన్ 53’ వంటి చీకటి చట్టాలతో ప్రాథమిక హక్కులు అడుగంటిన అంధయుగపు రోజులలో ‘గోలకొండ పత్రిక’ను స్థాపించి, సంపాదకీయాల తుపాకీ గుండ్లను కురిపించి, నిజాం నిరంకుశత్వానికి బీటలు వారించిన సారస్వత సమరయోధుడు. ఒకవైపు మేరలేని తెలుగు భాషాభిమానం, మరొకవైపు మీరలేని నిజాం నిరంకుశత్వం ఈ రెండింటి మధ్య ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వం నలిగినది, కాదు అనంతముఖాలుగా వెలిగినది. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కడదాకా ఓపికతో, పూనికతో తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మగా నిల్చిన మేరునగధీరుడు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆనాడే అప్పటి మద్రాసు (చెన్నై) నగరంలో బిఎ.బి.ఎల్. చదివినా, ఆ రోజులలో వకాలతు వృత్తిలో ఎంతో దౌలత్‌ను సంపాదించుకొనే సౌలతు ఉన్నా, వకాలతు వృత్తికి స్వస్తి చెప్పి, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, ఆర్జనకు ప్రాధాన్యమివ్వకుండా తెలుగు భాషకు, తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేసిన త్యాగధనులు. తెలంగాణలో భాషా, సాంస్కృతిక, సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిలించడంలో ప్రధాన పాత్ర పోషించిన ‘ఆంధ్ర మహాసభ’కు ప్రతాపరెడ్డి గారు తొలి అధ్యక్షులు అయినారంటే, ఆనాటి తెలంగాణ సమాజంలో ప్రతాపరెడ్డికున్న ప్రాముఖ్యమెటువంటిదో తెలియజేస్తుంది. రెండో మహాసభకు బూర్గుల రామకృష్ణరావు గారు అధ్యక్షులయినారు. తెలంగాణలో రాచరికం అంతరించిన తర్వాత ప్రజా ప్రభుత్వానికి తొలి ముఖ్యమంత్రి అయినారు బూర్గుల రామకృష్ణరావు గారు.

ఆనాటి తెలంగాణ సమాజంలో ప్రతాపరెడ్డి గారి సేవకు నోచుకోని సంస్థ ఏదీ లేదు. ‘అభివృద్ధి పక్షము’, ‘విజ్ఞానవర్ధినీ పరిషత్తు’, ‘ఆంధ్ర సారసత పరిషత్తు’, ‘రెడ్డి హాస్టలు’ ‘ఆంధ్ర విద్యాలయం’, ‘ఆయుర్వేద సంఘము’, ‘యాదవ సంఘం’, ‘ముదిరాజ్ సంఘం’ వంటి సంస్థలెన్నిటికో ప్రతాపరెడ్డి గారు నిరుపమాన సేవలందించారు. గ్రంథాలయోద్యమం ద్వారా తెలంగాణలో అక్షర జ్యోతులను వెలిగించిన మహా మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సామాజిక ప్రగతికి ఎంతో పూనికతో ఎంతో తత్పరతతో సేవజేసిన ధన్యజీవి.

సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన గ్రంథాలలో ఎన్నో ప్రశస్తికెక్కినవి.
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, 2. రామయణ విశేషాలు తర్వాత సురవరం కథలు, మొగలాయి కథలు, హైందవ ధర్మపోటీలు(కథలు), సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు, సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు, శుద్ధాంత కాంత(నవలఅముద్రితం), భక్తతుకారాం, ఉచ్ఛల విషాదం వంటి నాటకాలు, రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర వంటి గ్రంథాలనెన్నింటినో రాశారు. గోలకొండ పత్రికా సంపాదకులుగా వందలకొద్దీ సంపాదకీయాలు, వ్యాసాలు రాశారు. కొన్ని సంపుటాలకెక్కినవి, ఎక్కనివి ఎన్నో. ‘మామిడి పండు’, ‘తాంబూలసేవనం’ వంటి మామూలు విషయం మీద రాసిన ‘మలబారు క్రైస్తవులు’, ‘మన పరిశ్రమలను నాశనం చేసినదెవరు’ వంటి మహత్తర విషయాల మీద రాసినా, ప్రతి సంపాదకీయాన్ని,వ్యాసాన్ని ఎంతో నిబద్ధతతో, పరిశోధన ప్రవరణతో, సమాచార సంపదతో, ఆసక్తికరమైన, ఆశ్చర్యజనకమైన విషయ పుష్టితో తీర్చిదిద్ది పాఠకులకు విజ్ఞానాన్ని అందించేవారు. అదీ ఆయన పరిశ్రమ, అంకితభావం. అయితే వారెన్నడూ పాండిత్య ప్రకర్ష చూపలేదు.

సమాజహితం కోరి, సాంఘిక ప్రయోజనకారకాలైన రచనలపైనే దృష్టి నిలిపారు. గ్రామ జనులకు విజ్ఞానం గురించి నీతులు బోధించే గ్రామ జనదర్పణం, పేద ధర్మాలను నిర్వహించే ప్రతి వ్యక్తి తెలుసుకోదగిన అంశాలను ‘నిజాం రాష్ట్ర పరిపాలనం’ (వయోజన విద్యకు ఉపయుక్తమైన యువజన విజ్ఞానం), ప్రజల ప్రాథమిక హక్కులు తెలియజేయడానికి ‘ప్రాథమిక సత్తములు’ అనే లఘు గ్రంథాలను కూడా రచించిన సామాజిక వేత్త. జానపద గేయాల సేకరణ, నిఘంటువుకెక్కని పదాల సేకరణ(వాటి అర్ధ వివరణ), లాళపత్రగ్రంథసేకరణ, అపూర్వ చిత్రలేఖనల సేకరణ, తెలుగులిపి సంస్కరణ వంటి విషయాల పట్ల కూడా అతని మేధ ప్రసరించినది.

‘తెలంగాణమున కవులులేరు’ అని ఎవరో అల్పమతితో అన్న మాటలకు ప్రతాపరెడ్డి గారి అత్మగౌరవం గాయపడగా అహోరాత్రులు అకుంటిత దీక్షతో శ్రమించి, ఎందరి కవులనో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదించి, వారి రచనలతో, జీవిత విశేషాలతో 354 కవిరత్నాలను ‘గోలకొండ కవుల సంచిక’ అనే గ్రంథం ద్వారా వెలుగులోకి తెచ్చిన గొప్ప ఆత్మాభిమాని.
‘తెలంగాణ వారి భాష తెలుగు భాషేనా! వాళ్లది తౌరక్యాంధ్రము’ అనే అభిప్రాయం ఆనాడే కాదు, ఈ నాడూ అనేక మంది ఆంధ్రులలో ఉన్నది. ఆంధ్రదేశ చరిత్రలోనుకుటాయమానుడైన మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ప్రతాపరెడ్డిగారి భాషా శైలిని గురించి “ఆయన శైలిలో ఒక ఆవేశము, భావపరిపుష్టి, ప్రసన్నత, మధురిమ, ఇన్నిటినిమించి ఒక వింతచురుకుదనము, ఓజస్సు, తేజస్సు ఉన్నవో నేను చదవనని భీష్మించి కూర్చున్నా వారిగ్రంథం గనుక చేతపట్టినామంటే వారి రచనే, వారి శైలే మనకు పూర్తిగా చదివిందాకా తోచనీయదు.. వారి శైలి చాలా శక్తి మంతమయినది, అతి మధురమైనది… ఇట్లా అంటున్ననంటే అది అతిశయోక్తి కాదు, వారి శైలిలో ఉన్న సొగసు అట్టిది, అంతపొంకముగా, అంత యింపుగా, అంత రుచికరంగా వారి వలె రచన చేసేవారు, చేయగల వారూ విశాలాంధ్రలో యెందరోలేరు… మహాదేశాభిమాని, మహాపరిశోధకుడు, మహాకవి, మహారచయిత’ అని ప్రశంసించినారు. ‘ప్రతాపరెడ్డిగారి వలె సత్జహవాసం, సద్భావం, సహృదయం, సత్ప్రవర్తన కలిగిన మనుష్యలు మచ్చుకు మాత్రం మిగిలిఉన్నారు.

ఆయన ఒక వ్యక్తి కాదు, ఉత్కృష్ట సంస్థ, మార్గదర్శికుడు’అని బూర్గుల రామకృష్ణరావు గారన్నారు. 1952 నాటి మొదటి సార్వత్రిక ఎన్నికలలో వనపర్తిని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఎన్నికైనారు. ఆనాడు నవాబులకు తొత్తువై, భావదాస్యంతో తెలుగువాళ్లై ఉండకుండా ఉర్దూ భాషను మాట్లాడటం, రూమీటోపే వంటి ముస్లింల వేషాన్ని అనుకరించడం గొప్పగా భావించే రోజుల్లో ప్రతాపరెడ్డిగారు పలుకులోను, పంచెకట్టులోను, అంగారఖా, కండువా లేదా తల పాగతో పదహారాణాలు తెలుగుతనాన్ని ప్రతిబింబింపజేసిన వ్యక్తి. స్వవేషభాషాడురభిమాని’ అని ఆనాటి వారిచేత అనిపించుకొన్న ఆత్మాభిమాని. అందుకే ప్రతాపరెడ్డి గారు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ వారి హృదయాలలో ఎప్పటికీ సగర్వంగా సమున్నతంగా ఎగురుతుండే పతాక. అటువంటి మహానీయుని జయంతి (మే,28 నాడు) సందర్భంగా వారిని స్మరిస్తూ ఈ చిరువ్యాసాన్ని తెలంగాణ సమాజానికి సమర్పిస్తున్నాను.

                                                                     (మే, 28 నాడు ప్రతాపరెడ్డి గారి జయంతి)
                                                                     (జననం 28.05.1896, మరణం 25.08.1953)

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.