5న కేబినెట్ కీలక భేటీ

Telangana Cabinet Meeting On August5th

 

కరోనా నియంత్రణ, నూతన సచివాలయం నమూనా, విద్యా సంవత్సరంలో మార్పులు, నియంత్రిత పంటల సాగుపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విభృంభణ కొనసాగుతున్న తరుణంలో ఈనెల 5వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షత ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణ, రోగ నిర్ధారణ పరీక్షలు, కరోనా నేపథ్యంలో వైద్య, విద్యా రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై రాష్ట్ర మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుందని తెలుస్తోంది. అలాగే కొత్త సచివాలయం నిర్మాణంతో పాటు నియంత్రిత సాగు వంటి అంశాలు మంత్రిమండలి ముందుకు చర్చకు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం, ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో వైరస్ విలయం తాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

అలాగే కరోనా నిర్ధారణ కేసులపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రివర్గ సమావేశంలో సిఎం కెసిఆర్ చర్చించనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుతం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో కోవిడ్..19 నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నప్పటకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి… వైరస్ బాగా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన కఠిన చర్యలు, కంటైన్మెంట్ ప్రాంతాలను మరింతగా పెంచే అంశంపై కూడా సిఎం కెసిఆర్ కూలంకషంగా చర్చించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా విద్యారంగంలో తీసుకొచ్చిన పలు సంస్కరణలతో పాటు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడం…. అందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. నూతన సచివాలయం నిర్మాణ డిజైన్లపై కూడా మంత్రివర్గ సమావేశంలో కూలంకషంగా చర్చించిన అనంతరం తుది నమూనాను కేబినెట్ ఆమోదించనుందని తెలుస్తోంది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 5న కేబినెట్ కీలక భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.