సంక్షేమం, వికాసం

           పరిమితమైన పిండితో కూడా పసందైన రొట్టెను తయారు చేయగలగడమే జన హిత పాలకుల లక్షణం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు శాసన సభకు సమర్పించిన 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఈ సామర్థం, నేర్పు పరిపూర్ణంగా రుజువయ్యాయి. దేశాన్ని అలముకున్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బడ్జెట్‌ను వాస్తవిక దృక్పథంతో తయారు చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల అధికారులకు పలుమార్లు సూచించి ఉన్నారు. అది ఈ బడ్జెట్ నిర్మాణంలో […] The post సంక్షేమం, వికాసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

           పరిమితమైన పిండితో కూడా పసందైన రొట్టెను తయారు చేయగలగడమే జన హిత పాలకుల లక్షణం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు శాసన సభకు సమర్పించిన 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఈ సామర్థం, నేర్పు పరిపూర్ణంగా రుజువయ్యాయి. దేశాన్ని అలముకున్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బడ్జెట్‌ను వాస్తవిక దృక్పథంతో తయారు చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల అధికారులకు పలుమార్లు సూచించి ఉన్నారు. అది ఈ బడ్జెట్ నిర్మాణంలో ప్రతిబింబించింది. ఆదిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో 1,82,017 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించగా పూర్తి స్థాయి బడ్జెట్‌లో దానిని 1,46,492 కోట్లకు తగ్గించుకోవలసి వచ్చింది.

రాబడిని బట్టి ఖర్చు అనే క్రమశిక్షణాయుత ఆర్థిక సూత్రాన్ని ఈ బడ్జెట్ రూపకల్పనలో పాటించారు. అదే సమయంలో సంక్షేమం, వ్యవసాయం వంటి కీలక రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ వంటి భారీ సాగు నీటి ప్రాజెక్టులకు అభయం ప్రకటించారు. ముందుగా అన్ని శాఖల్లోనూ గల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ తర్వాతనే కొత్త పనులు చేపట్టాలనే విధాన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రత్యేకించి గమనించదగినది. జాతీయ స్థాయిలో 201819 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 8 శాతం వృద్ధిరేటు వర్తమాన (201920) సంవత్సరం అదే కాలంలో 5 శాతానికి పడిపోగా మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం 201819లో 8.1 శాతం వృద్ధిని సాధించడం సామాన్యమైన విషయం కాదు.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అంచనాలకు మించి, కోటి పైగా ఎకరాల్లో వరి సాగవుతూ ఉండడం గమనార్హం. రుణ మాఫీ, రైతు బంధు, రైతు బంధు బీమా వంటి వినూత్న పథకాల ద్వారానూ ఇరిగేషన్ వంటి రంగాలకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానూ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి పట్ల విశేషంగా దృష్టి కేంద్రీకరిస్తున్నందువల్లనే ఇదంతా సాధ్యమవుతున్నది. ఈ బడ్జెట్‌లోనూ వ్యవసాయానికి ఇంకెక్కడా లేని రీతిలో విశేష కేటాయింపులు చేయడం నిపుణుల ప్రశంసలందుకుంటున్నది. సమైక్య రాష్ట్రం చివరి 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతంలో రూ. 54,052 కోట్లు మాత్రమే మూలధన వ్యయం (అభివృద్ధి పెట్టుబడి) చేయగా, ప్రత్యేక రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఇందుకు 1,03,551 కోట్లు ఖర్చు చేయడం మరో విశేషం. కేవలం బడ్జెట్ కేటాయింపుల నుంచే కాకుండా పలు సంస్థల నుంచి తెచ్చిన నిధులు కూడా పెట్టి ఇంతటి భారీ మూలధన పెట్టుబడిని పెట్టగలగడం కెసిఆర్ ప్రభుత్వ సంకల్ప శుద్ధిని, సిద్ధిని రుజువు చేస్తున్న అంశం.

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయం 12.89 శాతం కాగా, అన్ని జనరల్ కేటగిరీ రాష్ట్రాల సగటు 14.2 శాతం కాగా, మన రాష్ట్రంలో అది 16.9 శాతానికి చేరడం మరో ముఖ్యమైన అంశం. అలాగే 201819లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 10.5 శాతాన్ని తాకింది. ఇది ఉమ్మడి రాష్ట్రం చివరి రెండు సంవత్సరాల్లో 4.2 శాతానికి మించలేదు. గత ఐదేళ్లలో వాణిజ్య పన్నుల్లో 13.6 శాతం సగటు వృద్ధిని సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఈ వృద్ధి కేవలం 6.61 శాతంగా నమోదయింది. రాబడి సూచీలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ సంక్షేమాది కీలక రంగాలకు విశేషమైన కేటాయింపులతో ఈ బడ్జెట్ ప్రజాహిత ప్రత్యేకతను పుష్కలంగా సంతరించుకున్నది. పన్నుల ద్వారా వచ్చే రాబడి మాత్రమే కాకుండా ఇతరత్రా ఆదాయం కూడా పతన దిశలోనున్నది. కేంద్రం నుంచి పన్ను ఆదాయ వాటా, నిధుల బదలాయింపు కూడా కోతకు గురయ్యాయి. అయినా బడ్జెట్ ఉన్నంతలో అత్యుత్తమంగా రూపొందింది.

మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో సగానికి పైగా అంటే 75,263.24 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు కేటాయించడంలో జన వికాస లక్ష సాధన పట్ల తనకున్న శ్రద్ధను, నిబద్ధతను ప్రభుత్వం సందేహాతీతంగా చాటుకున్నది. ఆసరా వంటి పథకాలకు సముచితమైన కేటాయింపులు చేసింది. ఆరోగ్య శ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి స్కీములకు నిధుల వర్షం కురిపించడానికి నిర్ణయించింది. పరిపాలన రంగంలోనైతే జిల్లాల సంఖ్యను భారీగా పెంచడం మారు మూల పల్లెలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక పంచాయితీలుగా మార్చడం వంటి విప్లవాత్మక చర్యలను తీసుకున్న ప్రభుత్వం కొత్త చట్టాలను కూడా తీసుకు వస్తున్నది. ఈ మార్పులు అనివార్యంగా ప్రభుత్వమ్మీద ఆర్థిక భారాన్ని పెంచుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంత కష్ట కాలంలో కూడా సమగ్ర సంక్షేమ, వికాస బడ్జెట్ అవతరించడం అత్యంత సంతోషదాయకం.

Telangana Budget outlay hit by economic slow down

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంక్షేమం, వికాసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: