ఒకటిన్నర శతాబ్దాల తెలంగాణ నవల

Telangana displays its specialty in various genres

తెలంగాణ వివిధ సాహిత్య ప్రక్రియల్లో తన ప్రత్యేకతను కనబరుస్తోంది. అనేక ప్రక్రియల్లో తెలంగాణలోనే పునాదిరాయి పడిం ది. అనేక ఆధారాలున్నప్పటికీ పలు కారణాల వల్ల తెలంగాణ సాహిత్య చైతన్య పూర్వ రూపాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. నవలా ప్రక్రియలో నూ తెలుగులో బీజం వేసింది తెలంగాణ ప్రాంతమే. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన తడకమల్ల వేంకట కృష్ణారావు 1866లో కంబుకంధర చరిత్ర అనే నవలను రచించారు. తెలుగులో మొదటి నవల ఇదేనని సాహిత్య విశ్లేషకులు పేర్కొంటారు. మరో రెండేళ్లకు 1868లో కామరూప కథ అనే మరో నవలను కూడా కృష్ణారావు రాశారు. ఈ రెం డూ స్వతంత్ర రచనలే. వీటిలో కంబుకంధర చరిత్రలో పద్యాలు కూడా ఉన్నాయి.ఆ తర్వాత శ్రీమదాంధ్ర కవితావేదినీ విలాసమనే మారు పేరున్న తెలుగు వెలుగు ముగుద కథను కూడా తడకమల్ల వేంకట కృష్ణారావు రాశారు. దీన్ని చంపూ రచనగా పేర్కొన్నప్పటికీ ఇందు లోనవల లక్షణాలున్నాయని సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. ఈ నవల 1879లో ప్రచురితమైంది.తడకమల్ల వేంకట కృష్ణారావు రచనల వివరాలు శ్రీరంగాచార్య, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి,సంగిశెట్టి శ్రీనివాస్, కాసు ల ప్రతాపరెడ్డి పరిశోధనల నుండి తెలుస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేశ్‌పాండ్య సోమరాజు రామానుజ రావు ‘మంజుమతి’ అనే చారిత్రక నవలను 1914లో రాశారు. అనంతరం ఒద్దిరాజు సోదరుల్లో ఒకరైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు 1918లో ‘రుద్రమ దేవి’ అనే చారిత్రక నవలా రచన చేశారు. రుద్రమదేవిని గద్దె దించేందుకు జరిగిన ప్రయ త్నం, దేవరాజు యాదవరాజుతో జరిగిన యుద్ధంలో ఆమె గెలిచిన విధానం ఈ నవలలో చిత్రితమైంది. ‘శౌర్య శక్తి’, ‘భ్రమర’, ‘బ్రాహ్మణ సాహసము’ అనే చారిత్రక నవలలను; ‘స్త్రీ సాహసము’, ‘ముక్త వలస’, ‘ప్రేమ ప్రవాహము’, ‘రక్తాంజలి’, ‘ఇరువురు మగలు’ మొదలైన సాంఘిక నవలలను కూడా సీతారామచంద్ర రావు రాశారు. ఆయన సోదరులు ఒద్దిరాజు రాఘవ రంగారావు ‘వీరావేశము’,‘వరాహ ముద్ర’ అనే చారిత్రక నవలలను రాశారు. ఈ రెండు నవలలూ కాకతీయ సామ్రాజ్య విశేషాలతో కూడినవే. ఒద్దిరాజు సోదరులు సైన్స్ ఫిక్షన్ కూడా రాయడం విశేషం.

హైదరాబాదు నుండి వెలువడ్డ ‘మీజాన్’ పత్రిక సంపాదకుడిగా పనిచేసిన అడవి బాపిరాజు తెలంగాణ చరిత్రలోని పలు అంశాలు ఇతివృత్తాలుగా ‘హిమబిందు’, ‘గోన గన్నారెడ్డి’ మొదలైన నవలలు రచించారు. 1910లో వెలువడ్డ ‘ఆశాదోషం’ కూడా చారిత్రక నవలే. హితబోధిని అనే తొలి స్వతంత్ర తెలుగు పత్రికను వెలువరించిన బండారు శ్రీనివాస రావు ఈ నవల రచయిత. కోయిలకొండ దుర్గంపై మహమ్మదీయ రాజుల దాడి ఈ నవల ఇతివృత్తం. మొదటి ప్రతాపరుద్రుని విశేషాలతో ‘వసుంధర’ అనే చారిత్రక నవలను వరంగల్లులో స్థిరపడ్డ దూపాటి వేంకట రమణాచార్యులు రాశారు. ఆయనే ‘కొండపల్లి ముట్టడి’, ‘అన్నయ మంత్రి’ అనే మరో రెండు నవలలు రచించారు.

తెలంగాణ సారస్వతాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రతిన పూనిన సురవరం ప్రతాపరెడ్డి 1917లో ‘శుద్ధాంత కాంత’ అనే నవలను రచించారు. నిజాం నవాబుల అంత:పుర రహస్య సంబంధిత నవలగా దీన్ని పేర్కొంటారు. ప్రతాపరెడ్డి 1932లో ‘ఆరెవీరులు’ అనే మరో నవలను రచించారు. దాయాదుల పోరు ఈ నవల ఇతివృత్తం. ‘ప్రాకృత దాంపత్యము’ అనే నవలను 1922లో శేషభట్టరు వేంకట రామానుజాచార్యులు రాశారు. 1924లో వెలువడ్డ ‘శోభావతి’ అనే నవల ప్రస్తావన నల్లగొండ జిల్లా కవుల సంచికలో ఉంది. అయితే ఈ నవలాకర్త వివరాలు తెలియడం లేదు. అదే సంవత్సరం వరంగల్లు జిల్లాకు చెందిన చాట్రాతి

లక్ష్మీనరసమాంబ రాసిన ‘అనురాగ విపాకము’ అనే నవలను విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల ప్రచురించింది.
వరంగల్లుకే చెందిన కోకల సీతారామ శర్మ అనే సంపాదకులు ‘పావని’ అనే నవలను వెలువరించారు. మెదక్ జిల్లా వడ్డేపల్లి నుండి వెలువడ్డ ‘దేశ బంధు’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించిన బెల్లంకొండ నరసింహాచార్యులు ‘చీనా సుందరి’ అనే నవలను రాశారు. ‘శ్రీధర విజయము’ అనే నవలను చిల్లరిగె శ్రీనివాసరావు, ‘శశికళ’ అనే నవలను పూటుకూరి సత్యనారాయణ, ‘పద్మినీ బాయి’ అనే నవలను వనం నరసింహారావు రచించారు. ఈ మూడు నవలలను నల్లగొండ జిల్లాకు చెందిన కృషి ప్రచారిణీ గ్రంథమాల అనే సంస్థ ప్రచురించింది.

బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘ఆనంద మఠం’ నవలను అనువదించడమే కాకుండా ‘గ్యారీబాల్డి’ అనే నవలను కూడా మాడపాటి హనుమంతరావు రాశారు. 1927లో సికింద్రాబాదుకు చెందిన టేకుమల్ల నరసింహం అనే రచయిత ‘రాధమ్మ’ అనే నవలను రాశారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాదుకు చెందిన ముడుం బై రామానుజాచార్యులు ‘కాదంబిని’, ‘ప్రేమ చాంచల్య ము’ అనే నవలలను రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆవునూరు వేణుగోపాల రావు ‘జొహరాబాయి’ అనే నవలను రచించారు. మెదక్ జిల్లాకు చెందిన భాగవతం సీతారామ శర్మ ‘పశ్చాత్తాపము’, ‘పుష్పావతి’, ‘ఈశ్వర సంకల్పము’ అనే నవలలు రాశారు. పాఠశాలల పిల్లలు రోజూ చదివే ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వేంకట సుబ్బారావు ‘కాల భైరవుడు’ అనే నవలను 1930లో రచించారు. వరంగల్లు జిల్లాకు చెందిన అంబటి లక్ష్మీనరసింహ రాజు ‘శాంతాబాయి’ అనే నవలను రాశారు. దేవరకొండకు చెందిన సయ్యద్ అజ్మతుల్లా సోదరులు అనేక నవలలు రాశారు. వాటిలో ‘జాహ్నవి’, ‘మణి’, రంపరాకాసి’, ‘సుజాత’ మొదలైనవి ఉన్నాయి. సోమయాజుల లక్ష్మీ నరసింహ శాస్త్రి ‘గిరిజ’ అనే నవలను రాశారు. ‘ఎగిరే పల్లాలు’ అనే నవలను చినలూరి లక్ష్మీనరసింహాచార్యులు రచించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన వెంకట రాజన్న 1935లో ‘పతి పత్ని’ అనే నవల రాశారు. ‘చుక్కాని’ అనే నవలను మంచళ్ల సుదర్శనాచార్యులు, ‘సాడేగ్యారా’ అనే డిటెక్టివ్ నవలను తిరునగరి శివరామకృష్ణ రచించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సర్వ దేవ భట్ల నరసింహమూర్తి,హీరాలాల్ మోరియా ఉర్దూలో నవలలు రాశారు. నరసింహమూర్తి రాసిన ఉర్దూ నవలలు ‘మై గరీబ్ హు’, ‘చివరి రాత్రి’ పేర్లతో తెలుగులోకి వచ్చాయి. ఆయనే ‘మొదటి రాత్రి’, ‘జారుడు బండ’ అనే నవలలను కూడా రచించారు. ‘గుడిమెట్లు’,‘తెగని గొలుసులు’, ‘ఆగిన తుఫాను’ నవలలను హీరాలాల్ మోరియా రచించారు.

కురుగంటి సీతారామయ్య రాసిన ‘శాతకర్ణి’, ‘లవంగి’ నవలలకు మంచిపేరు వచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు ‘సముద్ర ఘోషలు’, ‘రాధ’, ‘మాఘంటం’ అనే నవలలను; భువనగిరికి చెందిన రచయిత పెండెం వాసుదేవరావు ‘గుసగుసలు’ అనే నవలను; వనపర్తికి చెందిన ఉమ్మెత్తల యజ్ఞరామయ్య ‘ఆశాలత’ అనే నవలను రచించారు. ‘యుగ సం ధి’, ‘భవిష్యద్దర్శనం’, ‘వింత ప్రణయం’ మొదలైన నవలలను భాస్కరభట్ల కృష్ణారావు రాశారు. నిజామాబాదు జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన లోకమలహరి ‘జగ్గని యిద్దె’, ‘సంగం’ అనే నవలలను రచించారు.
తెలంగాణ సాయుధ పోరాటంపై బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’ అనే నవలను రాశారు. ఇదే అంశంపై మహీధర రామమోహనరావు ‘ఓనమాలు’, ‘మృత్యువు నీడల్లో’ అనే నవలలను, లక్ష్మీకాంత మోహన్ ‘సింహ గర్జన’ అనే నవలను రచించారు.

ప్రసిద్ధ రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’, ‘గంగు’ అనే నవలలను రాశారు. మహా కవి దాశరథి కృష్ణమాచార్యులు ‘అమరశిల్పి జక్కన’ అనే నవలను రాసినట్టు కొందరు విమర్శకులు పేర్కొన్నారు. ఆయన సోదరులు దాశరథి రంగాచార్య ‘పావని’, ‘చిల్లర దేవుళ్లు’, ‘మోదుగు పూలు’ మొదలైన నవలలు రాశారు. సుప్రసిద్ధ పరిశోధకులు బి.ఎన్.శాస్త్రి కూడా ‘తుక్కాదేవి’, ‘వాకాటక మహాదేవి’ అనే చారిత్రక నవలలు; తెలంగాణ విమోచనోద్యమం అంశంగా ‘విప్లవ జ్వాల’ అనే నవలను రాశారు. తిరునగరి ‘సంగం’, కందిమళ్ల ప్రతాపరెడ్డి ‘బందూక్’, సర్పల్లి కృష్ణారెడ్డి ‘ఉప్పెన’ అనే నవలలను రచించారు. ఇల్లిందల సరస్వతీదేవి ‘బాంచెన్ కాల్మొక్త’ అనే నవలను, ముదిగంటి సుజాతారెడ్డి ‘మలుపు తిరిగిన చక్రాలు’ అనే నవలను రచించారు. తెలంగాణ తొలి తరం రచయిత పొట్లపల్లి రామారావు నీలవేణి అనే దాసి ఇతివృత్తంతో నవలా రచనకు పూనుకున్నప్పటికీ అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. ప్రముఖ కవి జ్వాలాముఖి ‘వేలాడిన మందారం’ అనే నవల రాశారు. విప్లవోద్యమంలో చెరబండరాజు ‘మాపల్లె’, ‘ప్రస్థానం’ మొదలైన నవలలు; అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’, ‘వసంత గీతం’ నవలలను రాశారు. సాహుతో కలిసి అల్లం రాజయ్య ‘కొమురం భీం’ అనే నవలను రాశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి మాదిరెడ్డి సులోచన అనేక నవలలు రాశారు. 1969 తెలంగాణ ఉద్యమంపై ‘సంధ్యారాగం’ అనే నవలను ఆమె రాశారు.

సామాజిక పరిణామాలను నవలలో చక్కగా చిత్రిస్తారన్న ఖ్యాతి పొందిన అంపశయ్య నవీన్ చైతన్య స్రవంతి శిల్పంలో ‘అంపశయ్య’ నవల రాశారు. దీనికి సీక్వెల్‌గా ‘ముళ్లపొదలు’, ‘అంతస్స్రవంతి’ నవలలు రచించారు. ‘కాల రేఖలు’, ‘విచలిత’, ‘సౌజన్య’ తదితర ఇతర నవలలు కూడా రాశారు. ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ ‘రేవతి’ అనే నవల వెలువరించారు. గూడ అంజయ్య ‘పొలిమేర’ అనే నవల రాశారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని లోకేశ్వర్ తన నవల ‘సలాం హైదరాబాద్’లో చిత్రించారు.ప్రసిద్ధ రచయితలు బి.ఎస్.రాములు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, వసంతరావు దేశ్‌పాండే, కె.వి. నరేందర్, జాతశ్రీ, కౌముది, వేముల ఎల్లయ్య, బోయ జంగయ్య, ముదిగంటి సుజాతారెడ్డి, జాజుల గౌరి, బొ మ్మ హేమాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, శాంతి ప్రబోధ, కాలువ మల్లయ్య, మలయశ్రీ,రామా చంద్రమౌళి, పెద్దిం టి అశోక్ కుమార్,దిలావర్, ఐతా చంద్ర య్య, కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎం.ప్రాణ్‌రావు, ప్రభాకర్ జైనీ, డా.శం కరయ్య, కె.రామచంద్రమూర్తి, శిరంశెట్టి కాంతారావు, స్కైబాబా, నందిగం కృష్ణారావు తదితరులు తెలంగాణ నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు.
డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
                                                                                                                                            9441046839

Comments

comments