సత్వరమే బడ్జెట్ ప్రతిపాదనలు

Telangana Budget

 వివిధ శాఖలకు సిఎస్ ఆదేశాలు
 సెప్టెంబర్‌లో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం
 సమీక్షా సమావేశంలో జోషి వెల్లడి
 త్వరలో సిఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2019-2020) బడ్జెట్‌పై పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్‌ను అంకెల గారెడి వలే రూపొందించకుండా రియలిస్టిక్ (వాస్తవాలకు దర్పణం పట్టే విధం)గా ఉ ండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో సిఎం కెసిఆర్ నేతృత్వంలో త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో ప్రతి శాఖ నుంచి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలపై సిఎం కూలంకషంగా సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. తదంతరం శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. కాగా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి శనివారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనల వివరాలను వెంటనే ఆర్ధిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు.

బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ మాసంలో జరిగే అవకాశం ఉన్నదన్నారు. ఈ ప్రతిపాదనలపై కెసిఆర్ త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని, శాఖలు వెంటనే తమ ప్రతి పాదనలు పంపాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖ మంత్రులతో సమీక్షా సమావేశాలు వెంటనే పూర్తి చేయాలని సిఎస్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను, కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. గత సంవత్సరపు కేటాయింపులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆదాయాన్ని సమకూర్చే శాఖలు తమ అంచనాల ప్రకారం ఆదాయాల సముపార్జనకు ప్రత్యేక దృష్టితో కృషి చేయాలన్నారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు బడ్జెట్ ప్రతిపాదనలలో పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. శాఖల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, చిత్రా రామచంద్రన్, అధర్ సిన్హా, సోమేష్ కుమార్, శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్, పార్ధసారథి, వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, జనార్ధన్ రెడ్డి, బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, నిరంజన్ రావు, వాణిజ్య పన్నులు, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Budget Session in September

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సత్వరమే బడ్జెట్ ప్రతిపాదనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.